చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి అయ్యే ప్రసక్తే లేదని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. వ్యవసాయంపై మాట్లాడే హక్కు బాబుకు లేదని, ఈ విషయంలో ఆయన చెబుతున్న విషయాలన్నీ అబద్దాలేలని మండిపడ్డ బొత్స, జగన్ పాలనలోనే రైతులకు అన్ని రకాలుగా మేలు జరిగిందని అన్నారు. రైతులను కాల్చి చంపిన చరిత్ర చంద్రబాబుదన్నారు. జగన్ ప్రవేశ పెట్టిన రైతు భరోసా కేంద్రాలను దేశమంతటా పెట్టాలని కేంద్రం, పలు రాష్ట్రాలు ఆలోచిస్తుంటే బాబు మాత్రం వీటిపై విమర్శలు చేయడం దారుణమన్నారు.
చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటనలో చేసిన విమర్శలపై బొత్స స్పందించారు. జిల్లాకు బాబు, అశోక్ గజపతి రాజు ఏం మేలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. బొబ్బిలి షుగర్స్ ను ప్రైవేట్ కు అమ్మిందే చంద్రబాబు అని, ఇప్పుడు చెరకు రైతులపై ప్రేమ ఒలకబోస్తున్నారని విమర్శించారు. తోటపల్లి ప్రాజెక్టును తాను పూర్తి చేశానని చంద్రబాబు చెబుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని, నోటికి ఏది పడితే అది మాట్లాడితే జనం నమ్ముతారనుకుంటే ఎలా అంటూ బొత్స ఎద్దేవా చేశారు.
బిసిలను ముంచిందే టిడిపి అని, బిసి వర్గానికి చెందిన ఎంపిలు ఉండగా అశోక్ గజపతికి కేంద్ర మంత్రి పదవి ఎలా ఇప్పించారని, ఎర్రన్నాయుడి కుమారుడికి ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. విశాఖకు రాజధాని రావడం ఖాయమని పునరుద్ఘాటించారు. తాము గడప గడపకూ వెళ్లి చేసింది చెబుతున్నామని, గతంలో ఏ ప్రభుత్వం అయినా ఇలా చేసిందా అనేది ఆలోచించుకోవాలన్నారు.