దేశానికి దిశ, దశ చూపే రాజకీయ శక్తిగా బీఆర్‌ఎస్ పార్టీ ఆవిష్కృతం కాబోతుందని, పార్టీ జాతీయ అధ్యక్షులు, సీయం కేసీఆర్ తో కలిసి నడవాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ విస్తరణ, నాందేడ్ సభ సన్నాహకాల్లో భాగంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శనివారం నాందేడ్ జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కిన్వట్ తాలూకాలోని అప్పారావు పేట గ్రామంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పర్యటించి, బీఆర్ఎస్ పార్టీ మద్ధతుదారులను కలిసారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ… ఫిబ్రవరి 5న నాందేడ్ లో నిర్వహించనున్న సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చి బీఆర్ఎస్ కు సంఘీభావం తెలపాలని కోరారు. సభకు ముందు నాందేడ్ లోని సిక్కుల పవిత్ర స్థలం గురుద్వార్ ను సీయం కేసీఆర్ దర్శించుకుంటారని వెల్లడించారు.
గతంలో మనమందరం ఒకే రాష్ట్రంగా ఉన్నామని, దీంతో మహారాష్ట్ర – తెలంగాణ రాష్ట్రాలకు మంచి సంబంధాలు ఉన్నాయని, ఇక్కడి ప్రజలకు రక్త సంబంధీకులు, బందుత్వాలు ఉన్నాయని గుర్తు చేశారు. తెలంగాణలో అమలు చేస్తున్న అభివృద్ది, సంక్షేమ పథకాల ఫలాలు దేశ వ్యాప్తంగా ప్రతీ ఒక్కరికీ అమలు చేయాలనే ఉద్దేశ్యంతో సీయం కేసీఆర్… బీఆర్ఎస్ జాతీయ పార్టీని స్థాపించారన్నారని వివరించారు. .
కేంద్ర రాజకీయాల్లో బీఆర్‌ఎస్ ప్రాధాన్యత పెరగనుందని అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశ ప్రజలు గమనిస్తున్నారని, ఇదే తరహా అభివృద్ధిని దేశ ప్రజలు కోరుకుంటున్నారని, అందుకే బీఆర్ఎస్ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొన్నారు.