విశాఖపట్నం రాజధానిపై తాను చేసిన వ్యాఖ్యలు దుమారం లేపదడంతో వాటిపై కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలు విశాఖపట్నం ముఖ్య నగరమని, జిల్లా రాజధాని అనే ఉద్దేశంతో మాత్రమే చేసినవని స్పష్టం చేశారు. ఏపీ రాజధాని అమరావతి అనే విషయంపై బిజెపి పూర్తి స్పష్టతతో ఉందని, పార్టీ విధానానికి తాము కట్టుబడి ఉంటామని తేల్చి చెప్పారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ముగింపు సమావేశానికి హాజరైన కిషన్ రెడ్డి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి తరఫున పోటీ చేసున్న పీవీఎన్ మాధవ్ కు ఆనూలంగా ప్రచారం చేస్తూ ఆయన్ను గెలిపించాలని, విశాఖ రాజధాని నగరంలో అందరికీ అందుబాటులో ఉండే ఇలాంటి నేతను మళ్ళీ గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అయితే ‘రాజధాని’ వ్యాఖ్యలు సంచలనం రేకెత్తించడంతో కేంద్రమంత్రి వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
“ఎమ్మెల్సీ మాధవ్ గారి ఎన్నికల ప్రచారానికి సంబంధించిన పాత్రికేయ సమావేశంలో నేడు మాట్లాడుతూ, రోజు రోజుకూ అనేక రంగాలలో అభివృద్ధి సాధిస్తూ వస్తున్నటువంటి విశాఖపట్టణం వంటి జిల్లా కేంద్రంలో మాధవ్ లాంటి వ్యక్తిని మనం ఎమ్మెల్సీగా గెలిపించుకున్నట్లయితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పడం జరిగింది. ఇలా మాట్లాడుతూ ఉన్న సమయంలో మాట్లాడిన విశాఖ పట్టణం రాజధాని మాట, జిల్లా కేంద్రమైన విశాఖపట్టణాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడిన మాటే కానీ, రాష్ట్ర రాజధాని విశాఖపట్టణం అన్నది నా ఉద్దేశ్యం ఎంతమాత్రం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ‘అమరావతి’ అని మా పార్టీ ఇదివరకే చాలా స్పష్టతనిచ్చింది. మేము, మా పార్టీ నాయకులంతా కూడా ఇదే మాటకు కట్టుబడి ఉన్నాం” అంతూ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.