‘Sri Shobhakruth’ : ఐ-ధాత్రి పాఠకులు అందరికీ శ్రీశోభకృత్ నామ తెలుగు వత్సరాది.. ఉగాది శుభాకాంక్షలు. షడ్రుచుల పచ్చడి, పంచాంగ శ్రవణం ఉగాది విశిష్టతలు. ఈ ఏడాదంతా జీవితం ఎలా ఉండబోతోంది..? ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయి? గౌరవం, అవమానాల స్థాయి ఎంత..? వంటి విశేషాలను ఉగాది నాడు తెలుసుకోవడం తరతరాల ఆనవాయితీ. అందుకే, శ్రీశోభకృత్ సంవత్సరంలో.. మేషం మొదలు మీనం వరకు పన్నెండు రాశుల వారి వార్షిక గోచార ఫల విశేషాలు.. మీకోసం.
మేషం
ఆదాయం-5; వ్యయం-5
రాజపూజ్యం-3; అవమానం-1
మేష రాశివారికి, 21-04-2023 వరకు గురుడు మీనరాశిలోను, తర్వాత జన్మరాశి మేషంలోకి సువర్ణమూర్తిగా ప్రవేశిస్తాడు. శని ఈ సంవత్సరమంతా పదకొండవ ఇంట, కుంభంలో సువర్ణమూర్తిగాను సంచరిస్తాడు. రాహువు అక్టోబర్ 30 వరకు మేషంలో, తర్వాత కాలచక్రంలోని పన్నెండవ రాశి.. మీనంలోకి లోహమూర్తిగా ప్రవేశిస్తాడు. కేతువు అక్టోబర్ 30 వరకు తులారాశిలో, ఆ తర్వాత కన్యారాశిలో సువర్ణమూర్తిగా సంచరిస్తాడు.
మేష రాశివారికి ఈ సంవత్సరం ప్రతికూల ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. తలచిన వ్యవహారాలు పూర్తి కావు. విపరీతమైన ఆటంకాలు ఎదురవుతాయి. డబ్బు రాబడి గణనీయంగా తగ్గుతుంది. రావాల్సిన డబ్బు చేతికి అందదు.. పైగా రుణదాతల నుంచి ఒత్తిళ్లు పెరుగుతాయి. కొత్త అప్పులూ చేయాల్సి వస్తుంది. చేస్తున్న పనుల్లో ఏమాత్రం అభివృద్ధి కానరాదు. శుభకార్య ప్రయత్నాలకు కూడా ఆటంకాలు తప్పవు. కోర్టు వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కుటుంబంలో కలహాలు గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలో ఆచితూచి అప్రమత్తతో వ్యవహరించాలి.
ఉద్యోగాల్లోని వారికి, ఉన్నతాధికారులతో సఖ్యత ఉండదు. వేధింపులు, సస్పెన్షన్లు, ఇంక్రిమెంట్లలో కోత వంటి పరిణామాలు ఎదురవుతాయి. ఇష్టంలేని బదిలీలు, ప్రతి చిన్నదానికీ సంజాయిషీలు ఇచ్చుకోవాల్సి రావడం అసహనానికి కారణమవుతుంది. వ్యాపారులు తొందరపాటు పెట్టుబడుల వల్ల నష్టపోతారు. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి కాస్త మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు ఎంతగా శ్రమించినా ఆశించిన ఫలితం దక్కదు. ఉన్నత చదువులకు ఆటంకాలు ఏర్పడతాయి. క్రీడలు, సినీ, టీవీ రంగాల్లోని వారికి ప్రతిభకు తగ్గ గుర్తింపు లభించదు. కాంట్రాక్టర్లు డబ్బుకి బాగా ఇబ్బంది పడతారు. రాజకీయ రంగంలోని వారికి చేటు కాలం. పదవీభ్రష్టత్వం గోచరిస్తోంది. ప్రజాభిమానానికి దూరమయ్యే సూచనలూ ఉన్నాయి. వ్యవసాయ రంగంలోని వారికి తొలిపంట నష్టాన్నే మిగులుస్తుంది. రెండో పంట కాస్త ఊరటనిస్తుంది. మేషరాశి వారి మానసిక స్థితిగతుల్లో పెద్దగా మార్పులు ఉండవు.
మేషరాశివారు తరచూ శక్తిపీఠాలను సందర్శించడం, అమ్మవారికి కుంకుమార్చనలు చేయించడం మంచిది. దుర్గారాధన వల్ల మానసికంగా కొంత ఊరటను పొందుతారు.
***
వృషభం
ఆదాయం – 14 వ్యయం – 11
రాజపూజ్యం – 6 అవమానం – 1
వృషభరాశి వారికి 21-04-2023 వరకు గురుడు మీనరాశిలో, ఆ తర్వాత పన్నెండో స్థానం మేషరాశిలో లోహమూర్తిగా ఉంటాడు. శని ఈ సంవత్సరమంతా పదో ఇంట, కుంభరాశిలో తామ్రమూర్తిగా సంచరిస్తాడు. రాహువు అక్టోబర్ 30 వరకు మేషరాశిలోను, ఆ తర్వాత పదకొండో ఇంట, మీనరాశిలో సువర్ణమూర్తిగాను, కేతువు అక్టోబర్ 30 వరకు తులారిశిలోను, ఆ తర్వాత పంచమ స్థానం కన్యలోను రజతమూర్తిగా సంచరిస్తారు.
వృషభ రాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనాదాయం మెరుగ్గా ఉంటుంది. అయితే అంతకు మించిన ఖర్చులు వచ్చిపడడం వల్ల.. డబ్బుకి ఇబ్బంది పడతారు. గృహ సంబంధ విషయాలు సానుకూలంగా సాగుతాయి. ఇంట్లో వివాహాది శుభ కార్యాలు నిర్వహిస్తారు. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శన సూచనలూ ఉన్నాయి. గృహ నిర్మాణ, వాహన, ఆభరణాల కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వివిధ వృత్తులలోని వారికి తరచూ ఆటంకాలు ఎదురవుతుంటాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యం కోసం విపరీతంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ప్రమాదాలకు ఆస్కారం ఉంది.
ఉద్యోగస్తులకు చికాకులు తప్పవు. ఇష్టంలేని చోటికి బదిలీ, అకారణ సస్పెన్షన్లు గోచరిస్తున్నాయి. ప్రైవేటు సంస్థల్లో పనిచేసేవారికి నిలకడ లోపిస్తుంది. తరచూ ఉద్యోగాలు మారుతుంటారు. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం లాభనష్టాలు సమంగా ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసిరావు. భాగస్వాములు విడిపోయే సూచనలున్నాయి. చేతి వృత్తుల వారికి సామాన్య ఫలమే ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మిశ్రమ ఫలితం లభిస్తుంది. విద్యార్థుల కష్టానికి తగ్గ ఫలితం ఉంటుంది. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే సూచనలున్నాయి. క్రీడాకారులు, సినీ, టీవీ రంగాల్లోని వారికి ఉత్సాహవంతమైన సంవత్సరమనే చెప్పాలి. కాంట్రాక్టర్లకు బిల్లుల సకాలంలో వసూలు కాక ఇబ్బంది పడతారు. రాజకీయ రంగంలోని వారికి గడ్డు పరిస్థితులు గోచరిస్తున్నాయి. ప్రజలను సంతృప్తి పరిచే క్రమంలో.. మానసిక ప్రశాంతతను కోల్పోతారు. వ్యవసాయ రంగంలోని వారికి కాస్త ప్రయోజనకరంగానే ఉంటుంది.
వృషభరాశి వారు నిత్యం నవగ్రహాలను సందర్శించడం మంచిది. తరచూ శివాభిషేకం, శనికి తైలాభిషేకం చేసుకుంటే ఊరట కలుగుతుంది.
***
మిథునం
ఆదాయం – 2 వ్యయం – 11
రాజపూజ్యం – 2 అవమానం – 4
మిథున రాశివారికి గురుడు 21-04-2023 వరకు మీనరాశిలో, తర్వాత పదకొండో ఇంట మేషరాశిలో సువర్ణమూర్తిగా సంచరిస్తాడు. శని సంవత్సరమంతా తొమ్మిదవ ఇంట కుంభరాశిలో ఉంటాడు. రాహువు అక్టోబర్ 30 వరకు మేషంలో, అనంతరం పదో ఇంట మీనరాశిలో తామ్రమూర్తిగాను, కేతువు అక్టోబర్ 30 తర్వాత నాలుగో ఇంట కన్యలో లోహమూర్తిగాను సంచరిస్తారు.
ఈ రాశివారికి శ్రీ శోభకృత్ మెరుగైన ఫలితాలనే ఇస్తుంది. ఏరంగంలోని వారికైనా శుభప్రదంగా ఉంటుంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లోని సమస్యలు ఈ సంవత్సరం పరిష్కారం అవుతాయి. స్థలం లేదా ఇంటి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వస్త్రాభరణాలు, వాహనాలను సమకూర్చుకునే సూచనలు ఉన్నాయి. పెద్దలు, అధికారుల ఆదరాభిమానాలు సంపాదించుకుంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. కొత్త స్నేహాలు లాభదాయకంగా ఉంటాయి. అభీష్టాలు నెరవేర్చుకుంటారు. రుణాల చెల్లింపు ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామితో సఖ్యత ఉంటుంది. కుటుంబంలోని చికాకులన్నింటినీ తొలగించుకుంటారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వృత్తిదారులకు అనుకూలమైన ఫలితాలుంటాయి.
ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరుగుతాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. కోరుకున్న చోటికి బదిలీ అవుతుంది. నిరుద్యోగులకు ఈ సంవత్సరం బాగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారులు ఈ ఏడాది గణనీయమైన లాభాలు పొందుతారు. వస్తువులు, సరకులు నిల్వ చేయడం వల్ల ఆశించిన ప్రయోజనాలను పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసివస్తాయి. క్రీడాకారులు, సినీ, టీవీ రంగాల్లోని వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ధనాదాయంతో పాటు, చక్కటి గుర్తింపూ లభిస్తుంది. కాంట్రాక్టర్లలో స్వల్పమొత్తంతో చేసే పనులకు చక్కటి లాభాలు వస్తాయి. రాజకీయ నాయకులకు కాస్త మెరుగైన ఫలితాలే లభిస్తాయి. గౌరవం, ప్రజాదరణ పెరుగుతాయి. అనూహ్యంగా పదవిని పొందుతారు. వ్యవసాయ రంగంలోని వారికి రెండు పంటలూ లాభదాయకంగా ఉంటాయి. జలచర సంబంధ సేద్యం చేసేవారికి బాగా అనుకూలంగా ఉంటుంది.
మిథున రాశివారు.. సంవత్సరలో అడపాదడపా ఏర్పడే ఇబ్బందులు తొలగిపోయేందుకు గురు, రాహువులకు పూజలు చేయించడం మంచిది. నిత్యం దుర్గాదేవిని ఆరాధించడం, అమ్మవారికి కుంకుమ అర్చన చేయించడం శుభప్రదం.
***
కర్కాటకం
ఆదాయం – 11 వ్యయం – 8
రాజపూజ్యం – 5 అవమానం – 4
కర్కాటక రాశివారికి గురుడు 21-04-2023 వరకు మీనరాశిలోను, తర్వాత పదో ఇంట మేషరాశిలో తామ్రమూర్తిగా సంచరిస్తాడు. శని ఈ ఏడాదంతా అష్టమ స్థానం కుంభరాశిలో లోహమూర్తిగా ఉంటాడు. అక్టోబర్ 30 వరకు.. రాహువు మేషంలో, తర్వాత తొమ్మిదో ఇంట మీనంలో రజతమూర్తిగా, కేతువు తులలో, అనంతరం మూడింట కన్యారాశిలో తామ్రమూర్తిగా సంచరిస్తారు.
శ్రీ శోభకృత్ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అవసరానికి సరిపడినంత డబ్బు సకాలంలో సమకూరుతుంటుంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు ఈ ఏడాది పూర్తవుతాయి. ఆస్తి కూడబెట్టే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇల్లు కట్టేందుకు అప్పు చేయాల్సి వస్తుంది. సమాజంలో పరువు ప్రతిష్టలు వృద్ధి చెందుతాయి. బాధ్యతలు పెరుగుతాయి. ఇంటికి కాస్త దూరంగా గడపాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులను అనారోగ్యం వేధిస్తుంది. ముఖ్యంగా తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి చికిత్సల కోసం అధికంగా ఖర్చు చేయాల్సి వస్తుంది. తీర్థయాత్రలకు వెళతారు. చేస్తున్న పనుల్లో ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి. మనసు నిలకడగా ఉండదు. కొత్త స్నేహాలు లాభదాయకంగా ఉంటాయి.
ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. పని ఒత్తిడి ఎక్కువగానే ఉన్నా, కోరుకున్న చోటికి, ఇష్టమైన సీటుకి బదిలీ అవుతుంది. ప్రమోషన్లు అందుకుంటారు. నిరుద్యోగులకు బాగా యోగవంతమైన కాలం. వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారు అప్రమత్తంగా ఉండాలి. భాగస్వాములతో వ్యవహారం చెడే సూచనలున్నాయి. విద్యార్థులు మంచి ఫలితాల కోసం బాగా శ్రమించాల్సి వుంటుంది. క్రీడాకారులు, సినీ, టీవీ రంగాల్లోని వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అయితే ఆశించినంత గుర్తింపు లభించకపోవచ్చు. కాంట్రాక్టర్లకు అడుగడుగునా ఆటంకాలు సూచిస్తున్నాయి. చేసిన పనికి ఫలితం లభించని పరిస్థితి ఉంటుంది. రాజకీయాల్లోని వారికి ప్రజల్లో ఆదరణ తగ్గుతుంది. ఆశించిన పదవులు కూడా దక్కని స్థితి. వ్యవసాయదారులకు పంటల దిగుబడి బాగానే ఉన్నా, గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడతారు.
కర్కాటక రాశివారు, మేలిమి ఫలితాల కోసం.. ఈ ఏడాది శనికి తైలాభిషేకం, సుబ్రహ్మణ్య స్వామిని, శివుణ్ణి ఆరాధించడం మంచిది.
***
సింహం
ఆదాయం – 14 వ్యయం – 2
రాజపూజ్యం – 1 అవమానం – 7
సింహరాశి వారికి 21-04-2023 వరకు గురుడు మీనరాశిలోను, ఆ తర్వాత తొమ్మిదో ఇంట మేషరాశిలో రజతమూర్తిగా సంచరిస్తాడు. శని సంవత్సరమంతా ఏడో స్థానం కుంభరాశిలో తామ్రమూర్తిగా ఉంటాడు. రాహువు అక్టోబర్ 30 వరకు మేషరాశిలో, ఆ తర్వాత, ఎనిమిదో స్థానం మీనరాశిలో లోహమూర్తిగాను, కేతువు అక్టోబర్ 30 వరకు తులారాశిలో, తర్వాత రెండో ఇంట కన్యలో రజతమూర్తిగా సంచరిస్తారు.
కష్టాలు క్రమంగా తొలగిపోతాయి. గడచిన సంవత్సరం కన్నా మెరుగైన ఫలితాలుంటాయి. ధనదాయం బాగుంటుంది. ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. వివాహాది శుభకార్యాలను నిర్వహిస్తారు. సమాజంలో పరువు ప్రతిష్టలు బాగా వృద్ధి చెందుతాయి. మాట పలుకుబడి పెరుగుతుంది. కొత్తగా ఏ ప్రయత్నం చేసేందుకైనా ఇది అనుకూలమైన కాలం. చేపట్టిన పనులు లాభదాయకంగా పూర్తవుతాయి. విదేశీ ప్రయాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధుమిత్రులను కలుస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటుంటారు. పుణ్యక్షేత్ర సందర్శనకు ప్రయాణాలు చేస్తారు. ఎంచుకున్న వృత్తిలో గౌరవం, పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. కుటుంబంలో సుఖ శాంతులు నెలకొంటాయి. విలువైన వస్తువుల విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. నమ్మిన వారే మోసగించడం బాధిస్తుంది. పెరిగిన బాధ్యతలు మిమ్మల్ని పని ఒత్తిడికి గురి చేస్తాయి. అయితే చాకచక్యంతో కార్యాలు సాధిస్తారు. బద్ధకాన్ని వదిలితే చాలా మెరుగ్గా ఉంటుంది. స్థూలంగా సింహరాశి వారికి శ్రీ శోభకృత్ సంవత్సరంలో అన్ని విధాలా అభివృద్ధి కరంగా ఉంటుంది.
ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికంగానే ఉంటుంది. ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి. అయితే అవి మిమ్మల్ని సంతృప్తి పరచలేవు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. వ్యాపారులకు శ్రీశోభకృత్ అత్యంత లాభదాయకంగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలోని వారికి మంచి లాభాలు దక్కుతాయి. చిన్నతరహా వ్యాపారాలు, చేతి వృత్తుల వారు చక్కటి లాభాలు పొందుతారు. విద్యార్థులు మెరుగైన ప్రతిభను కనబరుస్తారు. విదేశాల్లో చదువుకునేందుకు అనుకూలమైన కాలం. క్రీడాకారులు, సినీ, టీవీ రంగాల్లోని వారికి చక్కటి గుర్తింపు లభిస్తుంది. కెరీర్ విజయపథంలో సాగుతుంది. కాంట్రాక్టర్లకు పాత బిల్లులు కూడా వసూలవుతాయి. రాజకీయ నాయకులకు ప్రజల అండదండలు లభిస్తాయి. పదవులూ వరిస్తాయి. వ్యవసాయదారులకు దిగుబడులు గణనీయంగా ఉంటాయి. ఉత్పత్తులకు తగిన గిట్టుబాటు ధర లభిస్తుంది.
సింహరాశి వారు మరిన్ని శుభ ఫలితాల కోసం శనికి తైలాభిషేకం, ఆంజనేయ స్వామికి అర్చనాదులు, దుర్గాదేవికి కుంకుమ పూజను చేయడం చాలా మంచిది.
***
కన్య
ఆదాయం – 2 వ్యయం – 11
రాజపూజ్యం – 4 అవమానం – 7
ఈ రాశివారికి 21-04-2023 వరకు గురుడు మీనరాశిలోను, ఆ తర్వాత ఎనిమిదో ఇంట మేషరాశిలో లోహమూర్తిగా సంచరిస్తాడు. శని సంవత్సరమంతా ఆరో ఇంట కుంభరాశిలో ఉంటాడు. రాహువు అక్టోబర్ 30 వరకు మేషంలో, ఆ తర్వాత ఏడో ఇంట మీనరాశిలో తామ్రమూర్తిగాను, కేతువు అక్టోబర్ 30 వరకు తులలోను ఆ తర్వాత జన్మరాశి కన్యలోనూ సంచరిస్తారు.
కన్యారాశి వారు శ్రీ శోభకృత్ సంవత్సరంలో అత్యంత అప్రమత్తంగా మెలగాలి. తలచిన ప్రతి కార్యానికీ విపరీతమైన ఆటంకాలు వస్తాయి. ఏ పని చేసినా వ్యతిరేక ఫలితమే వస్తుంది. డబ్బుకి బాగా ఇబ్బందిగా ఉంటుంది. అన్ని రంగాల్లోని వారికి.. ఏదీ కలసి రాకపోవడం, అప్పులు చేయాల్సి రావడం మానసిక వేదనకు కారణమవుతుంది. అనవసర వ్యవహారాల్లో తలదూర్చడం ద్వారా అవమానాలు, నిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంట్లో వివాహాది శుభకార్యాలు నిర్వహించేందుకు చేసే ప్రయత్నాలూ అనుకూలించవు. పైగా ఎన్నో ఒడుదుడుకుల వల్ల విపరీతమైన జాప్యం ఏర్పడుతుంది. కుటుంబంలో చికాకులు అధికమవుతాయి. జీవిత భాగస్వామి చర్యలు ఆగ్రహాన్ని తెప్పిస్తాయి. ఇద్దరి మధ్య మనస్పర్థలు పెరిగే సూచనలున్నాయి. సంతాన సంబంధ అంశాల్లో విపరీతమైన చికాకులు, చిక్కులు ఎదురవుతాయి. ఇతరులకు ఇచ్చిన హామీలు నిలుపుకోలేని పరిస్థితి వల్ల మాట పడాల్సి వస్తుంది. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. పెద్దల కోపానికి గురవుతారు. మానసిక స్థితి ఆందోళనకరంగా ఉంటుంది. విలువైన వస్తువులను అత్యంత జాగ్రత్తగా ఉంచుకోండి. నమ్మినవారే మోసం చేస్తారు.
ఉద్యోగస్తులకు అధికారుల వల్ల సమస్యలు వస్తాయి. వేధింపులు, ఇష్టం లేని చోటికి, సీటుకు ఆకస్మిక బదిలీలు ఉంటాయి. పని ఒత్తిడి పెరుగుతుంది. ఏమరుపాటుగా లేకుంటే ఉద్యోగానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపార రంగంలోని వారికి లాభనష్టాల కన్నా, కోర్టు చికాకులు ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. భాగస్వామ్య వ్యాపారాలు బాగా దెబ్బతింటాయి. భాగస్వాములతో విరోధాల వల్ల న్యాయస్థానాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంటుంది. విద్యార్థులకు కష్టానికి తగిన ఫలితం ఉండదు. క్రీడాకారులు, సినీ, టీవీ రంగాల్లోని వారికి ఏమాత్రం ప్రోత్సాహకరంగా లేదు. ఎంతగా శ్రమించినా ఆశించిన లక్ష్యం నెరవేరదు. కాంట్రాక్టర్లకు బాగా గడ్డు కాలం. అప్పులు చేసి ముగించిన పనులకూ బిల్లులు రాక సతమతం అవుతారు. రాజకీయ నాయకులు ప్రజాక్షేత్రంలో అవమానాలు ఎదుర్కొంటారు. గౌరవ ప్రతిష్టలు తగ్గుతాయి. పార్టీలకు, పదవులకు దూరమయ్యే సూచనలున్నాయి. వ్యవసాయ రంగంలో ప్రకృతి వైపరీత్యం వల్ల నష్టాలు సంభవిస్తాయి. అప్పులు బాధలు, మధ్య దళారీల చేతిలో మోసపోవడం వంటివి ఎదురవుతాయి.
కన్యారాశి వారు శ్రీ శోభకృత్ ప్రతికూల ఫలితాల నుంచి బయటపడేందుకు.. నవగ్రహారాధన, గోసేవ, దుర్గాదేవి ఆరాధనలు చేయడం ఉత్తమం.
***
తుల
ఆదాయం – 14 వ్యయం – 11
రాజపూజ్యం – 7 అవమానం – 7
తులారాశి వారికి 21-04-2023 వరకు గురుడు మీనరాశిలోను, ఆ తర్వాత ఏడో ఇంట మేషరాశిలో తామ్రమూర్తిగాను సంచరిస్తాడు. శని సంవత్సరమంతా ఐదో ఇంట్లో కుంభరాశిలో రజతమూర్తిగా ఉంటాడు. రాహువు అక్టోబర్ 30 వరకు మేషరాశిలో, ఆ తర్వాత ఆరో ఇంట మీనరాశిలో సువర్ణమూర్తిగాను, కేతువు అక్టోబర్ 30 వరకు తులారాశిలో, ఆ తర్వాత పన్నెండో ఇంట కన్య రాశిలో లోహమూర్తిగా సంచరిస్తారు.
తులారాశి వారికి ఇంతకాలం పడ్డ కష్టాలన్నింటినీ శ్రీ శోభకృత్ సంవత్సరం తొలగించేస్తుంది. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగుతాయి. అభీష్టాలన్నింటినీ నెరవేర్చుకుంటారు. ధనాదాయం బాగుంటుంది. బాధ్యతలు పెరుగుతాయి. అధికార వర్గంలో ఆధిక్యాన్ని సాధిస్తారు. సమాజంలో గౌరవము, పలుకుబడి బాగా వృద్ధి చెందుతాయి. శత్రువుల బెడద తొలగిపోతుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలతో ఎంచుకున్న రంగాల్లో ముందంజ వస్తారు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంతానాభిలాషులు శుభవార్తను వింటారు. పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. ఆస్తి తగాదాలు, కుటుంబ సమస్యలకు సంబంధించిన కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. స్థూలంగా తులారాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది.
ఉద్యోగులకు ప్రమోషన్లు లభిస్తాయి. అభీష్ట ప్రాంతానికి బదిలీ అవుతారు. ధనాదాయం బాగుంటుంది. అయితే పని ఒత్తిడి అధికమవుతుంది. నిరుద్యోగులు శుభ వార్తను వింటారు. వ్యాపార రంగంలోని వారికి.. ముఖ్యంగా స్వతంత్ర వృత్తుల వారికి మేలిమి ఫలితాలు లభిస్తాయి. కొత్త పెట్టుబడులకు, వ్యాపారాన్ని విస్తరించేందుకు అనుకూలమైన కాలం. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. చదివిన దానికి తగ్గ ఫలితం ర్యాంకుల రూపంలో లభిస్తుంది. క్రీడాకారులు, సినీ, టీవీ రంగాల్లోని వారికి.. మేలిమి కాలం. ఈ రంగంలోని వారి సామర్థ్యానికి తగ్గ అవకాశాలు, గుర్తింపు లభిస్తాయి. ఆదాయ వనరులూ పెరుగుతాయి. కాంట్రాక్టర్లకు ఇన్నాళ్లు పడ్డ వెతలు తీరిపోతాయి. లాభదాయకమైన పనులు చేస్తారు. రాజకీయ రంగంలోని వారికి కూడా శుభదాయకంగా ఉంటుంది. గుర్తింపునిచ్చే పదవి లభిస్తుంది. ప్రజాభిమానాన్ని చూరగొంటారు. వ్యవసాయ రంగంలోని వారికి ముఖ్యంగా పండ్లతోటలు, కాయగూరల రైతులకు పట్టింది బంగారంలా ఉంటుంది.
తులారాశి వారు మరిన్ని మేలిమి ఫలితాల కోసం శ్రీవేంకటేశ్వర స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి వార్లను తరచూ దర్శిస్తూ ఉండాలి. నవగ్రహాలను పూజించడమూ మంచిదే.
***
వృశ్చికం
ఆదాయం – 5 వ్యయం – 5
రాజపూజ్యం – 3 అవమానం – 3
వృశ్చిక రాశివారికి గురుడు 21-03-2023 వరకు మీనరాశిలోను, ఆతర్వాత ఆరో ఇంట మేషరాశిలోనూ సువర్ణమూర్తిగా సంచరిస్తాడు. శని సంవత్సరమంతా నాలుగో ఇంట కుంభరాశిలో లోహమూర్తిగా ఉంటాడు. రాహువు అక్టోబర్ 30 వరకు మేషంలో, ఆ తర్వాత ఐదో ఇంట మీనరాశిలో రజతమూర్తిగా, కేతువు అక్టోబర్ 30 తర్వాత పదకొండో ఇంట కన్యలో సువర్ణమూర్తిగాను సంచరిస్తారు.
వృశ్చికరాశి వారికి శ్రీ శోభకృత్ సంవత్సరం అంత ఫలప్రదంగా ఉండదనే చెప్పాలి. ప్రతి పనికీ ఆటంకాలు ఎదురవుతుంటాయి. చిన్న విషయానికి కూడా విపరీతంగా శ్రమించాల్సి వస్తుంది. అనవసర విషయాలకు డబ్బు ఖర్చవుతుంది. వ్యవహారాల్లో ధననష్టం గోచరిస్తోంది. అప్పులు చేయాల్సి వస్తుంది. బంధు, మిత్రులతో విభేదాలు ఏర్పడతాయి. వివాహాది శుభకార్యాచరణలో అనూహ్యంగా ఆటంకాలు వస్తాయి. స్థిరాస్తి విక్రయాలు లాభదాయకంగా ఉండవు. ప్రయాణాలు లాభించవు. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. శారీరక, మానసిక శ్రమ, త్రిప్పట తప్పవు. వాత సంబంధ సమస్యలు ఇబ్బంది పెడతాయి. అనైతిక సంబంధాల వల్ల నిందలు, అవమానాలు ఎదురవుతాయి. పరువు ప్రతిష్టలకు ముప్పు ఏర్పడుతుంది. ఆందోళన అధికమవుతుంది. తెలివితేటలకు గుర్తింపు లభించదు. శత్రువులు వృద్ధి చెందుతారు. రుణ బాధలు, రోగ బాధలు వేధిస్తాయి.
ఉద్యోగస్తులకు తీవ్ర ఒత్తిడి ఉంటుంది. అధికారులతో విభేదాల వల్ల ఇష్టంలేని పనులు చేయాల్సి రావడం, ఇష్టంలేని చోటుకు బదిలీ కావడం మానసిక ఆందోళనకు కారణమవుతాయి. వ్యాపార రంగంలోని వారు అప్రమత్తంగా లేకుంటే దారుణంగా దెబ్బతినే పరిస్థితి ఉంది. అధికారులు విధించే శిక్షలకు గురవుతారు. కొత్త పెట్టుబడులకు ఏమాత్రం అనుకూలం కాదు. కొత్త అప్పులు చేయాల్సి వస్తుంది. విద్యార్థులకు పరీక్షల్లో చదివింది గుర్తుకు రాని పరిస్థితి ఉంటుంది. ఏకాగ్రత, స్థిరచిత్తంతో అవిశ్రాంతంగా శ్రమిస్తేనే పరీక్షల్లో గట్టెక్కుతారు. క్రీడా, సినీ, టీవీ రంగాల్లోని వారికి పెద్దగా గుర్తింపు ఉండదు. ఏ పని చేసినా నష్టదాయకంగానే ఉంటుంది. అంచనాలకు మించి ధనవ్యయం కావడం, కెరీర్‌లో ఫెయిల్యూర్స్ కుంగదీస్తాయి. కాంట్రాక్టర్లు సహనంతో ఉండాలి. పనులు మధ్యలో ఆగిపోవడం, బిల్లులు రాకపోవడం వల్ల నష్టపోయే సూచనలున్నాయి. రాజకీయ రంగంలోని వారు ప్రజాసమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధి లేమి వల్ల అవమానాలను ఎదుర్కొంటారు. పదవీచ్యుతులయ్యే సూచనలూ ఉన్నాయి. వ్యవసాయ రంగంలోని వారికి దిగుబడులు ఆశాజనకంగానే ఉన్నా, ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయే వీలుంది.
వృశ్చిక రాశివారు, శ్రీ వేంకటేశ్వర స్వామి, దుర్గాదేవిలను అనునిత్యం ఆరాధించాలి. కనకదుర్గకు తరచూ కుంకుమార్చన చేయించడం వల్ల.. గడ్డు పరిస్థితుల్లోనూ స్వల్ప సాంత్వన లభిస్తుంది.
***
ధనుస్సు
ఆదాయం – 8 వ్యయం – 11
రాజపూజ్యం – 6 అవమానం – 3
ధనుస్సు రాసి వారికి శ్రీ శోభకృత్ సంవత్సరం సకల శుభాలనూ చేకూర్చబోతోంది. అభీష్టాలు నెరవేరతాయి. ధనలాభం ఉంది. ధనాదాయ మార్గాలూ పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం గోచరిస్తోంది. తలపెట్టిన ప్రతి కార్యమూ విజయవంతం అవుతుంది. కృషికి తగ్గ ఫలితం అందుకుంటారు. కుటుంబంలో స్వల్ప చికాకులు తలెత్తినా చాకచక్యంతో పరిష్కరిస్తారు. స్థిరాస్తులను వృద్ధి చేసేందుకు అత్యంత అనువైన కాలమిది. వివాహాది శుభకార్యాలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తారు. స్వల్ప అననుకూలతలు ఉన్నా బంధుమిత్రుల తోడ్పాటుతో అధిగమిస్తారు. సంతాన సంబంధ విషయాలు ఆనందాన్నిస్తాయి. బంధుమిత్రులను కలుస్తూ విందు వినోదాల్లో పాల్గొంటారు. ఉన్నత హోదా గల వ్యక్తులతో చక్కటి పరిచయాలు ఏర్పడతాయి. మీ తెలివితేటలకు చక్కటి గుర్తింపు లభిస్తుంది. ఎంతటి కష్టమైన పనినైనా అత్యంత సులువుగా, చాకచక్యంతో పూర్తి చేయగలుగుతారు. అత్యంత క్లిష్టమైన సమస్యలనూ సమర్థంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు.
ఉద్యోగులకు మేలిమి కాలం. ప్రమోషన్లు, కోరుకున్న చోటికి బదిలీలు ఉంటాయి. వీటి ద్వారా ఆర్థిక ప్రయోజనాలు సమకూరతాయి. నిరుద్యోగల ఉద్యోగ సాధన ప్రయత్నాలు అనుకూల ఫలితాలనిస్తాయి. వ్యాపార రంగంలోని వారికి యోగదాయకంగా ఉంది. వ్యాపార విస్తరణ, నూతన పెట్టుబడులకు అనుకూలం. వృత్తి పని వాళ్లకూ ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. విద్యార్థులకు ఉన్నత చదువులకు ప్రోత్సాహం లభిస్తుంది. మెదడు చురుగ్గా ఉంటుంది. క్రీడ, సినీ, టీవీ రంగాల్లోని వారికి ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. ధనాదాయం బాగుంటుంది. ఈరంగంలో పెట్టుబడులు పెట్టి కొన్ని రెట్ల లాభాలు అందుకుంటారు. కాంట్రాక్టర్లకు సకాలంలో బిల్లులు చేతికి అందుతాయి. స్థాయి పెరుగుతుంది. లాభాలూ వృద్ధి చెందుతాయి. రాజకీయ రంగంలోని వారికి సమున్నత పదువులు వరిస్తాయి. ప్రజాక్షేత్రంలో చక్కటి గుర్తింపు, గౌరవదం లభిస్తాయి. వ్యవసాయదారులకు చక్కటి దిగుబడులు వస్తాయి. గిట్టుబాటు ధరలూ లభించడంతో రుణాలు చెల్లించే ప్రయత్నాలు చేస్తారు.
ఈరాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందేందుకు, శ్రీసుబ్రహ్మణ్య స్వామిని పూజించాలి. తరచూ కనకదుర్గమ్మకు కుంకుమార్చన చేయడమూ శుభాలను పెంచుతుంది.
***
మకరం
ఆదాయం – 11 వ్యయం – 5
రాజపూజ్యం – 2 అవమానం – 6
మకర రాశి వారికి ఈ సంవత్సరం గురుడు 21-04-2023 వరకు మీనరాశిలోను, ఆ తర్వాత నాలుగో ఇంట మేషరాశిలో లోహమూర్తిగా సంచరిస్తాడు. శని ఈ సంవత్సరమంతా రెండో ఇంట కుంభరాశిలో రజతమూర్తిగా ఉంటాడు. రాహువు అక్టోబర్ 30 వరకు మేషరాశిలోను, ఆ తర్వాత మూడో ఇంట మీనరాశిలో తామ్రమూర్తిగాను, కేతువు అక్టోబర్ 30 వరకు తులారాశిలో, అనంతరం తొమ్మిదో ఇంట కన్యారాశిలో రజతమూర్తిగాను సంచరిస్తారు.
మకరరాశి వారు ఈ సంవత్సరమంతా ఆచితూచి వ్యవహరించాల్సివుంటుంది. ఆదాయం బాగానే ఉన్నా అంతకు మించిన ఖర్చులు ఉంటాయి. స్థిర, చరాస్తులను అమ్మాల్సిన పరిస్థితి వస్తుంది. గృహనిర్మాణం మధ్యలోనే నిలిచిపోయే వీలుంది. కోర్టు చిక్కులు వచ్చిపడతాయి. ప్రయాణాల్లో ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వృత్తి ఏదైనా అంత లాభసాటిగా ఉండదు. ప్రతి పనికీ ఆటంకాలు ఎదురవుతుంటాయి. సొంత వృత్తుల వారికి ధనాదాయం బాగా తగ్గుతుంది. అప్పులు చేయాల్సి వస్తుంది. వివాహాది శుభ కార్యాల కోసం ఖర్చు చేస్తారు. బంధు మిత్రులతో సఖ్యత చెడుతుంది. విభేదాలు, గొడవలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి వైఖరి చికాకు పెడుతుంది. ప్రతి చిన్న విషయానికీ తగాదాలు వస్తుంటాయి. శత్రుబాధలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఆరోగ్యం ఇబ్బంది పెట్టే సూచనలున్నాయి. మానసిక ప్రశాంతతకు దూరమవుతారు. సాహసాలు చేయకుండా, ప్రణాళికాబద్ధంగా పనులు చేసుకుంటే సాఫీగా సాగుతుంది.
ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆశించిన ప్రమోషన్లు లభించకపోగా, ఇష్టంలేని చోటుకి బదిలీ కావడం వేదనను కలిగిస్తుంది. అధికారులతో సఖ్యత ఉండదు. తరచూ అగౌరవానికి గురవుతుంటారు. వ్యాపారులకు ఈ ఏడాది పెద్దగా ఉపయోగకరంగా ఉండదు. నష్టాలు అధికంగా చవిచూస్తారు. నమ్మకద్రోహానికి గురవుతారు. వ్యాపార భాగస్వాములతో సఖ్యత చెడుతుంది. విద్యార్థులు విపరీతంగా శ్రమిస్తే, బొటాబొటి మార్కులతో గట్టెక్కగలుగుతారు. నిర్లక్ష్యం వల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయి. క్రీడలు, సినీ, టీవీ రంగాల్లోని వారికి ప్రతిభకు తగ్గ గుర్తింపు ఉండదు. నిరుత్సాహం కలుగుతుంది. కాంట్రాక్టర్లకు వివిధ కారణాల వల్ల పనులు సాగక, సకాలంలో బిల్లులు రాక ఇబ్బందిగా ఉంటుంది. అధికారులు వేధింపులు తోడవుతాయి. రాజకీయ రంగంలోని వారికి ఆశాభంగం తప్పదు. ఆశించిన పదవి దక్కదు. ప్రజల్లోనూ గౌరవం తగ్గుతుంది. వ్యవసాయ రంగంలోని వారికి కష్టానికి తగ్గ ఫలితం దక్కదు. అప్పులు ఎక్కువగా చేయాల్సి వస్తుంది.
మకర రాశి వారు ఈ సంవత్సరంలో.. శనికి తైలాభిషేకం, శివుడికి అభిషేకం చేస్తూ, తరచూ నవగ్రహాలను పూజిస్తూ వుండడం వల్ల కాస్త మెరుగైన ప్రయోజనాలను పొందగలుగుతారు.
***
కుంభం
ఆదాయం – 11 వ్యయం – 5
రాజపూజ్యం – 6 అవమానం – 1
కుంభరాశి వారికి 21-04-2023 వరకు, గురుడు మీనరాశిలోను, ఆ తర్వాత జన్మరాశి కుంభంలో సువర్ణమూర్తిగాను సంచరిస్తాడు.
కుంభరాశి వారికి 21-04-2023 వరకు, గురుడు మీనరాశిలోను, ఆ తర్వాత మూడో రాశి మేషంలోను లోహమూర్తిగానే సంచరిస్తాడు.
రాహువు అక్టోబర్ 30 వరకు మేషంలో, ఆ తర్వాత రెండో ఇంట మీనరాశిలో రజతమూర్తిగాను, కేతువు అక్టోబర్ 30 వరకు తులారాశిలో, అనంతరం ఎనిమిదో ఇంట కన్య రాశిలో లోహమూర్తిగా సంచరిస్తారు.
గోచార రీత్యా కుంభరాశివారికి శ్రీ శోభకృత్ సంవత్సరం మిశ్రమ ఫలితాలనిస్తుంది. సంవత్సరం ప్రారంభంలో ఉన్న సమస్యలను క్రమంగా రూపుమాపుకుంటూ వస్తారు. క్రమశిక్షణ, పట్టుదలతో పనిచేసి విజయాలను సొంతం చేసుకోగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. ఆదాయ మార్గాలూ వృద్ధి చెందుతాయి. అయితే అంతే స్థాయిలో ఖర్చులుంటాయి. పని ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి. శ్రమకు తగిన ఫలితం దక్కక పోవడం నిరాశను కలిగిస్తుంది. శుభ కార్యాచరణ కోసం చేసే ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురవుతాయి. కుంభరాశి వారు ఈ ఏడాది కోర్టు వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఇతరులకు పూచీగా ఉండడం మిమ్మల్ని కోర్టు చిక్కుల్లో పడేస్తుంది. మాట పలుకుబడి తగ్గుతుంది. ఆస్తులను అమ్మే ప్రయత్నాలకూ ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. వృత్తి, ఉద్యోగాది వ్యవహారాలలోనూ ఆశించినంత ప్రయోజనం కనిపించదు. జీవిత భాగస్వామి తోడ్పాటు ఉన్నప్పటికీ, తరచూ చిరుతగాదాలు రావడం అన్యోన్యతను కాస్త తగ్గిస్తుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత చెడుతుంది. పెద్దల ఆగ్రహానికి గురవుతారు. బంధు మిత్రులతో కలహాలుంటాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.
ఉద్యోగులకు ధనాదాయం బాగుంటుంది. అయితే విధినిర్వహణలో విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. పై అధికారుల వేధింపులు, కింది ఉద్యోగుల వల్ల అవమానాలు నిత్యకృత్యం అవుతాయి. ఇష్టంలేని చోటికి బదిలీలు, ప్రమోషన్లు దక్కకపోవడం మానసిక వేదనకు కారణమవుతాయి. వ్యాపారస్తుల పెట్టుబడులకు చేటు వచ్చే పరిస్థితి ఉంటుంది. అప్పులు వసూలు చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. అధికారుల ఆకస్మిక తనిఖీల కారణంగా భారీగా జరిమానా చెల్లించాల్సి రావచ్చు. భాగస్వామ్య వ్యాపారులకు ఏమాత్రం అనుకూలమైన సంవత్సరం కాదు. విద్యార్థుల జ్ఞాపకశక్తి మందగిస్తుంది. అమితంగా శ్రమిస్తే తప్ప సానుకూల ఫలితాలు రావు. క్రీడలు, సినీ, టీవీ రంగాల్లోని వారికి మిశ్రమంగా ఉంటుంది. ప్రతిభకు గుర్తింపు ఉన్నా.. ఆదాయం తగినంత ఉండదు. శ్రమకు తగ్గ ఫలితం దక్కకపోవడం మానసికంగా చికాకు పరుస్తుంది. కాంట్రాక్టర్లు, చేసిన పనినే మళ్లీ మళ్లీ చేయాల్సిరావడం వల్ల ఆర్థికంగా నష్టపోతారు. అధికారుల నుంచి విపరీతమైన ఒత్తిళ్లుంటాయి. రాజకీయ రంగంలోని వారికి ప్రజాదరణ కాస్తా.. క్రమంగా వ్యతిరేకతగా మారుతుంది. ఈ ఏడాది కూడా ఆశించిన పదవి దక్కే సూచనలు కనిపించడం లేదు. వ్యవసాయ రంగంలోని వారికి ఓ పంట బావుంటే, రెండో పంట నష్టపరుస్తుంది. పెట్టుబడులు కూడా తిరిగి రాని పరిస్థితి ఉంటుంది.
కుంభ రాశి వారు, ఈ సంవత్సరం శనికి తైలాభిషేకం, తరచూ సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయుడి దర్శనం చేసుకుంటూ అర్చనాదులు చేస్తూవుంటే.. ప్రతికూలతలు తగ్గి, మానసిక ప్రశాంతత కలుగుతుంది.
***
మీనం
ఆదాయం – 8 వ్యయం – 11
రాజపూజ్యం – 1 అవమానం – 2
మీన రాశి వారికి 21-04-2023 వరకు గురుడు మీనరాశిలోను, ఆ తర్వాత రెండో ఇంట మేషరాశిలో రజతమూర్తిగాను సంచరిస్తాడు. శని సంవత్సరమంతా పన్నెండో ఇంట కుంభ రాశిలో లోహమూర్తిగా ఉంటాడు. రాహువు అక్టోబర్ 30 వరకు మేషరాశిలో, ఆ తర్వాత జన్మరాశి మీనంలో సువర్ణమర్తిగాను, కేతువు అక్టోబర్ 30 వరకు తులారాశిలో, ఆ తర్వాత ఏడో ఇంట కన్యలో తామ్రమూర్తిగాను సంచరిస్తారు.
గురు, శని, రాహు, కేతువుల గోచార రీత్యా ఈ సంవత్సరం మీన రాశి వారికి మిశ్రమ ఫలితాలే దక్కుతాయి. పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. ఆదాయం పెరిగినా ఖర్చులూ మితిమీరతాయి. చేసే వృత్తి ఉద్యోగాలలో సానుకూలతలు ఉంటాయి. ప్రతి పనికీ ఆటంకాలు, కాలయాపన తప్పదు. వివాహాది శుభ కార్యాల నిర్వహణలోనూ కొన్ని అడ్డంకులు వచ్చినా.. చివరికి శుభ ఫలితాలను అందుకుంటారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు, బాధ్యతలు పెరుగుతాయి. పెద్దలు, అధికారుల ఆదరాభిమానాలను పొందుతారు. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. ప్రతి పనీ నెమ్మదిగా జరగడం చికాకును కలిగిస్తుంది. ఇంటాబయటా చిన్నపాటి సమస్యలు సుఖశాంతులను తగ్గిస్తాయి. కుటుంబ సభ్యులతో విరోధం ఏర్పడుతుంది. ఇంటికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. కోర్టు వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండండి. విలువైన వస్తువులు లేదా డాక్యుమెంట్లను జాగ్రత్త పరచండి. అకారణ విరోధాలు, అవమానాలు, అప్పులు చేయాల్సి రావడం మీలో అసహనాన్ని పెంచుతాయి.
ఉద్యోగులకు కాస్త మెరుగ్గానే ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలతో కూడిన ప్రమోషన్లు దక్కుతాయి. అయితే పై అధికారుల వేధింపులు, పని ఒత్తిడి అధికంగా ఉంటాయి. వ్యాపార రంగంలోని వారికి మిశ్రమ ఫలితాలుంటాయి. లాభాలు కళ్లబడినా, అనుభవించే పరిస్థితి ఉండదు. కొత్త వ్యాపారాల ప్రారంభానికి, వ్యాపార విస్తరణకు అనుకూలమైన కాలం కాదు. విద్యార్థులకు కష్టానికి తగ్గంత కాకపోయినా సానుకూల ఫలితాలే దక్కుతాయి. విద్యాభ్యాసం మీద ఆసక్తి తగ్గుతుంది. క్రీడలు, సినీ, టీవీ రంగాల్లోని వారికి చక్కటి అవకాశాలు లభిస్తాయి. ధనాదాయంతో పాటు ప్రశంసలూ అందుకుంటారు. రాజకీయ రంగంలోని వారికి ప్రజాసమస్యలు అధికమవుతాయి. పదవులలో ఇష్టంలేని మార్పులు వస్తాయి. వ్యవసాయ రంగంలోని వారికి దిగుబడులు ఆశాజనకంగానే ఉంటాయి. శ్రమ అధికంగా ఉంటుంది.
మీన రాశి వారు శనికి తైలాభిషేకం, నవగ్రహారాధన, అమ్మవారికి కుంకుమార్చనలు చేయడం ద్వారా మరింత మేలిమి ఫలితాలు పొందగలుగుతారు.
గమనిక :
శ్రీ శోభకృత్ నామ తెలుగు సంవత్సరంలో.. గ్రహాల స్థూల సంచారాన్ని, వివిధ రాశులలో ఆయా గ్రహాల స్థితి, యుతి, వీక్షణ సంబంధాల ప్రభావాన్ని అంచనా వేసి రాసిన ఫలితాలివి. వ్యక్తిగతమైన ఫలితాల కోసం, మీ జన్మకుండలి ద్వారా, నడుస్తున్న దశ, అంతర్దశలను, గోచారంతో బేరీజు వేసుకుని నిర్దిష్టమైన ఫలితాలు తెలుసుకోగలరు.
శుభం భూయాత్
Also Read :