రవితేజ రూట్ వేరు .. ఆయన మార్క్ వేరు .. ఆయన స్టైల్ వేరు. కథ ఏదైనా .. కథనం ఎలాంటిదైనా ఇవేవి మిస్ కాకుండా ఆయన చూసుకుంటూ ఉంటాడు. యాక్షన్ .. ఎమోషన్ పాళ్లు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ, తన నుంచి ప్రేక్షకులు కోరుకునే ఎంటర్టైన్ మెంట్ ను అందించటానికే ఆయన ప్రయత్నిస్తూ ఉంటాడు. తెరపై సరదా మాటలతో సందడి చేస్తూనే, హీరోగా తాను అనుకున్న కార్యాన్ని సమర్థిస్తూ ఉంటాడు.
రవితేజలోని ఈ ప్రత్యేకత కారణంగానే ఆయన సినిమాల పట్ల చాలామంది ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. డైలాగ్స్ .. ఫైట్స్ .. డాన్సులలోను తనకి గల ఇమేజ్ కి దూరంగా వెళ్లకుండా చూసుకుంటూ ఉంటాడు. ఇటీవల ఆయన నుంచి వచ్చిన ‘ధమాకా’ బ్లాక్ బస్టర్ హిట్ కావడానికి కారణం కూడా అదే. ఆ సినిమాలో యాక్షన్ తో పాటు మాస్ సాంగ్స్ లోను ఆయన రెచ్చిపోయాడు. ఆ తరువాత సినిమాగా ఆయన నుంచి రావడానికి ‘రావణాసుర’ రెడీ అవుతోంది.
ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి టీజర్ ను వదిలారు. టీజర్ ను బట్టి చూస్తే రవితేజ తన మార్క్ కి కాస్త దూరంగా వెళ్లాడేమో అనిపిస్తోంది. యాక్షన్ లో కాస్త హింస ఎక్కువైనట్టుగా కనిపిస్తోంది. హీరో తాను టార్గెట్ చేసిన వారిని క్రూరంగా చంపుతూ వెళతాడనే ఒక విషయంలో క్లారిటీ వచ్చేసింది. టైటిల్ ‘రావణాసుర’ అయినప్పుడు ఆ మాత్రం హింస లేకుండా ఎలా ఉంటుంది? అనుకోవచ్చు. కానీ కంటెంట్ ఏదైనప్పటికీ, రవితేజ మార్క్ మిస్సవ్వకుండా ఉంటేనే ఆ సినిమాలు ఆడతాయనేది ఆయన గత సినిమాలు నిరూపించాయనే విషయం తెలిసిందే.