Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంద్రవ్యోల్బణ దారిద్య్రం

ద్రవ్యోల్బణ దారిద్య్రం

Inflation-confusion: భారతీయ సనాతన ధర్మంలో వైరాగ్య జ్ఞానం చాలా ప్రధానమయినది. ఎంత సంపద ఉన్నా, ఎన్ని వైభోగాలు ఉన్నా, ఎంత మిసిమి వయసు ఉన్నా…ఇవన్నీ శాశ్వతం కాదని, ఏదో ఒక నాటికి పోయేవే అని ప్రతి క్షణం వాటితో మనకు మనమే డిటాచ్ అయ్యే వైరాగ్యాన్ని బోధించే జ్ఞానం అనంతం. జ్ఞాన వైరాగ్యాలను భిక్షగా ప్రసాదించమ్మా! అని శంకరాచార్యులు స్పష్టంగా అన్నపూర్ణను అడిగాడు.

అలాంటి వైరాగ్యం ఎవరికీ ఊరికే రాదు. వైరాగ్యం చెట్లకు కాయదు. మన మెదళ్లకే కాయాలి. భారతీయ రిజర్వ్ బ్యాంక్ తాజాగా భారతీయుల్లో వైరాగ్యం పెంచడానికి అనేక చర్యలు చేపట్టింది. అందులో వడ్డీ రేట్లు పెంచడం ఒకానొక వైరాగ్య సిద్ధ్యర్థం.

అప్పిచ్చువాడు లేని ఊళ్లో ఉండనే వద్దని శతకకారుడి ప్రబోధం.

“ఋణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయాః
ఋణక్షయే క్షయం యాంతి కా తత్ర పరిదేవనా”

రుణానుబంధమే లౌకిక ప్రపంచానికి అత్యంత కీలకమయినది. రిజర్వ్ బ్యాంక్ తో దేశానికి ఉన్నది కూడా రుణానుబంధమే.

Interest Rates

“అప్పులేని సంసార మైనపాటే చాలుతప్పులేని జీతమొక్క తారమైన జాలు
కంతలేని గుడిసొక్క గంపంతైన జాలు చింతలేని యంబలొక్క చేరెడే చాలు
వింతలేని సంపదొక్క వీసమే చాలుతిట్టులేని బ్రదుకొక్క దినమైన నదే చాలు
ముట్టులేని కూడొక్క ముద్దడే చాలు గుట్టుచెడి మనుకంటే కొంచెపు మేలైన చాలు
వట్టిజాలి బడుకంటే వచ్చినంతే చాలులంపటపడని మేలు లవలేశమే చాలు
రొంపికంబమౌకంటె రోయుటే చాలు రంపపు గోరికకంటే రతి వేంకటపతి పంపున నాతని జేరే భవమే చాలు”

అని అన్నమయ్య అప్పుల పెను భారం గురించి అయిదు వందల ఏళ్ల కిందటే వెంకన్న దగ్గర మొరపెట్టుకున్నా…మనం అప్పు చేసి పప్పు కూడు తింటూనే ఉన్నాం.

కొన్ని శతాబ్దాల బ్యాంకింగ్ సేవలను నిశితంగా గమనిస్తే…అప్పు ఎగ్గొట్టే అత్యంత సంపన్నులను బ్యాంకులు ఏమీ చేయలేవు. అప్పు బాధ్యతగా తిరిగి కట్టేవారి నుండి ఎంత ఎక్కువ వీలయితే అంత ఎక్కువ వడ్డీలు వసూలు చేసుకోవాలి. మన డిపాజిట్లకు నామమాత్రపు వడ్డీ ఇవ్వాలి. వేల, లక్షల కోట్ల అప్పులు ఎగ్గొట్టిన వారి భారాన్ని…సామాన్యులు మోయాలి. ఇదొక తీరని రుణం. కరుణలేని దారుణం.]

రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు, రివర్స్ రెపో రేటు, జాతీయ స్థూల ఉత్పత్తి రేటు, ద్రవ్యోల్బణం లాంటి ఆర్థిక రంగ పారిభాషిక పదాలకంటే ఇనుప గుగ్గిళ్లు సులభంగా కొరుకుడు పడతాయి. తేలిగ్గా జీర్ణమవుతాయి.

ఉదాహరణకు తాజాగా రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను “సవరించింది” అంటున్నారు. ఇందులో “సవరణ”కు వివరణ ఏమిటంటే “వడ్డీ రేట్లను పెంచింది” అని మనం అర్థం చేసుకోవాలి. “మార్కెట్ కరెక్షన్” మాట గొప్పగా ఉన్నా ఆ “కరెక్షన్” భారం పెరిగేదే కానీ…తగ్గేదే ల్యా!

గోరుచుట్టుపై రోకటి పోటు- రిజర్వ్ బ్యాంక్ రెపో రేటు రెండూ ఒకటే అని సామాన్యుల అవగాహన.

“వాడు నన్ను కొట్టె;
నన్ను వాడు కొట్టె అన్నట్లు”
అని రాయలసీమలో ఒక ఫేమస్ సామెత.  రెండు వాక్యాల్లో దెబ్బలు తిన్నది ఒకడే. కాకపొతే సర్వనామం స్థానం మారడంతో ఇద్దరు దెబ్బలు తిన్నట్లు కన్ఫ్యూజ్ అవుతాం– అంతే. రెండు వాక్యాల్లో కొట్టింది ఒకడే. అలా పేరు రెపో రేటు అయినా, ద్రవ్య విధానమయినా కొట్టేది రిజర్వ్ బ్యాంకే. వడ్డీ దెబ్బలు తినేది మనమే.

ద్రవ్యోల్బణం అదుపు, వృద్ధి రేటుకు మద్దతుగానే ఇక ద్రవ్య విధానం ఉంటుంది.” అన్నది రిజర్వ్ బ్యాంక్ ప్రకటన. ఇది అర్థం కాక అనవసరంగా జుట్లు పీక్కుని అమర్త్యసేన్ ఎక్కడున్నాడో? అని పరుగులు తీయకండి.

ద్రవ్యోల్బణం అదుపు చేయలేని ప్రతి సందర్భంలో…
వృద్ధి రేటు వాపును బలుపుగా చూపడానికి లేదా లోటును పూడ్చడానికి సామాన్యుల నడ్డి విరిచి…ఇలా వడ్డీలను పెంచుకుంటూ పోతామని- నర మానవుడికి అర్థం కాకుండా…శాలువలో పెట్టి కొట్టారంతే.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read : 

23 వేల కోట్లు అప్పు! 20 నిముషాల్లో శాంక్షన్!

RELATED ARTICLES

Most Popular

న్యూస్