చిరంజీవి, రవితేజ కాంబినేషన్లో రూపొందిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘వాల్తేరు వీరయ్య‘. ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించారు. అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది. చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించింది. అల్బమ్ లోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి, వాల్తేరు వీరయ్య టైటిల్ ట్రాక్, పూనకాలు లోడింగ్ పాటలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల అవుతుంది.
ఈ నేపధ్యంలో మెగాస్టార్ చిరంజీవి చెప్పిన చిత్ర విశేషాలు ఆయన మాటల్లోనే… ప్రేక్షకులు, అభిమానులు నన్ను కమర్షియల్ సినిమాల్లో చూడటాడానికే ఎక్కువగా ఇష్టపడతారు. నాకు మాత్రం అన్ని రకాల వైవిధ్యమైన పాత్రలు చేయాలని వుంది. శుభలేఖ, స్వయంకృషి, మంత్రి గారి వియ్యంకుడు లాంటి చిత్రాలు వివిధ్యమైన పాత్రలు చేయాలనే తాపత్రయం నుండి వచ్చినవే. అయితే రానురాను..ఆర్ధికంగా కమర్షియల్ గా ముడిపడిన ఈ పరిశ్రమలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్ మేలుని ద్రుష్టిలో పెట్టుకొని.. మనకి ఏం కావాలనేదాని కంటే ప్రేక్షకులు మన నుండి ఏం కోరుకుంటున్నారో.. అది ఇవ్వడానికే మొదటి ప్రాధన్యత ఇచ్చాను.
కమ్ బ్యాక్ లో కూడా ఫ్రీడమ్ ఫైటర్ సైరా, పాటలు, హీరోయిన్ లేకుండా పవర్ ఫుల్ పాత్రగా గాడ్ ఫాదర్ చేశాను. ఇవన్నీ కూడా గౌరవప్రదమైన హిట్లు అందుకున్నాయి. అయితే ప్రేక్షకులు నా నుండి ఏం కోరుకుంటున్నారో అది వందకి వంద శాతం ఇవ్వాలనే ప్రయత్నంతో వాల్తేరు వీరయ్య చేశాను. ఇది కచ్చితంగా ప్రేక్షకులని అలరిస్తుంది. మరోసారి వింటేజ్ చిరంజీవి ని గుర్తు చేసుకునే అవకాశం వుంటుంది. ముఠామేస్త్రీ, ఘరానామొగుడు, రౌడీ అల్లుడు లాంటి చిత్రాలని రీ కలక్ట్ చేసుకునే అవకాశం ఇచ్చింది వాల్తేరు వీరయ్య. షూటింగ్ ని చాలా ఎంజాయ్ చేశాను. దీనికి ప్రధాన కారణం దర్శకుడు బాబీ కూడా. తను ఏం చూడాలని అనుకుంటున్నాడో అవన్నీ నా నుండి రాబట్టుకోవడం కోసం చాలా తపనతో పని చేశాడు. షూటింగ్ చాలా ఉత్సాహంగా జరిగింది.
నేను ఎప్పుడు మానిటర్ చూడను. నేను షాట్ చేస్తున్నప్పుడు దర్శకుడు ‘ఓకే’ అన్నంత వరకూ అక్కడి నుండి కదలను. నేను ఎప్పుడూ దర్శకుడి ‘ఓకే’ కోసం ఎదురుచూస్తాను. కొత్త యాక్టర్ ని డీల్ చేస్తున్న కంఫర్ట్ దర్శకులకు ఇస్తాను. కెరీర్ మొదట్లో ఒక ఆకలి వుంటుంది. ఒక పేరు తెచ్చుకోవాలి, మనల్ని మనం తెర పై చూసుకోవాలనే స్పిరిట్ .. కొంత కాలం తర్వాత ఎందుకు వుండకూడదు. కష్టపడాలి. అమితాబ్ బచ్చన్ గారు ఇప్పటికీ హార్డ్ వర్క్ చేస్తారు. ఇక్కడ ఎప్పుడూ అర్ద ఆకలితో వుండాలి. కడుపు నిండిన వ్యవహారం లా వుంటే మాత్రం అనుకున్నది డెలివర్ చేయలేవని చెప్పడమే నా ఉద్దేశం.
రవితేజ అప్పటికి ఇప్పటికి ఒకే మనిషి. ఇమేజ్ వచ్చిన తర్వాత తనలో వచ్చిన మార్పులు ఏమీ లేవు. అదే ఎనర్జీ తో వున్నాడు. తన ఆహారపు అలవాట్లు కూడా మారలేదు. అప్పటికి ఇప్పటికి అదే ప్రేమ, ఉత్సాహం వున్నాయి. వాల్తేరు వీరయ్య లో రవితేజ పాత్ర కథకు మరింత బలం చేకూరుస్తుంది. తన పాత్రలో చాలా ఎమోషన్ వుంటుంది. ఆ పాత్రకు చక్కని న్యాయం చేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ లాంటి నిర్మాతలు చాలా అరుదుగా వుంటారు. ఖర్చుకు వెనకడుగు వేయకుండా ఒక ప్యాషన్ తో సినిమాలు చేస్తున్నారు. ‘ఖర్చు విషయంలో జాగ్రత్త. మీ లాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి కావాలి’అని చెబుతుంటాను. బాబీ కి కూడా అదే విషయం చెప్పాను. ఎక్కడ వృధా కాకుండా బాబీ చక్కని పనితనం చూపించాడు. దాని వలన నిర్మాతలకు కూడా చాల కలిసొచ్చింది. నిర్మాతల బాగోగులు చూడాల్సిన బాధ్యత దర్శకులపై కూడా వుంది. షూటింగ్ లో ఒక రోజుకి నలభై లక్షల రూపాయిలు కూడా ఖర్చు అయ్యేది. మారేడిమిల్లి లో షూట్ చేస్తున్నపుడు అక్కడ ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత మంచిది. ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ తో కూర్చుని ప్లాన్ చేసి ఎక్కడా వృధా కాకుండా చేయగలిగాం. మలేసియాలో కూడా షూట్ చేశాం.
మా సంస్థ నుండి రెండు సినిమాలు అనేసరికి చాలా హ్యాపీగా ఫీలయ్యాను. పండగ ఎన్ని సినిమాలైన తీసుకుంటుంది. ఒక రోజు గ్యాప్ ఇస్తే గనుక ఏ సినిమా రెవెన్యూ ఆ సినిమాకి వుంటుంది. అందుకే నేనే వెనుకకు జరుగుతానని చెప్పాను. శృతిహాసన్ కమల్ హాసన్ గారి కూతురు. తన డీఎన్ ఏ లోనే డ్యాన్స్ వుంది. అవలీలగా డ్యాన్స్ చేస్తుంది. అయితే.. చాలా చలిలో డ్యాన్స్ చేయడం ఒక సవాలే. తను చాలా హార్డ్ వర్క్ చేసింది. తనకి పని పట్ల అంకితభావం ఎక్కువ. తనతో మళ్ళీ వర్క్ చేయాలని వుంది. ఈ సినిమాలో ఎంటర్ టైన్మెంట్ గురించి చెప్పాలంటే… ఒక ముఠామేస్త్రీ, ఘరానామొగుడు, అన్నయ్యలో ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్ రైజేషన్ తో పోల్చుకోవచ్చు. ప్రతి సీన్ ఎంటర్ టైన్ చేస్తుంది. ముఖ్యంగా ఫ్యామిలీ పిల్లలతో వెళ్తే చాలా ఎంజాయ్ చేస్తారు.