‘వై నాట్ పులివెందుల’ అంటూ కొందరు మాట్లాడుతున్నారని, జగన్ ఓడిపోతారని కలలు కంటున్నారని… అదే నిజమనుకుంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లలో ఒకరు పోటీ అక్కడినుంచి చేయాలని మాజీ మంత్రి పేర్ని నాని సవాల్ చేశారు.
మొత్తం 175 సీట్లలో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని చంద్రబాబు చెప్పడం విచిత్రంగా ఉందని, అసలు మొత్తం సీట్లలో సైకిల్ గుర్తు పోటీ చేస్తుందా అని నాని ప్రశ్నించారు. అసలు 38 నియోజకవర్గాల్లో పార్టీకి ఇన్ ఛార్జ్ లు కూడా లేరని బాబు స్వయంగా ఇటీవలే చెప్పారని అలాటి వ్యక్తీ మొత్తం సీట్లలో ఎలా గెలుస్తారని నిలదీశారు. జనసేన పార్టీకి ఎన్ని సీట్లు, బిజెపిలో ఉంది టిడిపికి సపోర్ట్ చేసే సత్య, ఆదినారాయణ రెడ్డి లాంటివారికి ఎన్ని, కమ్యూనిస్టులను టిడిపికి తాకట్టు పెట్టిన నారాయణ, రాహూల్ గాంధీ పార్టీకి ఎన్ని సీట్లు ఇస్తారో చెప్పాలన్నారు.
బిజెపి 2018లో రాయలసీమ డిక్లరేషన్ చేసిందని, ఏపీ రెండో రాజధాని సీమలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారని, ఆ విషయాన్ని మర్చిపోయి కొందరు నేతలు అమరావతి ఉద్యమంలో పాల్గొంటూ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల మేనిఫెస్టో లో కూడా సీమలో హైకోర్టు ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించారని గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న క్యాబినెట్ తోనే ఎన్నికలకు వెళ్తామని, మళ్ళీ విజయం సాధిస్తామని నాని ధీమా వ్యక్తం చేశారు. మంత్రివర్గాన్ని మరోసారి పునర్ వ్యవస్థీకరించనున్నట్లు వస్తున్న వార్తలను అయన కొట్టిపారేశారు. ఇప్పుడు మంత్రులను మార్చాల్సిన అవసరం ఏమిటని ఎదురు ప్రశ్నించారు.’గడపకు గడపకు మన ప్రభుత్వం’పై మాత్రమే సమీక్ష ఉంటుందని స్పష్టం చేశారు.