Mutual Criticism Of Telangana And Ap Ministers :
తెలంగాణ, ఏపి మంత్రులు మాటకు మాట సమాధానం ఇచ్చుకున్నారు. ఉదయం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన విమర్శలకు అదే స్థాయిలో ఏపి మంత్రి పేర్ని నాని జవాబు ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే తెలంగాణ ప్రజలు బిచ్చమెత్తుకుని బతకాల్సి వస్తుందని ఆనాడు ఆంధ్రోళ్లు ఎద్దేవా చేశారని… కానీ నేడు ఏపీ సీఎం జగన్ కేంద్రం వద్ద బిచ్చమెత్తుకునే పరిస్థితి తలెత్తిందని ఎద్దేవా చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నిధులు లేక కేంద్రం వద్ద చేతులెత్తి అడుక్కుంటోందని, అందుకే కేంద్రం ఏం చెప్పినా చేయడానికి జగన్ సిద్ధమయ్యారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడవాలంటే కేంద్రం ఇచ్చే నిధులు తప్పనిసరని, అందుకే ఏపీలో మోటార్లకు మీటర్లు బిగిస్తున్నారని ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. దేశమంతా మీటర్లను వ్యతిరేకిస్తుంటే జగన్ మాత్రం కేంద్రం చెప్పిందంతా వింటూ కీలుబొమ్మగా మారారని ప్రశాంత్‌రెడ్డి ఆరోపించారు.
మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఏపి మంత్రి పేర్ని నాని ఘాటుగా స్పందించారు. మాకు రావాల్సిన నిధుల కోసం బిచ్చమెత్తుకుంటున్నామన్న పేర్నినాని మాటిమాటికి ఢిల్లీ వెళ్తున్న trs ఏం బిచ్చమెత్తుకోవడానికి వెళ్తున్నారని వ్యంగ్యంగా ప్రశ్నించారు. బయట కాలర్ ఎగరేసి.. లోపల కాళ్లు పట్టుకునే అలవాటు జగన్‌కు లేదని, ఎవరితోనైనా స్నేహమంటే స్నేహం.. ఢీ అంటే ఢీ అనేదే జగన్ నైజమన్నారు. తెలంగాణ సర్కార్ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయంటున్నారని, కాంట్రాక్టర్లకు ఎంత బకాయిలు ఇవ్వాలో అడగండన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అందరూ కలిసి అభివృద్ధి చేసిన..హైదరాబాద్ సొమ్మును అనుభవిస్తున్నారని విమర్శించారు.
Also Read : బిజెపి నేతల నీతులు విడ్డూరం: పేర్ని నాని