Sunday, November 24, 2024
HomeTrending Newsరెండు రాష్ట్రాల మధ్య సామీప్యత ఉంది: ద్రౌపది

రెండు రాష్ట్రాల మధ్య సామీప్యత ఉంది: ద్రౌపది

Thank You: ఒడిషా, ఆంధ్రప్రదేశ్‌ రెండూ ఇరుగు పొరుగు రాష్ట్రాలని, ప్రజల అభిరుచులు, ఆచార వ్యవహారాలు, ఆహార అలవాట్ల విషయంలో ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య ఎంతో సామీప్యత ఉందని ఎన్డీయే రాష్ట్ర పతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము అన్నారు. ఓడిశా రాష్ట్రానికి చెంది, దేశంలోని ప్రధాన గిరిజన తెగల్లో ఒకటైన సంతాల్‌ తెగకు చెందిన తనను రాష్ట్రపతి అభ్యర్ధిగా నిలబెట్టడం సామాజిక న్యాయానికి, మహిళా సాధికారతకు ఒక నిదర్శనమని ఆమె అభివర్ణించారు. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డితో కలిసి ఏపీలో పర్యటించారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలను ద్రౌపదికి పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ‘ఆంధ్ర ప్రజలకు నా నమస్కారాలు’.. అంటూ తెలుగులో ప్రసంగం మొదలుపెట్టిన ముర్ము ఆంధ్ర ప్రదేశ్ చరిత్రను ప్రస్తావించారు.

“రాష్ట్రంలో ఎందరో మహానుభావులు కవులు, స్వాతంత్య్ర సమరయోధులు ఉన్నారు. ఈ సందర్భంగా వారందరికీ సెల్యూట్‌ చేస్తున్నాను. తెలుగు భాషకు ఎందరో మహానుభావులు ఎంతో ప్రాచుర్యం కల్పించారు. వారిలో కవులు నన్నయ్య, తిక్కన, ఎర్రా ప్రగడ, పాల్కురికి సోమనాథుడు, శ్రీనాథుడు, పోతన, అన్నమాచార్య, తెనాలి రామకృష్ణ.. వారందరినీ స్మరించుకుంటున్నాను. అలాగే ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు, వల్లడ నరసింహరాజు, ఎన్టీ రామారావుకు నా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. వారంతా గొప్ప నాయకులు.

ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో ఘన చరిత్ర ఉంది. పల్లవులు, చాళుక్యులు, శాతవాహనులు, కాకతీయులు పాలించారు. విజయనగరం సామ్రాజ్యానిది గొప్ప చరిత్ర. అంతర్జాతీయ స్థాయిలో ఆ పాలనకు పేరు పొందింది. అనేక దేశాలతో అక్కడి పాలకులకు సత్సంబంధాలు కొనసాగాయి. భాష, సాహిత్యం, సంస్కృతికి రాష్ట్రం ఎంతో పేరు పొందింది.

తెలుగు ఒక శాస్త్రీయ భాష కాగా, ఇక్కడ కూచిపూడి శాస్త్రీయ నృత్యం. రెండూ ఎంతో పేరు పొందాయి. అదే విధంగా పుణ్యక్షేత్రాలు, కళలు, సాంస్కృతిక కేంద్రాలకు ఆంధ్రప్రదేశ్‌ పేరు పొందింది. ఇక్కడ తిరుపతి, లేపాక్షి వంటి క్షేత్రాలు ఉన్నాయి. అదే విధంగా ఇక్కడ పూతరేకులు, ఖాజాలు ఎంతో ప్రసిద్ధి. ఉప్పాడ, కలంకారీ వస్త్రాలు. తోలు బొమ్మలాట. దుర్గి శిల్పకళ. ఏటికొప్పాక బొమ్మలు. ఇలా ఎన్నెన్నో. స్వాతంత్య్ర సమరంలో కూడా ఆంధ్రప్రదేశ్‌ కీలకపాత్ర పోషించింది. ఇక్కడి రాయలసీమలో ఉద్యమాలు. సహాయ నిరాకరణ చేస్తూ సాగిన చీరాల పేరాల ఉద్యమం. అల్లూరి నేతృత్వంలో జరిగిన రంప తిరుగుబాటు. సైమన్‌ గో బ్యాక్, సహాయ నిరాకరణ ఉద్యమం, సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా ఉద్యమం. అన్నింటిలో ఆంధ్రప్రదేశ్‌ చురుగ్గా పాలు పంచుకుంది.

Droupadi Thanked

ఇక్కడ వ్యవసాయం ప్రధాన వృత్తి కాగా, ఇక్కడి ప్రజలు చాలా కష్టపడతారు. ఇక్కడ పండించిన బియ్యం, మత్స్య సంపదకు దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఎంతో డిమాండ్‌ ఉంది. ఇక్కడ పర్యాటక ప్రాంతాలు కూడా ఎంతో పేరు పొందాయి. అరకు లోయ. బొర్రా గుహల వంటి పర్యాటక ప్రాంతాలు, తిరుపతి వంటి తీర్ధయాత్ర కేంద్రాలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. ఆ విధంగా ఆధ్యాత్మికంగానే కాకుండా, పర్యాటకంగా కూడా ఆంధ్రప్రదేశ్‌ ఎన్నో ప్రత్యేకతలను కలిగి ఉంది” అంటూ రాష్ట్ర ప్రాముఖ్యతను తన ప్రసంగంలో వివరించారు.

“ఈనెల 18న రాష్ట్రపతి ఎన్నిక జరగబోతోంది. ఆ ఎన్నికలో మీ సోదరిని గెలిపించమని విజ్ఞప్తి చేస్తున్నాను. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా దేశంలోనే అత్యున్నత పదవికి మీ సోదరిని ఎన్నుకోమని మరోసారి కోరుతున్నాను. నన్ను సమర్థించమని నేను కోరక ముందే, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్, నన్ను హృదయపూర్వకంగా బలపర్చారు. అందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు” అని ముర్ము సందేశం ఇచ్చారు.

Droupadi Thanked

సిఎం జగన్ మాటాడుతూ… మొట్టమొదటిగా గిరిజన మహిళ ఈ దేశ రాష్ట్రపతి అవ్వబోతున్నారని, ఇంతకుముందు ఎప్పుడూ ఇలా జరగలేదని, తమ పార్టీ మొదటి నుంచి సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని, చేతల్లో చూపించిన మొట్టమొదటి రాష్ట్ర ప్రభుత్వం తమదేనని అన్నారు. మరో అడుగు ముందుకు వేస్తూ ద్రౌపది ముర్ముగారిని ఎన్నుకోవాల్సిన ఆవశ్యకత, అవసరం ఉందని స్పష్టం చేశారు. ఈనెల 18న జరిగే ఎన్నికలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక్కరు మిస్‌ ఒక ఓటు మనమంతట మనమే తగ్గించిన వారం అవుతామని ఎమ్మెల్యేలతో వ్యాఖ్యానించారు.  అందరూ వచ్చి ఓటువేసేలా విప్‌లంతా బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఒక గిరిజన మహిళ రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబడుతున్నప్పుడు మన వైపు నుంచి ఎలాంటి పొరపాటు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

ఈ సమావేశంలో కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి. వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారం తదితరులు ప్రసంగించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్