అఖిల భారత ఫుట్ బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్)పై నిషేధం విసిస్తూ ఫెడరేషన్ అఫ్ ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ అసోసియేషన్ (ఫిఫా) తీసుకున్న నిర్ణయంపై విచారణను భారత సుప్రీం కోర్టు ఆగస్ట్ 22కి వాయిదా వేసింది. ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలనేదానిపై అనేక అంశాలను కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోందని, దీనిపై ఓ తుది నిర్ణయం తీసుకునేందుకు వీలుగా విచారణను వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వ సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సర్వోన్నత న్యాయస్థానానికి విన్నవించారు.
ఇప్పటికే ఫిఫాతో దీనిపై ప్రభుత్వ సంప్రదింపులు మొదలయ్యాయని, కమిటీ అఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సిఓఏ) కూడా చర్చల్లో భాగస్వామ్యం వహిస్తోందని తుషార్ కోర్టుకు తెలియజేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం త్వరలో ఈ వివాదానికి ముగింపు లభించేలా చూడాలని, అలాగే వచ్చే నెలలో మన దేశంలో నిర్వహించ తలపెట్టిన ఫుట్ బాల అండర్ -19 మహిళల వరల్డ్ కప్ ను యధాతథంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. తుషార్ విజ్ఞప్తి మేరకు కేసులు వాయిదా వేసింది.
సంస్థలో బైటి వ్యక్తుల ప్రమేయం ఎక్కువ అవుతోందంటూ ఏఐఎఫ్ఎఫ్ పై ఫిఫా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీనితో పాటు అండర్ 17వరల్డ్ కప్ ను కూడా రద్దు చేసింది. బైటి వ్యక్తుల ప్రమేయం అంటూ ఫిఫా చేసిన ఈ ఆరోపణలు సి ఓ ఏ ను ఉద్దేశించి చేసినవే కావడం గమనార్హం. ఏఐఎఫ్ఎఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో మాజీ ఆటగాళ్లకు 25 శాతం కంటే ఎక్కువ మందికి సభ్యత్వం ఉండరాదని ఫిఫా పెట్టిన నిబంధనను పట్టించుకోకుండా సంఘం ఎన్నికలకు ముందుకు వెళ్ళడమే ఈ సంక్షోభానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఫిఫా లేవనెత్తిన అభ్యంతరాలపై చర్చలు జరుగుతున్నాయని, అవి పూర్తి కాకముందే నిషేధం ఎలా విధిస్తారని సి ఓ ఏ ప్రశ్నిస్తోంది.
కాగా, కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఈ విషయంలో జోక్యం చేసుకొని సమస్యను సానుకూలంగా పరిష్కరించే దిశలో యత్నాలు మొదలు పెట్టింది.