ఒక వ్యక్తి అరాచక శక్తిగా తయారై విధ్వంస పాలనతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మండి పడ్డారు. కేవలం తన సభలు అడ్డుకునే దురుద్దేశంతోనే జీవో నంబర్ వన్ తీసుకు వచ్చారని అన్నారు. తన సొంత నియోజకవర్గం కుప్పంలో తన ప్రజలను, కుటుంబ సభ్యులను తాను కలుసుకోకుండా అడ్డుకోవడం, పోలీసులతో నిలువరించే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. నిన్నటి ఘటనలో కూడా పోలీసులు 70మంది తమ పార్టీ నేతలపై కేసులు పెట్టారని అన్నారు. కుప్పంలో మీడియాతో బాబు మాట్లాడారు.
తాను సిఎంగా ఉన్నప్పుడు వైఎస్, షర్మిల, జగన్ పాదయాత్రలు చేశారని, విజయమ్మ కూడా ఎన్నో బహిరంగ సభల్లో పాల్గొన్నారని, తాను ఎప్పుడూ వారిని అడ్డుకోలేదని గుర్తు చేశారు. తమ పాలనలో పోలీసులు సహకరించారు కాబట్టే జగన్ పాదయాత్ర చేసుకోగాలిగారన్నారు.
రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన సాగిస్తున్నారని, రాష్ట్రాన్ని ఒక టెర్రరిస్ట్ స్టేట్ గా తయారు చేశారని, పోలీసులు కూడా రాష్ట్రంలో భాగమేనని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు వారు కూడా ముందుకు రావాలని సూచించారు. ఎస్పీ స్వయంగా ఇక్కడకు వచ్చారని, ఆయన లా అండ్ ఆర్డర్ పర్యవేక్షించడానికి వచ్చారా లేక టిడిపి కార్యకర్తలను వేధించడానికా అంటూ మండిపడ్డారు. చట్టాన్ని అతిక్రమించే పోలీసులు కూడా నేరస్తులే అన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఎన్ని కుట్రలు చేసినా భయపడేది లేదని, ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వెంటనే తన చైతన్య రథాన్ని వెంటనే అప్పగించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. దీనికి నిరసనగా పాదయాత్రగా సభా స్థలానికి వెళతామని చెప్పారు. తమను ఇబ్బంది పెడుతున్న పోలీసులపై కూడా ప్రైవేట్ కేసులు పెడతామని ప్రకటించారు. రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు ఒక వైపున, జగన్ మోహన్ రెడ్డి రెడ్డి ఒక్కడే ఒకవైపున ఉన్నారని, ఆయన పని అయిపోయిందని.. ఓటమి ఖాయమని అందుకే విచక్షణ కోల్పోయి ఇలా ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. జగన్ ఒక విఫల ముఖ్యమంత్రి అని బాబు అభివర్ణించారు.
చంద్రబాబు రెచ్చగొట్టడం వల్లే టిడిపి కార్యకర్తలు పోలీసులపై దాడి చేశారంటూ మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “రామ చంద్రారెడ్డి గుర్తు పెట్టుకో, పుంగనూరు లో నీ సంగతేమిటో తేలుస్తా, తమాషాలు ఆడుతున్నావా… నువ్వు ఓ సైకోలా తయారయ్యావా?” అంటూ వార్నింగ్ ఇచ్చారు.
Also Read : ప్రభుత్వ వైఫల్యం వల్లే: ఎమ్మెల్యే డోలా