సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా అవకాశాలను అందుకోవడం .. తొలి అడుగుల్లోనే సక్సెస్ లను అందుకోవడం కష్టమైన విషయం. కెరియర్లో ఎన్ని విజయాలను అందుకున్నా ఫస్టు ఫ్లాప్ అనుభవం వెంటాడుతూనే ఉంటుంది. అందువలన తమ ఫస్టు మూవీ తప్పకుండా హిట్ కావాలనే కోరుకుంటూ ఉంటారు. ఐతే చాలా తక్కువమందికి మాత్రమే వరుస సక్సెస్ లు పడుతుంటాయి. అయితే ఆ సక్సెస్ లో తమ వాటా ఎంత అనేదే హీరోయిన్స్ ఆలోచన చేసుకోవలసి ఉంటుంది.
టాలీవుడ్ కి కేరళ నుంచి వచ్చిన భామలు చాలామందినే ఉంటారు. అలా ఇటీవల కాలంలో వచ్చినవారిలో సంయుక్త మీనన్ ఒకరు. ఈ బ్యూటీ ముందుగా ‘బింబిసార’ సినిమాకి సైన్ చేసినప్పటికీ, ముందుగా విడుదలైంది మాత్రం ‘భీమ్లా నాయక్’. అందువలన ఈ సుందరికి ఎలాంటి నష్టం కలగలేదు. ఇటు ‘భీమ్లా నాయక్’ .. అటు ‘బింబిసార’ ఈ రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. కానీ పాత్ర పరంగా చూసుకుంటే, సంయుక్తకి ఎలాంటి ప్రాధాన్యత లేకపోవడం కనిపిస్తుంది.
ఇక నిన్న థియేటర్స్ కి వచ్చిన ‘సార్’ సినిమాలోను సంయుక్తనే హీరోయిన్. అయితే పేరుకు మాత్రమే ఆమె ఆ ప్లేస్ లో కనిపిస్తుంది. ఒకానొక దశలో ఆమెతో ఏం చేయించాలో తెలియని డైరెక్టర్ ఏదో రీజన్ చెప్పించేసి కాశీకి పంపించేస్తాడు. మళ్లీ ఎప్పటికోగాని ఆమె తిరిగిరాదు. ఇలా సంయుక్త తెరపై కాసేపు కనిపించే పాత్రలనే చేస్తూ వెళితే కష్టమే. తన పాత్రల్లో బలం .. వైవిధ్యం ఉండేలా చూసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. తరువాత సినిమా అయిన ‘విరూపాక్ష’లోనైనా సంయుక్త పాత్రకి ఇంపార్టెన్స్ ఉంటుందేమో చూడాలి.