Share to Facebook Share to Twitter share to whatapp share to telegram

Not a Sweet: కొడుకు- ఆలు అన్న రెండు మాటలు కలిసి కోడలు అన్నమాట పుట్టిందని వ్యుత్పత్తి అర్థాన్ని సాధిస్తుంటారు. అత్తా- కోడళ్ల సాధింపుల ముందు ఏ అర్థ సాధింపులయినా సిగ్గుతో తలదించుకోవాల్సిందే. ఈ సూత్రం ప్రకారం గొడుగు ప్లస్ ఆలు కలిసి గోడలు అన్న మాట పుట్టి ఉంటుందని మనం కంక్లూజన్ కు వస్తే భాషాశాస్త్రవేత్తలు హర్ట్ అవుతారు. గోడ ఏకవచనం. గోడలు బహువచనం. కోడలు- గోడలు మాటల్లో దాగిన ఓ అ ఉ అచ్చులన్నీ ఒకటే కావడం కాకతాళీయమే అయినా…ఇందులో ఏదో ప్రతీకాత్మక సందేశం, లిటరల్ జస్టిఫికేషన్ కూడా దాగి ఉన్నట్లుంది.

త్తా- కోడళ్ల జాతివైరం ఈనాటిది కాదు. యుగయుగాలది. అత్తా ఒకనాటి కోడలే అయినా…ఇప్పటి కోడలు కూడా ఒకనాటికి అత్తే కావాల్సి ఉన్నా వారి మధ్య వైషమ్యం, వైమనస్యం, వైరుధ్యం, చిటపటలు, ఉప్పు- నిప్పు మాత్రం శాశ్వతం.

ఇందులో మామ అనే మగవాడు ప్రేక్షకుడు. భర్త అనే మగవాడు మౌన ప్రేక్షకుడు. కొడుకు అనే మగవాడు మూగవాడు. ఇంకా అనేకమంది మగవాళ్లు కళ్లు, చెవులు ఉన్నా పనిచేయనివారు.

కోడలికి సహజంగా అత్తలో ఎప్పుడూ దయ్యమే కనిపిస్తూ ఉంటుంది. వైస్ వర్సా కోడలిలో అత్తకు కూడా పిల్ల దయ్యమే దర్శనమవుతూ ఉంటుంది. తమాషా ఏమిటంటే అత్తలో కోడలు దయ్యాన్ని చూస్తున్న సమయంలోనే…అదే అత్తలో ఆమె కూతురికి తల్లిగా దేవత కనబడుతూ ఉంటుంది. అలాగే కోడలిలో దయ్యాన్ని చూసి అత్త భయపడే అదే సమయంలో…ఆ కోడలి తల్లికి కూతురిలో దేవతే కనబడుతూ ఉంటుంది. ఇది అందరికీ అనుభవంలో ఉన్నా…స్పష్టంగా తెలిసినా…

తల్లి పాత్రలో ఉన్నప్పుడు
“కూతురు బంగారం; కోడలు రాక్షసి”
కోడలు పాత్రలో ఉన్నప్పుడు…
“అమ్మ బంగారం; అత్త రాక్షసి”
అన్న అలిఖిత ప్రామాణిక సూత్రాలు పుట్టుకతోనే ఎక్కించేశాము కాబట్టి…చచ్చేదాకా ఆ భావన మారదు. మారడానికి వీల్లేదు.

అత్త విష్ణుసహస్రనామం చదువుతుంటే సహజంగా కోడలికి ఇంకేదో వినకూడనిది వినపడుతూ ఉంటుంది. కోడలు అన్నం తింటుంటే అత్తకు గడ్డి తింటున్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. దాంతో వెంటనే-

“అమ్మా! చూశావా? మా అత్త పొద్దున్నే కృష్ణా రామా! అనుకోకుండా…బూతులు మాట్లాడుతోంది…” అని కోడలు తన తల్లికి వీడియో కాల్లో పూసగుచ్చినట్లు చెప్పాల్సి వస్తుంది.

అదే సమయానికి అత్త కూడా తన కూతురికి వీడియో కాల్ చేసి-
“చూడవే…కోడలు పొద్దు పొద్దున్నే గడ్డి తింటోంది…అసహ్యంగా …”
అని ఒక్కొక్క గడ్డి పోచ గురించి గంటలు గంటలు చెప్పాల్సి ఉంటుంది.

ఇలా తిండి, వేషం, భాష, యాస, ఆచారం, సంప్రదాయం, అలవాట్లు…అన్నిట్లో కోడలిని ఆమె తల్లిదండ్రులు పరమ అనాగరికంగా పెంచినట్లు అత్త బహిరంగంగానే ప్రకటిస్తూ ఉంటుంది. పాతరాతియుగం గుహల్లో ఆకులు అలములు చుట్టుకుని బతికిన వారిలా అత్యంత అసహ్యించుకోదగ్గట్టుగా అత్త ఉన్నట్లు అత్త ముందే కోడలు తన తల్లికి ప్రత్యక్ష ప్రసారంలో చెబుతూనే ఉంటుంది.

ఇంత తీవ్రమయిన విద్వేషాలు, అంతర్యుద్ధాలు, ఆధిపత్య పోరాటాలు, పితూరీలు, అలకలు, ఏవగింపులు, ఛీదరింపులు, విసుక్కోవడాలు, ఎడమొహం- పెడ మొహాలుగా ఉన్నా…కొన్ని కోట్ల కుటుంబాలు విఛ్చిన్నం కాకుండా అలా నిలబడి ఉండడం దైవ లీల తప్ప మరొకటి కాదు. అత్తా-కోడళ్ల అంతర్యుద్ధాలు, అంతఃపుర కుట్రల్లో ఎవరివైపు బంధువులకు వారిదే కరెక్టుగా అనిపించడం కూడా దైవలీలే అయి ఉండాలి.

ప్రతి వివాదానికి-
నీ వాదన;
నా వాదన;
నిజమయిన వాదన- అని మూడు కోణాలుంటాయి. అత్తా- కోడళ్ల వివాదానికయినా అంతే. నీరు పల్లమెరుగు- నిజం దేవుడెరుగు. ఆ దేవుడు కూడా దిగివచ్చి అనవసరంగా అత్తా- కోడళ్ల వివాదంలో తీర్పు చెప్పే సాహసానికి ఒడిగట్టడు.

కొందరు కోడలిని తిడతారు. కొందరు కొడతారు. కొందరు అవమానిస్తారు. కొందరు మెడపట్టి గెంటేస్తారు. కొందరు అదనపు కట్నం కోసం వేధిస్తారు. కొందరు బతికి ఉండగానే నరకం చూపుతారు. కొందరు పొమ్మనలేక పొగబెడతారు. కొందరు అగ్గిపెడతారు.

హైదరాబాద్ లో ఒక పేరున్న పెద్దాయన మనవడు కోడలు ఇల్లు దాటి వెళ్లకుండా గోడలు కట్టాడు. ఆ పెద్దాయన బతుకంతా హిందూ ధర్మానికి, ఆధ్యాత్మిక మార్గానికి కట్టుబడినవాడు. కొన్ని విలువలు, ఆదర్శాలకు ప్రతిరూపంగా బతుకు గడిపినవాడు. భారతీయతను తిని, తాగి, పీల్చి బతుకును పండించుకున్నవాడు. కోడలి చుట్టూ గోడలు కట్టిన ఒకరి నిర్వాకం వల్ల ఆ పెద్దాయన పేరు వార్తల్లోకి రావడం వినడానికే ఇబ్బందిగా ఉంది.

గోడలకు చెవులున్నప్పుడు…
కళ్లు కూడా ఉంటాయని ఈ కథలో అత్త మామలు, భర్త గ్రహించినట్లు లేరు. కళ్లున్నప్పుడు...గోడలకు కంప్లైంట్ రాసే చేతులు కూడా ఉంటాయన్న గ్రహింపు ఉన్నట్లు లేదు. కోడలు గోడలు దాటి పోలీస్ స్టేషన్ కు వెళ్ళబట్టి లోకానికి ఇదంతా తెలిసింది.

అడ్డుగా కట్టిన గోడలు దాటలేని, గోడలు బద్దలు కొట్టలేని కోడళ్లు ఇంకా ఎందరున్నారో? ఏమో?

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

నీ మెడ సాక్షిగా!

Also Read :

వరకట్న నిషేధానికి కేరళ కొత్త ఫార్ములా!

Leave a Reply

Your email address will not be published.

Powered by Digital Ocean Design and Developed by Trade2online.com