Peddireddy on New Districts: అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువ చేసేందుకే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నామని, రాజకీయ లబ్ధికోసం కాదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. సిఎం జగన్ అసలు రాజకీయ లబ్ధి కోణంలో ఏ పనీ చేయరని అయన వ్యాఖ్యానించారు. సిఎం ఏ కార్యక్రమమైనా కులం, మతం, రాజకీయాలు, ప్రాంతాలకు అతీతంగా చేపడతారని అన్నారు.
పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని సిఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారని పెద్దిరెడ్డి వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్టంలో గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశామని, ప్రతి యాబై ఇళ్ళకు ఒక గ్రామ వాలంటీర్ ను నియమించామని పెద్దిరెడ్డి గుర్తు చేశారు. చిన్న జిల్లాల ఏర్పాటు ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చనేది ప్రభుత్వ అభిప్రాయమని దాని ప్రకారమే కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ మొదలు పెట్టామని పెద్దిరెడ్డి వివరించారు. దక్షిణభారత దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాల్లో లోక్ సభ నియోజకవర్గాలను జిల్లాలుగా ఏర్పాటు చేశారని, తెలంగాణాలో అయితే మరికొన్ని ఎక్కువగానే కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారని పెద్దిరెడ్డి వివరించారు.
మదనపల్లె జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన గతంలో ఎప్పుడూ లేదని, మదనపల్లెకు మెడికల్ కాలేజీ కేటాయించామని, పార్లమెంట్ కేంద్రం అయిన రాజంపేట అనుకూలంగా లేదని, అందరికీ మధ్యలో ఉండేలా రాయచోటిని నిర్ణయించామని చెప్పారు. జిల్లాల పునర్విభజనకు జనాభా ప్రాతిపదిక సమస్య కాబోదని పెద్దిరెడ్డి అన్నారు జిల్లాల ఏర్పాటు అనేది పూర్తిగా రాష్ట్ర పరిధిలోని అంశం కాబట్టి ఏవైనా చిన్న చిన్న మార్పులు అవసరమైతే ఎప్పుడైనా చేసుకునే వీలుంటుందని చెప్పారు.
Also Read : కొత్త జిల్లాల ఏర్పాటుకు కేబినేట్ ఆమోదం
Thanks!