Songs-Serialism: మాటలో, పాటలో మాటలే ఉన్నా మాట మాటే. పాట పాటే. మాటల్లో చెప్పలేనిదేదో పాటలో చెప్పాలి. మామూలు మాటలను పేర్చి పాటల కోటలు కట్టాలి. అది సినిమా సందర్భంలో ఎంతగా ఒదిగి ఉంటుందో…అంతగా సందర్భం దాటి ఎదిగి…బయట ప్రపంచాన్ని కూడా ప్రతిబింబించాలి. ఆ పాట విశ్వవ్యాప్తమై వినిపించాలి. అనంతమైన ఆ పాట ఎవరు పాడుకుంటే వారికి సొంతం కావాలి. ఆ పాట తోడు కావాలి. ధైర్యం చెప్పాలి. ఓదార్చాలి. తట్టి లేపాలి. జోకొట్టి లాలి పాడాలి. మెరుపులు పట్టి కనువిందు చేయాలి. కర్ణామృతమై చెవులకు విందు చేయాలి. మనసుకు హత్తుకోవాలి.
పాట నడిచి వచ్చిన బాట కావాలి.
పాట భావికి బాటలు వేయాలి.
పాటల బావిలో తేనెల తేటల భావాలు ఊరుతూనే ఉండాలి.
పాట బావుటాగా రెపరెపలాడుతూ ఉండాలి.
పాట పేరంటమవ్వాలి.
పాట పందిళ్లు వేయాలి.
పాట ముంగిట ముగ్గులు వేయాలి.
పాట మదిలో వీణలు మీటాలి.
పాట దానికదిగా ఒక ఉత్సవం కావాలి.
పాట అనగలరాగమై తొలుత వీనులలరించి…అనలేనిరాగమై మరలా వినిపించాలి. ఆబాలగోపాలం ఆబాలగోపాలుడి ముక్తపదగ్రస్తాలు వెతుక్కుని ఆరాధ ఆరాధనా గీతాలు పాడుకోవాలి. అచ్చెరువున అచ్చెరువున విచ్చిన కన్నులతో ఆ పాటను చూడాలి. నెమలికి నేర్పిన నడకలివి అని పాట సవాలు విసరగానే నెమళ్లు ఆ పాటల వెంట నాట్యం నేర్చుకోవడానికి పరుగులు తీయాలి. మురళికి అందని పలుకులివి అనగానే మురళులు చిన్నబోవాలి. కలహంసలకిచ్చిన పద జతులు, స్వర జతులు అనగానే హంసలు నడక నేర్చుకోవాలి.
ఏ కులము నీదని పాట అంటే గోకులం గొల్లున నవ్వి మాధవుడు యాదవుడు మా కులమేలెమ్మని బదులు చెప్పాలి. ఆది నుండి ఆకాశం మూగది, అది అనాదిగా తల్లి ధరణి మూగది అంటూ నడుమ వచ్చి ఉరిమే మబ్బుల నడమంత్రపు సిరిని ఉతికి ఆరేయాలి.
తెల్ల గోవు కడుపున పుట్టే ఎర్ర గోవు, కర్రి ఆవు కడుపున పుట్టే తెల్ల ఆవు కలిసి కూర్చుని తెల్లని, చల్లని ఒకే రంగు పాట పాడాలి. అన్ని వర్ణాలకు ఇహపరమైన వర్ణం ఒక్కటేనన్న పాలలాంటి స్వచ్ఛమైన పాట పాడాలి.
శివుడు సాయం సంధ్యవేళ తాండవం చేయడానికి నడుం బిగించగానే పాటలు మువ్వలై మోగాలి. గువ్వలై ఎగరాలి. పువ్వులై శివపూజకు చివురించాలి.
మావి చిగురు తినగానే కోయిల పాడుతుందో?
కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడుగుతుందో?
తెలియని అయోమయంలో పాట ఒళ్లో ఉయ్యాల కావాలి.
చరణ కింకిణులు ఘల్లు ఘల్లుమన…
పాటకు మయూరి ఆడలేక ఓడిపోయి…ఓటమిలో గెలుపును వెతుక్కోవాలి.
పాటకు కొత్తగా రెక్కలొచ్చి ఎగరాలి. మొగ్గ తొడిగిన పాట వికసిత శతదళ సువర్ణ కుసుమమై మన మనసుల్లో విచ్చుకోవాలి.
తెలిమంచు తొలగిన పాట ఇలగొంతు వినిపించాలి. కువకువల మెలకువల స్వాగతాలు పాడాలి.
కనులు లేని వేణువు కనువిప్పి సిరివెన్నెలలను చూడాలి.
మాటలేని సిరిసిరి మువ్వలు నోరువిప్పి నాట్యం చేయాలి.
స్వాతి కిరణాలై జాలిగా జాబిలమ్మను ఓదార్చాలి.
ఆయా పాటలు రాసిన రచయితలు, బాణీలు కట్టిన సంగీత దర్శకులు, పాడిన గాయకులు, వాద్యకారులు, నటించిన నటులు, డబ్బు పెట్టిన నిర్మాతలు…అందరూ గొప్పవారే.
కానీ…ఆయా సందర్భాలను సృష్టించిన విశ్వనాథుడు మహా గొప్పవాడు. అలాంటి కాశీనాథుని విశ్వనాథుడికి ఏమిస్తే మన రుణం తీరుతుంది?
ఆ సంగీత సాహిత్యాలనే వింటూ, కంటూ, అంటూ, అనుకుంటూ ఉంటే కొంతలో కొంత రుణం తీరుతుందేమో!
-పమిడికాల్వ మధుసూదన్
[email protected]
Also Read :
Also Read :