-0.2 C
New York
Wednesday, November 29, 2023

Buy now

Home'ఐ'ధాత్రి ప్రత్యేకంతల్లీ నిన్ను దలంచి....

తల్లీ నిన్ను దలంచి….

“అమృతానికి , అర్పణకు అసలు పేరు అమ్మ
అనుభూతికి , ఆర్ద్రతకు ఆనవాలు అమ్మ
ప్రతి మనిషి పుట్టుకకే పట్టుగొమ్మ అమ్మ
ఈలోకమనెడి గుడిజేరగ తొలివాకిలి అమ్మ”

– మాడుగుల నాగఫణి శర్మ

“కుపుత్రో భవతి
కుమాతా నభవతి-
లోకంలో చెడ్డ కొడుకులు ఉంటారేమో కానీ, చెడ్డ తల్లులు ఉండరు”

-శంకరాచార్యులు

ఈరోజు మే 9 – అంతర్జాతీయ మాతృ దినోత్సవం. ఇలాంటి దినం ఒకటి ఉండడం ప్రపంచంలో అమ్మలందరికీ నిజానికి ఒకరకంగా అవమానం.

తెలుగులో పిచ్చి తల్లి అని ఒక మాట. అమాయకమయిన అనే ఇక్కడ అర్థం తప్ప నిజంగా పిచ్చి కాదు. ఈమాట ఎలా పుట్టినా ఏ తల్లిని చూసినా ఇప్పుడు పిచ్చి తల్లి అని అనకతప్పడం లేదు. లేదా తల్లికి పిచ్చి ఉందని కొడుకులు నిరూపించడానికో, లేని పిచ్చి తెప్పించడానికో ప్రయత్నిస్తుంటారు కాబట్టి ఈ మాట అలా అలా అలవోకగా వాడేస్తున్నారేమో భాషాశాస్త్రవేత్తలు, మానసిక నిపుణులు, సామాజిక శాస్త్రజ్ఞులు కనుక్కుని చెప్పాలి.

ప్రేమ – పిచ్చి ఒకటే అన్న ప్రమాణం ఉండనే ఉంది కాబట్టి కొడుకులమీద ప్రేమతో తల్లి పిచ్చి ముద్రనుకూడా ప్రేమగా భరిస్తుంది. అవసరమనుకుంటే కోడలు మనసు తృప్తిపరచడానికి నిజంగా పిచ్చిని నటిస్తుంది.

అంతవరకూ అమ్మ అభిరుచులు, రుచులే తనవిగా ఉన్నకొడుకు – భార్యరాగానే అమ్మను వ్యతిరేకిస్తాడు. భార్య రాగానే అమ్మలో చాదస్తం హెచ్ డీ, 4 కే క్లారిటీతో కనబడుతుంది. అమ్మ వంటలు నచ్చవు. అమ్మ – భార్య ఒకే పైకప్పు కింద ఉండలేరు అని పెళ్లయిన ఆరునెలలకే కొడుకు తీర్మానిస్తాడు.

ఆ అమృతవాక్యం కోసమే ఎదురు చూస్తూ అనారోగ్యంతో లేస్తే కూర్చోలేని , కూర్చుంటే లేవలేని భర్తను వెంటబెట్టుకుని అమ్మ మరో పైకప్పుకోసం వెతుక్కుంటూ వెళుతుంది. పిల్లలకోసం అప్పుడు మిమ్మల్ను పట్టించుకోలేదు – ఇప్పుడు దేవుడు నాకు తగినశాస్తి చేశాడు అని మంగళసూత్రం కళ్ళకద్దుకుంటూ పతిసేవల్లో తరిస్తూ ఉంటుంది. చుట్టపుచూపుగా వచ్చే మనవళ్లు, మనవరాళ్లకు సేవలు అదనం.

అమ్మ ప్రాణం పణంగా పెడితే ఈ లోకంలో మెడకాయమీద తలకాయ ఉన్నవారు పుట్టారు. అమ్మ రక్త మాంసాలు పాలు ప్రేమ పంచితే ఈ లోకం పెరుగుతోంది. అమ్మ కంటిచూపుతో ఈ జగతిని పెద్ద చేస్తోంది. మనమంతా అమ్మకు బహిర్ ప్రాణాలు. మనమంతా అమ్మ తీర్చిన బొమ్మలం.

అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ
చాలా పెద్దమ్మ
తన్ను లోనమ్మినవారి మనంబుల ఉండెడి అమ్మ – అన్నాడు మన పోతన.
అమ్మకు ఒక దినం ఏమిటి?
అన్నీ అమ్మ రోజులే. అమ్మే అనంత సౌందర్యం అంటూ సౌందర్యలహరిలో ఈ భూ ప్రపంచంలో ఇంకెవరూ కీర్తించలేనంత గొప్పగా అమ్మను ఆరాధించారు శంకరాచార్యులు.

అమ్మ ప్రేమ అనంతం. దాన్ని కొలవడానికి కొలమానాలు పుట్టలేదు, పుట్టబోవు. ఎన్ని జన్మలకయినా తీరనిది అమ్మ రుణం. లోకంలో అందరు అమ్మల పాదాలకు నమస్కారం. అమ్మ పాదధూళితోనే పుడమిపావనమవుతూ ఉంటుంది. దేవుడు – అమ్మ ఒకేసారి ఎదురుపడితే ముందు అమ్మనే పట్టించుకోండి. లేకపోతే దేవుడు శపిస్తాడు . దేవుడయినా అమ్మ కడుపులో పుట్టాల్సిందే.

ప్రతిరోజూ అమ్మ రోజే.
మనం ఆ అమ్మ కొమ్మకు పూచిన పువ్వులమే.

తల్లీ ! నిన్ను తలంచి…

-పమిడికాల్వ మధుసూదన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్