Thursday, March 12, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమైలేజ్ యొక్క 'హీరో'! అనువాదం యొక్క 'జీరో'!!

మైలేజ్ యొక్క ‘హీరో’! అనువాదం యొక్క ‘జీరో’!!

తెలుగు ప్రకటనలో అనువాద నినాదం “యొక్క” వింత కథ ఇది!
“యొక్క” విలువ జీరో కాకుండా హీరో అయిన యాంత్రిక మైలేజ్ భాష ఇది!!

“హీరో యొక్క స్కూటర్.. స్కూటర్ యొక్క హీరో!”. వినడానికి ఇది ఎంత ‘యొక్క’మయంగా ఉందో కదా! అసలు ప్రామాణిక తెలుగు భాషా వ్యాకరణ నియమాల ప్రకారం ‘యొక్క’ అన్న పదాన్ని వాడటమే తప్పు అని పండితులు నెత్తీ నోరూ కొట్టుకుంటుంటే.. మన హీరో బైక్ ల కంపెనీవారు మాత్రం దానినే తన డెస్టినీ (Destini) యొక్క ట్యాగ్ లైన్‌గా మార్చేశారు. ఈ స్కూటర్ ఇచ్చే మైలేజ్ యొక్క మహిమ వల్ల బహుశా పెట్రోల్ బంకుల యొక్క యజమానులు కన్నీరు మున్నీరు అవుతున్నారేమో కానీ, మన తెలుగు భాష యొక్క లాంగ్ డ్రయివ్ యొక్క మైలేజీ చూస్తే మాత్రం సామాన్యుడి యొక్క గుండె వెక్కి వెక్కి ఏడ్చి ఆగిపోవడం ఖాయం.

దీని కొనసాగింపుగా రెండు అంతర్జాతీయ వార్తలు “యొక్క” ప్రాధాన్యంతో రాస్తే ఇలా ఉంటుంది. మీయొక్క గుండెకు ధైర్యముంటే ఆ యొక్క ధైర్యం తోడుగా చదవండి…

ట్రంప్ యొక్క గ్రీన్ లాండ్ గాలం!

మొదటగా మన అమెరికా యొక్క అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారి గురించి చెప్పుకోవాలి. ఆయన యొక్క ఆలోచనలు ఎప్పుడూ ‘ఆకాశం యొక్క అంచుల్లో’ విహరిస్తూ ఉంటాయి. మొన్నటికి మొన్న ఆయనకు ఒక వింత కోరిక పుట్టింది. అదేమిటంటే.. డెన్మార్క్ దేశం యొక్క ఆధీనంలో ఉన్న గ్రీన్ లాండ్ ద్వీపాన్ని కొనేయాలని! “భూమి యొక్క ధర ఎంతైనా పర్లేదు, నా యొక్క రియల్ ఎస్టేట్ వ్యాపార అనుభవంతో ఆ మంచు కొండ మీద బంగారపు యొక్క భవనాలు కడతాను” అని ఆయన పట్టుబట్టారు.
పాపం డెన్మార్క్ ప్రధాని మాత్రం, “అయ్యా! అది మా దేశం యొక్క భూభాగం, అమ్మకానికి పెట్టిన పాత స్కూటర్ యొక్క భాగం కాదు” అని మొత్తుకున్నారు. అయినా సరే, ట్రంప్ గారి యొక్క పట్టుదల తగ్గలేదు. “మీరు అమ్మకపోతే మా యొక్క స్నేహం యొక్క మైలేజీ తగ్గిపోతుంది” అని ఆయన అలిగారు. బహుశా గ్రీన్ లాండ్ మీద కూడా ‘హీరో యొక్క స్కూటర్’ వేసుకుని తిరగాలని ఆయన యొక్క గాఢమైన కోరిక కాబోలు!

పుతిన్ యొక్క ఉక్రెయిన్ పీటముడి!

ఇక రష్యా యొక్క అధినేత పుతిన్ గారి విషయానికి వస్తే.. అక్కడ జరుగుతున్నది యుద్ధం యొక్క తాండవం. “ఉక్రెయిన్ అనేది నా యొక్క సొంత ఇల్లు, దాని మీద నా యొక్క అధికారం తప్ప ఎవరి యొక్క పెత్తనం సాగదు” అని ఆయన భీష్మించుకుని కూర్చున్నారు. పాపం ఉక్రెయిన్ వారు మాత్రం “మాది స్వతంత్రం యొక్క గడ్డ, మీ యొక్క ఆధిపత్యం యొక్క అడ్డా కాదు” అని ఎదురు నిలిచారు.
దీనివల్ల ప్రపంచం యొక్క శాంతి భద్రతలు ఇప్పుడు ఒక ‘చిరిగిన చాట యొక్క ముక్క’లా మారిపోయాయి. నాటో దేశాల యొక్క మాటలు వింటుంటే.. అవి ‘తుప్పు పట్టిన ఇంజిన్ యొక్క శబ్దాల’ వలె వినబడుతున్నాయి తప్ప, పరిష్కారం యొక్క దరిదాపుల్లోకి కూడా రావడం లేదు. పుతిన్ గారి యొక్క ఫిరంగులు గర్జిస్తుంటే.. అమాయక ప్రజల యొక్క ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఈ యుద్ధం యొక్క మైలేజీ ఎప్పుడు ముగుస్తుందో, శాంతి యొక్క స్కూటర్ ఎప్పుడు రోడ్డెక్కుతుందో ఆ దేవుడికే ఎరుక!

ముగింపు యొక్క ముక్తాయింపు!

చూశారుగా! అమెరికా యొక్క ట్రంప్ అయినా, రష్యా యొక్క పుతిన్ అయినా.. అందరిదీ ఒకే యొక్క ధోరణి. అటు గ్రీన్ లాండ్ యొక్క మంచు కొండల మీద, ఇటు ఉక్రెయిన్ యొక్క గోధుమ పొలాల మీద తమ యొక్క జెండాలు పాతాలని వారు చూస్తున్నారు. మన తెలుగు భాషలో ‘యొక్క’ అన్నది ఎంత అనవసరమో, ప్రపంచ రాజకీయాల్లో ఈ దేశాధినేతల యొక్క మొండితనం కూడా అంతే అనవసరం. కానీ ఏం చేస్తాం? “యొక్కయి వంగనిది మానయి వంగునా?” అన్నట్టు.. వీరి యొక్క స్వార్థం మారనంత కాలం, సామాన్యుడి యొక్క బతుకు ఒక ‘పంచ్ పడ్డ టైర్ యొక్క తీసేసిన గాలి’లాగే ఉంటుంది!

చివరి వాంగ్మూలం:-

ఈ హీరో కంపెనీ స్కూటర్ పేరు డెస్టినీ!
తెలుగు భాష భవిష్యత్తు మైలేజికి కూడా ఇదేనా డెస్టినీ?

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular