గోదావరి నది సముద్రంలో కలిసే చోటుకు కనుచూపు మేరలో ఉంది.నరసాపురం పట్టణం చరిత్రాత్మక పట్టణం.ఈ పట్టణాన్ని డచ్,ఫ్రెంచ్, బ్రిటిష్ వారు పరిపాలించారు.నిజాం నవాబు ఈ పట్టణాన్ని ఫ్రెంచ్ వారికి ధారాదత్తం చేశాడు.ఆ సంధర్భంగా బుస్సీ(ఇతన్నే మనవాళ్లు బూచోడు అంటారు)ఇక్కడకు వచ్చాడని ఆధారాలున్నాయి.అప్పుడే లేసు అల్లికలతో నరసాపురం ప్రసిద్ధి లోకి వచ్చింది.
సాహిత్యం, నాటకం, మొదలైన రంగాలలో కూడ నరసాపురం ఎంతో ప్రసిద్ధి చెందింది.
నరసాపురం లో చమత్కారంగా మాట్లాడే వారు దాదాపుగా ప్రతి వీధిలోనూ కనబడతారు.
నవ్వుల పువ్వులు పూయించిన మహామహులెందరో ఉన్నారు.
హాస్యరంగానికి నరసాపురం ఎందరో స్రష్టలను అందించింది.
వారిలో ముందుగా చిలకమర్తి వారిని స్మరించుకోవాలి.వీరవాసరం గ్రామంలో జన్మించారు. కానీ హైస్కూల్ విద్యను నరసాపురం మిషన్ హైస్కూల్ లో చదువుకున్నారు. ఆనాటికే నరసాపురంలో “సాంగ్లీ”నాటక బృందాలు స్ఫూర్తిని ఇచ్చాయని తన ఆత్మకథలో వ్రాశారు. తెలుగులో తొలి పూర్తి స్థాయి హాస్య రచనలను వెలువరించింది చిలకమర్తి వారే….
ప్రహసనాలు మొదలుపెట్టిన రచయిత ఆయనే.చిలకమర్తి వారి అద్భుత సృష్టి ‘గణపతి’
తెలుగులో మొదటి హాస్యనవల.తరువాత దీనిని ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారు శ్రవ్య నాటకంగా మార్చారు.చిలకమర్తి వారి ప్రహసనాలు హాస్య గుళికలు.
తెలుగు సాహిత్యంలో మరో హాస్య నవల “బారిస్టర్ పార్వతీశం”.అందులో పార్వతీశం నరసాపురం టేలర్ హైస్కూలులో చదువుకుంటాడు.బారిస్టరయ్యాక టేలర్ హైస్కూలులో ప్రత్యేక సమావేశాలకు వక్తగా వస్తాడు.
తెలుగు గీతాచార్యుడు “బాపు” పుట్టింది నరసాపురంలోనే!
తెలుగు వాళ్ళ ఎదలలో తన కార్టూనులతో చెరిగిపోని హాస్య ముద్రలను వేసిన బాపు ను మరచిపోగలమా….
తెలుగు వెండితెరపై నవ్వుల వానను కురిపించిన హాస్యనట చక్రవర్తి”రాజబాబు”నరసాపురం లోనే పుట్టారు.
“నవ్వడం ఒక భోగం
నవ్వించడం ఒక యోగం
నవ్వకపోవడం ఒక రోగం”
అని ఎలుగెత్తి చాటిన “జంధ్యాల” కూడ నరసాపురంలోనే పుట్టారు.నాటక రచయితగా,మాటల రచయితగా, సినీ దర్శకునిగా జంధ్యాల సంచలనాలను సృష్టించారు. “హాస్యబ్రహ”గా చిరకాలం ఆయన చిరునామా చెరగదు.
అల్లు రామలింగయ్య సొంత ఊరు పాలకొల్లు అయినా ఆయనకు సినిమా అవకాశాన్ని ఇప్పించిన ‘కూడు-గుడ్డ’నాటకం నరసాపురం వాసి,మాజీ మంత్రి శ్రీ పరకాల శఘషావతారం వ్రాసినదే….
దీన్ని అల్లు వారు పలుమార్లు చెప్పారు.అంతే కాదు క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు అల్లు గారు నరసాపురంలోనే జైలులో ఉన్నారు.
తెలుగు సాహిత్యంలో హరికథకు జీవం పోసిన శ్రీమాన్ దీక్షిత దాసు గారు నరసాపురం వాస్తవ్యులే.వారి “ఉద్రిక్త నటులు” పద్యాలు వింటే కడుపుబ్బా నవ్వుకోవలసిందే……
నాటక రంగంలో హాస్య నటునిగా పేరొందిన మాఢభూషి కృష్ణమాచార్య నరసాపురం నివాసే….
తెలుగులో తొలిసారిగా రికార్డింగ్ డ్యాన్స్ లకు మూలం ఈ కృష్ణమాచర్యులే.భజంత్రీలు,ఇదేమిటి వంటి భమిడిపాటి వారి నాటకాలకు పేటెంట్ ఆయన.ముఖ్యంగా ఇదేమిటి నాటకంలో “సత్రకాయ”పాత్రను మాడభూషి పోషించిన తీరు నభూతో నభవిష్యతి.
60 వ దశాబ్దంలో భమిడిపాటి వారి హాస్య నాటకాలతో నరసాపురం”శివాజీ డ్రమెటికల్ అసోసియేషన్”ఎంతో పేరు తెచ్చుకుంది.
అవధాన రంగంలో హాస్యానికి పెద్దపీట వేసిన అప్రస్తుత ప్రసంగ ప్రష్ట చక్రావధానుల రెడ్డప్ప ధవేజిది కూడ నరసాపురమే…
అంతే కాదండోయ్.ముత్యాల ముగ్గు సినిమాలో రావు గోపాలరావు డైలాగ్ “అలో…అలో..అలో…ఠ
కూడ నరసాపరంలోని గాదె మాణిక్యం గుప్త గారి ఊతపదం.
ఈరోజు ప్రపంచ నవ్వుల దినోత్సవం.
నవ్వులు పూయించే వారందరికీ ఇది అంకితం.
—చక్రావధానుల రెడ్డప్ప ధవేజి
నరసాపురం
9703115588.