Thursday, February 20, 2025
Homeవార ఫలాలువార ఫలాలు

వార ఫలాలు

16-02-2025 నుండి 22-02-2025 వరకూ

Weekly Horoscope in Telugu :

మేషం (Aries):
నిర్దేశించుకున్న లక్ష్యాన్ని అవలీలగా చేరుకుంటారు. కీలక వ్యవహారంలో మిత్రులతో పాటు అదృష్టం కూడా తోడుగా ఉంటుంది. ధనలాభం వుంది. సహచరులతో విభేదాలు సమసిపోతాయి. వివాదాలు పరిష్కారం అవుతాయి. జీవిత భాగస్వామి తోడ్పాటుతో కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దుతారు. ఇతరులతో చక్కటి సంబంధాలు ఏర్పడతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. కొత్త విషయాలను గ్రహిస్తారు. భాగస్వామ్య లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. వారాంతంలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. పోటీల్లో పాల్గొనకండి.

వృషభం (Taurus):
వ్యవహారాలన్నీ శుభప్రదంగా సాగుతాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. కీలక సమయంలో అదృష్టం వరిస్తుంది. బలహీనతలను అధిగమించడంలో మిత్రులు సహకరిస్తారు. నూతన వస్తువులను సమకూర్చుకుంటారు. వాహన యోగం వుంది. కొత్త పరిచయాలు లాభసాటిగా వుంటాయి. కొత్త విషయాలను గ్రహిస్తారు. విందులకు హాజరవుతారు. సంతాన సంబంధ విషయాలు తృప్తినిస్తాయి. కీలక నిర్ణయాల్లో జీవిత భాగస్వామిని సంప్రదించండి. వృథా ఖర్చులుంటాయి. పోయిన వస్తువు దొరుకుతుంది.

మిథునం (Gemini):
పనులు అనుకున్నట్లే సాగుతాయి. ధనలాభం గోచరిస్తోంది. స్వస్థానప్రాప్తి వుంది. బంధువులతో విందు, వినోదాల్లో పాల్గొంటారు. సందేహాలు తొలగిపోతాయి. మానసిక వ్యథ తీరుతుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా వుంటాయి. స్థిరాస్తి రంగంలోని వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వృథా ఖర్చులను తగ్గించాలి. వాహన సంబంధ సమస్య ఏర్పడుతుంది. కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ వహించాలి. కీలక వ్యవహారాల్లో మిత్రుల సూచనలను పాటించండి. గుట్టు రట్టయ్యే వీలుంది. గుడ్డిగా అందరినీ నమ్మకండి.

Weekly Horoscope in Telugu :

కర్కాటకం (Cancer):
అభీష్టం నెరవేరుతుంది. వ్యవహారాల్లో విశేష లాభం వుంటుంది. అందరి సహకారం అందుతుంది. ముఖ్యంగా కీలక తరుణంలో సోదరులు అండగా నిలుస్తారు. ఆత్మధైర్యం పెరుగుతుంది. ప్రియతముల కలయిక ఉత్తేజాన్ని నింపుతుంది. నాయకత్వ లక్షణాలకు తగ్గ గుర్తింపును పొందుతారు. ఆధ్యాత్మిక అంశాలు ప్రేరణనిస్తాయి. కీలక సమాచారం అందుతుంది. కుటుంబ సౌఖ్యాన్ని పొందుతారు. తొందరపాటు వల్ల బంధు విరోధం ఏర్పడుతుంది. తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. మైనింగ్ రంగంలోని వారు జాగ్రత్తగా వుండాలి.

సింహం (Leo):
వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. అవసరమైనంత డబ్బు చేతికి అందుతుంది. వస్త్రాభరణాలను కొంటారు. మిత్రులు తోడుంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తోబుట్టువుల సమస్యలను పరిష్కరిస్తారు. సహ ఉద్యోగులతో సఖ్యత వుంటుంది. ప్రయాణం లాభిస్తుంది. సమాచార, ప్రసార విభాగాల్లోని వారికి శుభ ఫలితాలు వుంటాయి. బ్యాంకు లావాదేవీల్లో అప్రమత్తంగా వుండండి. మనసులోని భావాన్ని స్పష్టంగా చెప్పలేక చిక్కుల్లో పడతారు. వేళకు భోజనం వుండదు. ఆస్తి లావాదేవీలు మానసిక ఒత్తిడిని పెంచుతాయి.

కన్య (Virgo):
వ్యక్తిగత ప్రతిష్ట పెరుగుతుంది. వ్యవహారాలన్నీ సఫలం అవుతాయి. లక్ష్యాన్ని అవలీలగా చేరుకుంటారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు. మీ తెలివితేటలకు చక్కటి ప్రశంసలు అందుతాయి. బాల్య స్నేహితులను కలుస్తారు. నిరుద్యోగులకు శుభప్రదంగా వుంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. సోదరుల వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి. కమ్యూనికేషన్స్ రంగంలోని వారికి అత్యంత యోగదాయకంగా వుంటుంది. సహచరులతో సఖ్యత వుంటుంది. ఎవరికీ హామీ ఇవ్వకండి. ముందుచూపుతో వ్యవహరించండి.

తుల (Libra):
ఒడుదుడుకులు ఎదురైనా కార్యాలు విజయవంతం అవుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. వాహన యోగం వుంది. అదృష్టం వరిస్తుంది. మానసిక స్థితి ఉత్సాహంగా వుంటుంది. ఉన్నత స్థాయికి ఎదగాలన్న ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకొస్తాయి. ఇంటికి దూరంగా వెళ్లే సూచన వుంది. కోర్టు వ్యవహారాల్లో నిర్లక్ష్యం వల్ల నష్టపోతారు. విదేశీ ప్రయాణ యత్నాలు అనుకూలిస్తాయి. ఇతరుల వ్యవహారాల్లో అనవసర జోక్యం వద్దు. కుటుంబ వ్యవహారాలపై శ్రద్ధ పెట్టండి. కంటి సమస్య వుంటుంది.

Weekly Horoscope in Telugu :

వృశ్చికం (Scorpio):
అన్ని రకాలుగానూ లాభపడతారు. కోరికలు నెరవేరతాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా వుంటాయి. కొత్త స్నేహాలు ఏర్పడతాయి. ఇంట్లో శుభ కార్యం గురించిన చర్చలు సాగుతాయి. సంతాన సంబంధ విషయాలు ఆనందాన్నిస్తాయి. పెద్దలను కలిసి ఆశీస్సులను పొందుతారు. ఆరోగ్యం నిలకడగా వుంటుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. రుణ విముక్తికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బాల్యమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. అనవసర ప్రయాణాలు మానుకోండి. నోటిదురుసు వల్ల బంధువులతో విరోధం ఏర్పడుతుంది.

ధనుస్సు (Sagittarius):
అన్ని పనుల్లోనూ అనుకూల ఫలితాలు లభిస్తాయి. ఇష్టకార్యం అనుకూలం అవుతుంది. బంధువులతో విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఇతరులతో విరోధంలో మీదే పైచేయి అవుతుంది. అధికారులు, పెద్దల ఆదరాభిమానాలను పొందుతారు. జీవితంలో ఎదిగేందుకు మేలిమి అవకాశం లభిస్తుంది దుర్వినియోగం చేసుకోకండి. కొత్త స్నేహాలు లాభదాయకంగా వుంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సంతాన వ్యవహారాలు తృప్తినిస్తాయి. కోర్టు వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. అనవసర విషయాల్లో జోక్యం వద్దు.

మకరం (Capricorn):
పట్టింది బంగారంలా సాగుతుంది. అభీష్టం నెరవేరుతుంది. వృత్తిపరమైన తృప్తిని పొందుతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా వుంటాయి. కుటుంబంలో ప్రశాంతత వుంటుంది.సమాజంలో గౌరవం వృద్ధి చెందుతుంది. కొత్త బాధ్యతలను స్వీకరించే సూచన వుంది. అవకాశాలను చేజార్చుకోకండి. ప్రభుత్వం నుంచి లబ్దిని పొందుతారు. రుణ విముక్తికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మిత్రులు సహకరిస్తారు. దూర ప్రయాణం వుంది. భవిష్యత్తుకు సంబంధించి ప్రణాళికలు రూపొందిస్తారు. మనశ్శాంతితో వుంటారు.

కుంభం (Aquarius):
వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఇష్టమైన పని నెరవేరుతుంది. బంధువులతో విందుల్లో పాల్గొంటారు. కీలక వ్యవహారంలో మిత్రుల సహకారం ఉపకరిస్తుంది. కుటుంబంలో ప్రశాంతత వుంటుంది. వృత్తిపరమైన నైపుణ్యంతో అధికారుల ఆదరాభిమానాలను పొందుతారు. పోటీల్లో విజేతలుగా నిలుస్తారు. తండ్రి సామాజిక స్థితిగతులు మెరుగవుతాయి. చెప్పుడు మాటలను నమ్మకండి. ఇష్టంలేని పని చేయాల్సి వస్తుంది. తగాదాలు వద్దు. జీర్ణసంబంధ సమస్య వుంటుంది. ఆధ్యాత్మిక చింతన వృద్ధి చెందుతుంది.

మీనం (Pisces):
భాగస్వామ్య వ్యవహారాలు బాగా లాభిస్తాయి. అన్ని పనులు శుభప్రదంగా సాగుతాయి. ఇతరులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. విందులో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో సఖ్యత పెరుగుతుంది. ప్రయాణం లాభిస్తుంది. సంతాన సంబంధ విషయాలు ఆనందాన్నిస్తాయి. నిజాయితీకి తగ్గ గుర్తింపును పొందుతారు. వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా వుండండి. విధి నిర్వహణలో అక్ష్యం వల్ల అధికారుల కోపానికి గురవుతారు. తగాదాలకు దూరంగా వుండండి. భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళికలు రచిస్తారు.

గమనిక :
జన్మరాశిని అనుసరించి ఈ ఫలితాలు చూసుకోవాలి. ఇవి, గోచార గ్రహాల సంచారాన్ని బట్టి నిర్ణయించిన స్థూల ఫలితాలు. వ్యక్తిగత జాతక ఫలితాలు తెలుసుకో దలచిన వారు, తమ జన్మ వివరాలు (పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు) దిగువ సూచించిన మెయిల్ ఐడీకి పంపగలరు.

శుభం భూయాత్

పి.విజయకుమార్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్