మనలో చాలామంది చిన్నప్పుడు స్కూల్ కు నడుచుకుంటూ వెళ్లే ఉంటాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే ఉంటాం. స్కూలు బయట అమ్మే నారింజకాయలు, ఉసిరికాయలు, తాటి తాండ్ర తినే ఉంటాం. వర్షం వస్తే ప్లాస్టిక్ కవర్లో పుస్తకాలు పెట్టి తలపై పెట్టుకునే ఉంటాం. కొత్త సంవత్సరం వస్తే స్నేహితులకి గ్రీటింగ్ కార్డులు ఇచ్చే ఉంటాం. ఆ డబ్బులకోసం అమ్మని బతిమాలి ఉంటాం….. ఇవన్నీ మీరు చెయ్యలేదా ? అయితే ఏదో మిస్ అయినట్టే. ఒకసారి అలా జ్ఞాపకాల పెట్టెలో తొంగిచూసి నీవేనా నను పిలచినది అని పలకరించాలని ఉందా? అయితే 90స్ కిడ్ పుస్తకం అర్జెంటు గా చదివెయ్యండి.

తండాలో పుట్టిన పిల్లోడు ఏవీ అరవింద్ రాసిన ఈ పుస్తకం కేవలం అతని బాల్యం మాత్రమే కాదు. 90ల్లో, అంతకు ముందు పుట్టిన వారి అనుభవాలు కూడా. కాకపోతే తండాల జీవితం అదనం. చదువే గగనం అయిన చోట చదువుకుంటూ ఎదిగిన అరవింద్ లో ఒక కవి, సమాజాన్ని చదివే అన్వేషి ఉన్నారు. ఏదో తపన అతన్ని నడిపిస్తుంది. అదే అతన్ని సినీ ప్రపంచం వరకు నడిపించింది. ఆ తళుకు బెళుకులకు దూరంగా ఒదిగి ఉండటం అతని నైజం. అతని రాతలో స్వాభిమానం కనిపిస్తుంది. అరవింద్ ని ఇంటర్వ్యూ చేయకముందు పుస్తకం చదివి ఉంటే ఇంకా బాగుండేది. అయినా పర్లేదు. మరెన్నో అనుభవాలు పంచుకున్నాడు.
పిండిమిల్లు దుమ్ములో, రంగుల పాటల పుస్తకాల్లో, పోపన్నంలో మన బాల్యం తడుముతూనే ఉంటుంది. సైకిల్ నేర్చుకోడం, అగ్గిపెట్టె ను ఫోన్ గా వాడటం, చదువు కష్టాలు … అత్యంత సహజంగా మనని ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్తాయి. వీటికి మించి అరవింద్ జీవితం కూడా తెలుస్తుంది. ఎన్నెన్ని కష్టాలు ఒక్కో వ్యక్తి జీవితంలో అనుకుంటాం. అక్కడే చిన్న చిన్న ఆనందాలూ తెలుస్తాయి.
ఇటువంటి పుస్తకాలు మరిన్ని రావాలి. మరచిపోయిన బాల్యాన్ని కళ్ళముందు ఉంచాలి. భావి తరాలకు ఆ రుచి కావాలని అనిపించాలి. అరవింద్ నుంచి మరిన్ని మంచి రచనలు ఆశించవచ్చనే నమ్మకం కలిగించిందీ 90’స్ కిడ్ మ్యూజింగ్స్.
-కె. శోభ

