Thursday, June 11, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఆచార్య సుప్రసన్న 'స్వాధ్యాయ' అక్షర యజ్ఞం

ఆచార్య సుప్రసన్న ‘స్వాధ్యాయ’ అక్షర యజ్ఞం

నేటి వేగవంతమైన, డిజిటల్, కృత్రిమ మేధ సమాజంలో తెలుగు భాషను, తెలుగు పుస్తకాల్లో దాగిన సంస్కృతిని, చరిత్రను, అంతులేని విజ్ఞానాన్ని కాపాడుకోవడం ఒక పెద్ద సవాలు. ఈ నేపథ్యంలో తెలుగు సాహితీ వనంలో విమర్శనా శిఖరం, నవ్య సంప్రదాయ దిక్సూచి ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యుల వారి చిరకాల స్వప్నం ‘స్వాధ్యాయ రీసెర్చ్ సెంటర్’. హైదరాబాద్‌లోని నారపల్లి వేదికగా వెలిసిన ఈ జ్ఞానాలయం కేవలం పుస్తకాల నిలయం మాత్రమే కాదు; ఇది మూడు నాలుగు తరాల తెలుగు మేధో సంపత్తికి సజీవ సాక్ష్యం.

నిశ్శబ్ద విప్లవం- ఒక అక్షర తపస్సు

ఏ చిన్న పని చేయాలన్నా ప్రభుత్వాల వైపు లేదా దాతల వైపు చూడటం నేటి అలవాటు. కానీ, సుప్రసన్నాచార్యుల వారు ఎటువంటి లాభాపేక్ష లేకుండా తమ జీవితకాలపు సంపాదనను, శ్రమను, సమయాన్ని కేవలం ‘భాషా పరిరక్షణ’ కోసం ధారపోశారు. సొంత స్థలంలో, సొంత ఖర్చుతో, స్వశక్తితో నిర్మించిన ఈ ‘అక్షర దేవాలయం’ వారి నిబద్ధతకు నిదర్శనం. ఇది ఒక నిశ్శబ్ద విప్లవం, ఇది రాబోయే తరాలకు మన మూలాలను బతికించి ఇవ్వాలనే సంకల్పంతో పుట్టింది.

వారసత్వ సంపద – అరుదైన గ్రంథాల సేకరణ

ఈ గ్రంథాలయం వెనుక సుదీర్ఘమైన చరిత్ర ఉంది. సుప్రసన్న గారి తాతగారు కోయిల్ కందాడై రంగాచార్యుల కాలం నుండి సేకరించిన అరుదైన గ్రంథాలు ఇక్కడ భద్రంగా ఉన్నాయి. 25,000 పైగా ఉన్న ఈ గ్రంథరాశిలో కొన్ని ముఖ్యమైనవి:-

  • కాలాతీత నిఘంటువులు:- భాషా పరిణామ క్రమాన్ని అధ్యయనం చేసే పరిశోధకులకు ప్రాణవాయువులాంటి 1872 నాటి నిఘంటువులు ఇక్కడ ఉన్నాయి.
  • చారిత్రక ప్రతులు:- 1890ల నాటి రామాయణ, భారత ప్రతులు ఆనాటి ముద్రణా చరిత్రను, వ్యాఖ్యాన శైలిని కళ్లకు కడతాయి.
  • సాహిత్య సర్వస్వం:- జ్ఞానపీఠ గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారి సమగ్ర సాహిత్యం, వ్యాసాలు ఇక్కడ లభిస్తాయి.
  • ఆధ్యాత్మిక శిఖరాలు:- అరవిందులు, రమణ మహర్షి, వివేకానందుల వంటి మహనీయుల ఫిలాసఫీ గ్రంథాలతో పాటు, శ్రీమాతకు సంబంధించిన పెయింటింగ్స్ ఇక్కడ ఉన్నాయి
  • అరుదైన పత్రికలు:- 1920ల నాటి ‘తెనుగు’, 1950ల నాటి ‘సుజాత’ పత్రికల ఒరిజినల్ ప్రతులు ఇక్కడ భద్రంగా ఉన్నాయి.

కళలు, సాంకేతికత, డిజిటైజేషన్

పుస్తకాలతో పాటు చిత్రకళా రంగంపై కూడా ఈ కేంద్రం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. లియోనార్డో డావిన్సీ నుంచి భారతీయ ప్రఖ్యాత చిత్రకారుల వరకు ఎన్నో గ్రంథాలు, తంజావూరు, నకాశీ, కలంకారీ కళల సమాచారం ఇక్కడ లభ్యమవుతుంది.

అంతేకాకుండా కాలంతో పాటు మారుతున్న సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ‘Swadhyayakovela’ పేరుతో యూట్యూబ్ ఛానల్ ద్వారా మహాకవుల (విశ్వనాథ, శ్రీశ్రీ, జాషువా, దాశరథిలాంటివారి) అపూర్వ స్వరాలను డిజిటైజ్ చేస్తున్నారు. అలాగే ఆధునిక సాహితీవేత్తల ఇంటర్వ్యూల ద్వారా మౌఖిక చరిత్రను కూడా భద్రపరుస్తున్నారు.

జ్ఞాన యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్లడం మన బాధ్యత

ఈ అక్షర యజ్ఞం నిరంతరాయంగా సాగాలంటే కేవలం చూసి మురిసిపోవడం సరిపోదు.

  1. అధ్యయనం:- యువత ఈ గ్రంథాలయాన్ని సందర్శించి, మన సాహిత్య వైభవాన్ని అధ్యయనం చేయాలి.
  2. ప్రచారం:- ఇలాంటి గొప్ప ప్రయత్నాల గురించి తోటి మిత్రులకు, విద్యార్థులకు తెలియజేయడం ఒక పెద్ద సహాయం

గడియారం రామకృష్ణ శర్మ, వేదగిరి రాంబాబు, కేకే రంగనాథాచార్యలాంటి దిగ్గజాల గ్రంథాలయాలు ఇందులో లీనమవ్వడంతో స్వాధ్యాయ ఒక ‘మహా జ్ఞాన సముద్రం’గా మారింది.

ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యుల వారి నిబద్ధత మనందరికీ ఒక స్ఫూర్తి దీపం. ఎటువంటి ఆర్థిక సహాయం ఆశించకుండా…కేవలం తెలుగు భాషాభిమానంతో ఆయన నిర్మించిన ఈ అక్షర వారధి రాబోయే తరాలకు దిక్సూచిగా నిలుస్తుంది.

సంప్రదించాల్సిన వివరాలు
* యూట్యూబ్ :- https://www.youtube.com/@swadhyayakovela
* సందర్శన కోసం:- ఈ సంస్థ స్వచ్ఛందంగా నడుస్తున్నది కాబట్టి ముందస్తు సమాచారంతో వెళ్లచ్చు.
* కంటాక్ట్ నంబర్:- కోవెల సంతోష్- 90521 16463

కోవెల సుప్రసన్నాచార్య పుత్రుడు కోవెల సంతోష్ కుమార్ జర్నలిస్టుగా అనేక మీడియా సంస్థల్లో పనిచేసి ప్రస్తుతం స్వతంత్ర జర్నలిస్టుగా పరిశోధనలు చేస్తున్న మంచి రచయిత. భారతీయ కోణంలో చరిత్ర, పురాణాలపై అనేక పరిశోధక వ్యాసాలు రాశారు. ఇంకా రాస్తున్నారు. అవన్నీ పుస్తకాలుగా ప్రచురితమై మార్కెట్లో ఉన్నాయి. తండ్రి ఆశయాన్ని నెరవేర్చడానికి సంతోష్ పడుతున్న శ్రమ అంతా ఇంతా కాదు. ఇంటిని గ్రంథాలయం చేసి…విలువైన పుస్తకాలకు నీడనిచ్చి…తను నీడకోసం వెతుక్కుంటున్న సంతోష్ ఎప్పటినుండో స్వాధ్యాయకు రమ్మని నన్ను పిలుస్తున్నాడు. నాకు ఆత్మీయ మిత్రుడు. నా శ్రేయోభిలాషి. మొన్న కీసరలో ఒక పెళ్ళిలో కాలిశాము. అక్కడికి నారపల్లి దగ్గరే కావడంతో వెళ్ళాను. నూటికో కోటికో ఇలాంటివారు ఒక్కరే ఉంటారు. కోవెల తండ్రీకొడుకులు పుస్తకాలకు కట్టిన కోవెల ఇది- అంతకంటే చెప్పడానికి నాకు మాటలు లేవు. పుస్తకాల డిజిటైజేషన్ ప్రక్రియ కూడా దాదాపు పూర్తి కావస్తోంది. ఇక్కడ అనేక సాహిత్య కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.

1982లో వరంగల్లులో జరిగిన పోతన పంచశతి ఉత్సవాల్లో పి వి నరసింహారావు ముఖ్య అతితిథిగా, బెజవాడ గోపాలరెడ్డి వక్తగా, కోవెల సుప్రసన్నాచార్య నిర్వహించిన అద్భుతమైన సాహితీ కార్యక్రమం(రాజులను ఎదిరించిన పోతన ధిక్కారాన్ని తెలంగాణ గడ్డ పౌరుషంగా ఈ సభలోనే పి వి అద్భుతంగా అన్వయించి అనేక ఉదాహరణలతో విశ్లేషించారు)ఫోటో సాక్షిగా నాకు ఇష్టమైన కొన్ని పద్యాలు పాడి స్వాధ్యాయలో నన్ను నేను మరచిపోయాను. మా నాన్న అష్టావధాని, తెలుగు పండితుడు పమిడికాల్వ చెంచు సుబ్బయ్య లైబ్రరీనుండి నా లైబ్రరీకి చేరిన కొన్ని విలువైన పుస్తకాలను స్వాధ్యాయకు చేర్చడం ద్వారా ఈ యజ్ఞంలో నేను కూడా ఉడతాభక్తిగా పాలుపంచుకుంటాను.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular