Tuesday, July 21, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంవిశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం!

విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం!

వెనకటికి జంధ్యాల నాటకంలో ఒక పదవీ విరమణ పొందిన బడుగు జీవి ప్రభుత్వ కార్యాలయానికి వెళతాడు. తనకు రావాల్సిన పెన్షన్ తాలూకు ఎరియర్స్ ఎప్పుడొస్తాయని అడుగుతాడు. “ఇన్నేళ్లుగా తిరుగుతూనే ఉన్నావు నువ్వు. అడిగిన అన్ని కాగితాలు ఇచ్చావు! నువ్ బతికి ఉన్నట్లు ఇంకొక్క కాగితమిస్తే…” అంటాడు ఉద్యోగి. మనవైపు తిరిగి ఆ బడుగు జీవి- “అయ్యో నేనింకా బతికే ఉన్నానా? చావలేదా?” అంటాడు. ప్రేక్షకుల కరతాళధ్వనులతో హాలు హాలంతా మారుమోగిపోయేది.

ఇదివరకు సామాజిక సమస్యలమీద ఇలా పదునైన ప్రదర్శనలైనా కర్తవ్యాన్ని గుర్తు చేసేవి. ఇప్పుడు జగన్నాటకంలో ఎవరి నాటకం వారిది కావడంతో సమాజాన్ని పట్టి పీడించే సమస్యలు తెరమరుగై మన మొహాలే ముఖపుస్తకంలో, ఇంస్టాలో రీళ్ళు రీళ్ళుగా తిరుగుతున్నాయి.

ప్రభుత్వ విధానాల్లో కొన్ని ఇప్పటికీ జంధ్యాల నాటకంకంటే దారుణంగా ఉంటాయి. తాజాగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ- “సర్” ప్రహసనంగురించి ఎలా రాయాలో కూడా అర్థం కావడం లేదు. నేను తెలుగు, జర్నలిజం, సైకాలజీల్లో పీజీలు చేశానని, తెలుగు- సంస్కృత వ్యాకరణం చదువుకున్నానని, దాదాపు 40ఏళ్ళుగా కాలమ్స్ రాస్తున్నానని భ్రమపడుతూ ఉంటాను. నా చదువు మొన్న సర్ కాలమ్స్ ఫిల్ చేసేప్పుడు ఎందుకూ కొరగానిదయ్యింది. భాషోత్పత్తి, భాషాశాస్త్ర విద్యార్థిగా “ప్రత్యేక సమగ్ర సవరణ” మాటలో వ్యాకరణాంశాలే మొదట నన్ను చాలా ఆకర్షించాయి. సవరణకు ముందు సమగ్ర ఒక విశేషణం, ఆ సమగ్రకు ప్రత్యేక ఇంకో విశేషణం.

ఇలాంటి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం గురించి ఎప్పుడో లేపాక్షి వివేకానంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎనిమిదో క్లాసులో తెలుగు పాఠాలు చెప్పిన రామచంద్ర రావు సార్ చింత కొమ్మ చేతబట్టి ఎందుకంత గట్టిగా చెప్పారో…మొన్న ఖైరతాబాద్ గాంధీ తాతానగర్ కమ్యూనిటీ హాల్లో బి ఎల్ ఓ కు నా సర్ ఫార్మ్ ఇస్తున్నప్పుడు తెలిసింది. వ్యాకరణ సూత్రం ఇక్కడ నాకు అక్షరాలా అన్వయం అయ్యింది. భాషలో వ్యాకరణం పండితుల గొడవ. బతుకులో వ్యాకరణం సామాన్యుల గొడవ.

కర్మ కాలినప్పుడు ఆ బూడిదను మనమే భరించాలి. నుదుట తలరాతగా ధరించాలి. అప్పుడది మన బతుకుకు పూర్వపదంగా అంటే ఇంటిపేరుగా మారుతుంది. అదే విలక్షణమైన విశేషణంగా పరిణమిస్తుంది. వ్యాకరణ, లక్షణ శాస్త్రంలో పారిభాషిక పదాలు ఎక్కువగా ఉంటాయి. దాంతో సులభంగా అర్థం కాదు.

“ఉన్నది మనకు ఓటు- బతుకు తెరువుకే లోటు”- అన్నాడు ఆరుద్ర. ఆ ఓటును హక్కుగా అలాగే పొదివి పట్టుకోవడానికి ఫార్మ్స్ ఇచ్చినప్పటినుండి నాకు తెలుగు వ్యాకరణంలో ఉన్న ఎన్నెన్నో పరిభాషికపదాలు గుర్తురావడం మొదలయ్యింది. మానసిక ఆందోళన పెరిగింది. నా శ్రేయోభిలాషి, ప్రఖ్యాత మానసిక వైద్య నిపుణుడు ఇండ్ల రామసుబ్బా రెడ్డికి ఫోన్ చేసి నా వ్యాధి లక్షణాలు చెప్పాను. ఏమీ ఆలోచించకుండా వేళకు తిని…ఎక్కువసేపు పడుకుని ఉండాలని చెప్పారాయన.

మా అమ్మా, నాన్నకు 2002లో ఓటు ఎక్కడ ఉందో కనుక్కోవాల్సి వచ్చింది. వాళ్లిద్దరూ ప్రస్తుతం ఈలోకంలో లేరు. మా చెల్లెలి దగ్గర వాళ్ళ లేపాక్షి, హిందూపురం, ధర్మవరం, తిరుపతి ఓటు కార్డులు దొరికాయి. 2002నాటికి వాళ్ళెక్కడున్నారో లెక్కలు కట్టి…అందులో నుండి ఏవేవో నంబర్లు పట్టుకుని ఎలాగో నా సర్ ఫార్మ్ ఫిల్ చేయగలిగినా…ఒకటి రెండు కనుక్కోలేకపోయాను. నా భార్యమాత్రం వాళ్ళ అమ్మ 2002నాటి ఓటును పట్టుకుని ఫిల్ చేసి సబ్మిట్ చేసి…నా ఎన్నికల నిరక్షరాస్యతను, నిర్లక్ష్యాన్ని, నిరాసక్తతను బహిరంగంగానే సవాలు చేసింది. సవాలుగా తీసుకుని నేను ఒక రోజంతా కష్టపడి బీ ఎల్ ఓ ముందుకు వెళ్ళాను. అక్కడ నాలాంటి నిరక్షరాస్యులే అందరూ. “చదువురానివాడివని దిగులు చెందకు…” అన్న పాట పల్లవి, చరణాలు లీలగా బ్యాగ్రవుండ్లో పల్లవిస్తున్నట్లుగా నాకే కాక అక్కడున్న అందరికీ అనిపించిందట.

ఏమమ్మా ఇందులో మా నాన్న ఓటరు కార్డులో అసెంబ్లీ నంబరు, ఎస్ ఆర్ నంబర్, పార్ట్ నంబర్ కరెక్టేనా? అని అడిగాను. నావైపు తిరగడానికి ఆమెకు రెండు గంటలే పట్టింది. అనుమానంగా తల ఊపింది. అనుమానంగానే సబ్మిట్ చేసి వచ్చాను.

ఈలోపు ఒక ఎనభై ఏళ్ళ పెద్దామె వచ్చింది. ఇక్కడ కాదు…ఫలానా చోటుకు వెళ్లాలని చెప్పింది బీ ఎల్ ఓ. ఆ ముసలామె కళ్ళల్లో ఆ క్షణం పలికిన వేనవేల భావాలను అనువదించి రాయడానికి నా భాష చాలదు. ఇంటికొస్తే ఈలోపు మా అబ్బాయి సర్ ఫార్మ్ నింపడంలో తలమునకలుగా ఉన్నాడు.

నాకు చిన్నయసూరి బాలవ్యాకరణం నేర్పిన హిందూపురం కర్రా వెంకట సుబ్రహ్మణ్యం సార్ వ్యాకరణ పరిభాషతో ఆడుకునేవారు. నన్నిప్పుడు ఆదుకోవడానికి ఆయన లేరు. కర్మ విశేషణ పూర్వపదంగా చిన్నయసూరి కాలంలో ఉండేది…ఇప్పుడు ఉత్తరపద కర్మధారయంగా భవిష్యత్తులో కూడా వెంటపడుతూనే ఉంటుంది- అని ఆయన ముసిముసి నవ్వులు నవ్వుతూ వ్యాకరణపాఠం చెబుతూ ఎందుకన్నారో ఇప్పుడు నాకర్థమవుతోంది.

బతికి ఉన్నవాడిని బతికి ఉన్నట్లు సర్టిఫికేట్ తెచ్చుకోమని అడిగించిన జంధ్యాల విషాదంలో హాస్యాన్ని ఎందుకు పట్టుకున్నాడో తలచుకుంటూ…నేను ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ- సర్ తరువాత జాబితాలో ఓటుగా మిగిలే ఉంటానని లోతుగా ఆశపడుతూ…స్వస్తి!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular