Tuesday, June 23, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంనో మ్యాచ్ పాయింట్!

నో మ్యాచ్ పాయింట్!

మ్యారేజెస్ ఆర్ మేడిన్ హెవెన్. కాబట్టి భూమ్మీద మ్యారేజెస్ కష్టమవుతున్నాయి.  అసలే ఈ కాలం అమ్మాయిలు! చదువుల్లో టాపర్స్, ఉద్యోగాల్లో రూలర్స్. ఒకప్పుడు “వంటొచ్చా?” అని అడిగేవారు, ఇప్పుడు “ప్యాకేజీ ఎంత?” అని అడుగుతున్నారు. అమ్మాయిల సంపాదన పెరిగాక, వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ ఆకాశాన్ని తాకుతున్నాయి. “నాకు సమానంగా సంపాదించేవాడు కావాలి, లేదంటే నాకంటే ఎక్కువుండాలి” అనేసరికి… సగం మంది అబ్బాయిలు క్వాలిఫైయింగ్ రౌండ్‌లోనే అవుట్ అయిపోతున్నారు! దానికి తోడు ఈ ఫారెన్ జాబ్స్ పిచ్చి ఒకటి!

“అబ్బాయి అమెరికాలో ఉంటేనే పిల్లను ఇస్తాం” అని ఒకప్పుడు పేరెంట్స్ కండిషన్ పెడితే… ఇప్పుడు అమ్మాయిలే డైరెక్ట్ గా, “నేను ఆల్రెడీ లండన్‌లో ప్రాజెక్ట్ లీడ్‌ని, నా రేంజ్‌కి తగ్గ అబ్బాయి ఎక్కడ?” అని వెతుకుతున్నారు.

ఇలా ప్రొఫైల్స్ మ్యాచ్ చేసి చేసి, రిజెక్ట్ చేసి చేసి… క్యాలెండర్ పేజీలు తిరిగేస్తున్నాయి. చూస్తుండగానే వయసు 30…33…దాటేస్తోంది. అలా దాటినా ‘ముచ్చటైన సంబంధం’ దొరకట్లేదు సరే కదా, వీళ్ళ టేస్టులు, హాబీలు మాత్రం నెక్స్ట్ లెవెల్‌కు వెళ్ళిపోతున్నాయి. ఇక ఇద్దరి మధ్య నో మ్యాచ్ పాయింట్. అనక ఇంకేమంటారు? అబ్బాయి వైబ్ అమ్మాయికి నచ్చదు, అమ్మాయి యాటిట్యూడ్ అబ్బాయికి అర్థం కాదు.
చివరికి బ్రోకర్లు కూడా చేతులెత్తేసి, “సార్! మీ అమ్మాయికి పెళ్ళి సంబంధం వెతకడం కంటే, స్పేస్ ఎక్స్ (SpaceX) లో రాకెట్ లాంచ్ చేయడం ఈజీలా ఉంది!” అని దండం పెట్టేస్తున్నారు.

కొన్ని లైవ్ ఉదాహరణలు:-

నాకు బాగా తెలిసిన అబ్బాయి. ఇండియాలో ఇంజనీరింగ్ డిగ్రీ చదివి, బ్రిటన్లో పి జి చేసి అక్కడే వెంటనే మంచి ఉద్యోగంలో స్థిరపడ్డాడు. సాంకేతిక రంగంలో తెలివితేటలున్నవాడు. ఇంకా కూడా ఎదిగేవాడు. వాడికి సంబంధాలు చూస్తున్నప్పటి కథలు వింటే…మనుషులు ఇలా కూడా ఉంటారా? అని బాధపడాల్సి వస్తోంది.

తిరస్కారం

“మీ అబ్బాయికి మా అమ్మాయికి జాతకం కుదిరింది. సాలరీ ప్యాకేజ్ కూడా ఓకే. అయితే మా అమ్మాయి హైదరాబాద్ వదిలి రాదు. పది లక్షల ప్యాకేజ్ లో ఉంది. మీ వాడు లండన్ వదిలి…వెంటనే ఇండియా వచ్చి…మా అమ్మాయి కొంగుబట్టుకు తిరగడానికి మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా సిద్ధపడితే…మిగతా విషయాలు మాట్లాడదాం. లేదంటే లెట్ అజ్ స్టాప్ అట్ దిస్ పాయింట్”

ఇలాంటి సుహృద్భావ, గౌరవప్రదమైన, సున్నిత స్పందనకు ఎవరైనా ఎలా స్పందిస్తారో ఆ తల్లి కూడా అలాగే స్పందించి…తూరుపు తిరిగి దండం పెట్టుకుని…ఈ సంబంధం కుదరనందుకు సంతోషపడింది.

అమర్యాద

“మీ అబ్బాయి ఫోటో మా అమ్మాయికి పంపాము. ప్రస్తుతానికి మా అమ్మాయి చేస్తున్న ఉద్యోగం మానేసి లండన్ వెళితే…మీ అబ్బాయి జీతంతో బతుకుతెరువును లెక్కకడితే…అమ్మాయికి ధైర్యం చాలట్లేదు. మీ అబ్బాయే అక్కడ మానేసి…ఇక్కడ పదో పరకో సంపాదించుకుంటే…ఆలోచిస్తాము”

ఈ అమర్యాదకు ఎవరైనా ఎలా స్పందిస్తారో ఆ తల్లి కూడా అలాగే స్పందించింది.

అవమానం

ఈమధ్య మా బంధువులింటికి వెళ్ళాను ఒక పరామర్శకు. అక్కడా ఇదే చర్చ. ఆయన ప్రయివేట్ జాబ్ చేసి రిటైర్ అయ్యారు. ఆమె గృహిణి. కొడుకు- కోడలు జర్మనీలో స్థిరపడ్డారు. కూతురు బాంబేలో ఉద్యోగం. పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు.

మ్యాట్రిమోనియల్ పోర్టల్లో డీటైల్స్ చూసి…ఒక కొడుకును కన్న తల్లి ఫోన్ చేసింది. అమ్మాయి- అబ్బాయి చదువులు, జీతాలు, ఈడుజోడు అంతా ఓకే. కానీ మీరు అప్పర్ మిడిల్ క్లాస్ అని మెన్షన్ చేశారు. మేము సూపర్ రిచ్. మీ ఆయనతో మాట్లాడాక మీరు లోయర్ మిడిల్ క్లాస్ అని తేలుతోంది. కాబట్టి కుదరదు. అందులో అప్పర్ అనే మాట తీసేయండి!

ఎంత అవమానం? ఇలాంటి మాటలు వినడానికా పిల్లలను కన్నాను? అంటూ ఆ తల్లి కళ్ళల్లో నీళ్ళు తుడుచుకుంది.

పెళ్ళెందుకు దండగ?

నా మిత్రుడు ఒకాయన పడుతున్న బాధ ఇది. వాళ్ళమ్మాయి చదువుల్లో సరస్వతి. ఐ ఐ టీ లో డిగ్రీ, పి జి చేసి బెంగళూరులో పెద్ద కొలువులో ఉంది. సంవత్సరానికి 40లక్షలు సంపాదిస్తోంది. వయసు ఇప్పుడు 33. ఒకే కూతురు. ఏ లోపం లేదు. కనీసం ఇప్పటికి ఇరవై సంబంధాలను రిజెక్ట్ చేసింది. నన్ను మాట్లాడమంటే మాట్లాడాను. ఇక నా డిక్షనరీలో పెళ్ళి లేదు అంకుల్! అని నాకు జ్ఞాన బోధ చేసింది. హెచ్ ఆర్ హెడ్ కదా! బాగా మాటలు నేర్చింది. అబ్బాయిలు, వారి అలవాట్లు, వారి ప్రాధాన్యాలు, పెళ్లి సంబంధాల్లో వాళ్ళు మాట్లాడే మాటల గురించి ఆ అమ్మాయి కోణంలో చూసినప్పుడు…ఆ అమ్మాయిని తప్పుపట్టలేము.

అయ్యో…మా అబ్బాయిలకు ఏ దురలవాట్లు లేవే?

హిందూపురంలో మా బంధువు. చిన్నవయసులోనే ప్రేమించి పెళ్లి చేసుకుంది. కవల పిల్లలు. ఇద్దరూ అబ్బాయిలే. ఇంజనీరింగ్ అయిపోయి అప్పుడప్పుడు బెంగళూరులో, అప్పుడప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటారు. బాధ్యతగల పిల్లలు. ఏ దురలవాట్లు లేవు. దాంతో ఏ అమ్మాయికీ నచ్చడం లేదన్నది ఆ తల్లి పరిశీలన. ఒరేయ్ మీరుకూడా అమ్మాయిలు కోరుకుంటున్నట్లు చింపిరి చింపిరిగా, నోట్లో సిగరెట్, వీకెండ్ లో పబ్బులకు వెళ్ళండిరా! అని మా వాళ్లకు చెప్పాలని ఉంది- ఏమంటావు? అని నన్నడుగుతోంది!

సమాధానం ఏమి చెప్పాలో తెలియక ఈ నాలుగు మాటలు రాసి…చేతులు దులుపుకుంటున్నాను!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular