Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకొండ నాలుకకు మందు వేస్తే...

కొండ నాలుకకు మందు వేస్తే…

Heavy Loss: అందానికి నెత్తిన జుట్టే కీలకం కాబట్టి…బట్టతల కనిపించకుండా విగ్గయినా పెట్టుకోవాలి. లేదంటే వేలు, లక్షలు ఖర్చు పెట్టి అత్యాధునిక హెయిర్ గ్రాఫ్టింగ్ ట్రాన్స్ ప్లాంటేషన్ అయినా చేయించుకోవాలి.

బట్టతల మాయమై నెత్తిన ఒత్తుగా జుట్టు రాగానే సహజంగా ఎవరికయినా పులకింతలు మోసులెత్తుతాయి. పదే పదే అద్దంలో మొహం చూసుకోవాలనిపిస్తూ ఉంటుంది. పూట పూటకు వయసు పదేళ్లు వెనక్కు వెళుతున్నట్లు అలౌకిక కేశ పారమార్థిక ఆనంద స్థితిలో ఓలలాడుతూ ఉంటారు.

“ఊరుకున్నంత ఉత్తమం లేదు;
బోడి గుండంత సుఖం లేదు” అన్న సామెతను కొందరు ట్రూ స్పిరిట్లో తీసుకుని…బట్టతల సమస్యకు శాశ్వత గుండుతో పరిష్కారం కనుక్కున్నారు. వీరిది శాశ్వత నిజ వైరాగ్య ఆమోదయోగ్య ప్రాక్టికల్ సిద్ధాంతం.

వెంట్రుకతో సమానమయిన వెంట్రుకల మీద వ్యామోహం ఉండకూడదనే పుణ్యక్షేత్రాల్లో తల నీలాలు భక్తి భావనతో సమర్పణ చేస్తూ ఉంటాం. అహంకారానికి తల, తలలోని ఆలోచనలు కారణం. అలాంటి తల నరికి దేవుడి కాళ్లమీద పెట్టాలి. తల నరుక్కుంటే బతికి ఉండము కాబట్టి…తలమీద వెంట్రుకలను నరకడం ప్రతీకాత్మకం. ఇంతకంటే ఇంకా లోతయిన తాత్వికత కూడా గుండు కొట్టించుకోవడంలో ఉంది కానీ…ఆ విషయాలు ఇక్కడ అనవసరం.

గుండును గుండు అంటే బాధ. ఎగతాళి. అవమానించడం. ఆట పట్టించడం.

గుండె జారినా పరవాలేదు కానీ…వెంట్రుకలు రాలుతుంటే మనసు మనసులో ఉండదు. మెదడు చల్లబడి…కొయ్యబారినా పరవాలేదు కానీ…జుట్టు తెల్లబడకూడదు. వయసు ఎనభై దాటి ఏ అవయవమూ స్పందించకపోయినా పరవాలేదు కానీ…నెత్తిన జుట్టు రంగు నలుపు తగ్గకూడదు.

హైదరాబాద్ లో ఒకామెకు నెత్తిన జుట్టు ఒత్తుగా లేదు. జుట్టున్నమ్మ ఏ కొప్పయినా పెట్టవచ్చు అన్నట్లు జుట్టున్న కొప్పులను చూసినప్పుడు ఈమె బాధ బాధ కాదు. ఆమె భర్తకు కూడా ఒత్తయిన జుట్టు ఇష్టం. దాంతో ఏమయినా చేసి ఒత్తయిన జుట్టును సాధించాలని ఒక కేశ సౌందర్య సెలూన్ ను సంప్రదించింది. వారు ఆమె నెత్తిన ఉన్న కొద్దిపాటి కేశాలను కత్తిరించి ఏవో రసాయనాలు పూశారు. ఒక షాంపూ ఇచ్చి నాలుగు రోజులు తలంటుకోమన్నారు. వారు చెప్పినట్లే చేసింది. కట్ చేస్తే…ఫలితం బట్టతల ప్రత్యక్షం. తాత్కాలికంగా విగ్గు పెట్టుకుని మేనేజ్ చేసింది. ఎన్ని నెలలయినా ఒత్తయిన జుట్టు మొలవకపోగా ఉన్న నాలుగు వెంట్రుకలు ఊడిపోసాగాయి. చివరకు విషయం భర్తకు చెప్పి…నీ కళ్లల్లో ఆనందం కోసం ఇలా చేస్తే…వాళ్లు నా నెత్తిన నిప్పులు పోశారు అని గుండెలు బాదుకుంది. మనసు విరిగిన భర్త ఆమెను పుట్టింటికి తరిమేశాడు. మనసులో పుట్టెడు దుఃఖంతో ఆమె పోలీసులను ఆశ్రయించి సెలూన్ మీద చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది.

విచారించి…తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. వారు ఎంత లోతుగా విచారించినా-


1 . ఈమె నెత్తిన ఒత్తయిన జుట్టు మొలుస్తుందా?
2 . జుట్టు ఎలా ఉన్నా, జుట్టే లేకపోయినా భర్త మళ్లీ ఇంటికి పిలుస్తాడా?
3 . ఈ సెలూన్ ఇలా ఎందరి కాపురాల్లో నిప్పులు పోసిందో?
లాంటి విచారించాల్సిన విషయాలు ఎన్నో విచారణకు రాకుండా పోతాయో అన్నదే కడుంగడు విచారణీయం!

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్