Friday, September 20, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకందేవతా వస్త్రాలు

దేవతా వస్త్రాలు

Traditional:

ఇస్సా
ఇరస్వ
త్వమేవ్
తస్వ
సబ్యసాచి ముఖర్జీ
అంగసూత్ర
మనీష్ మల్హోత్రా
రీతూ కుమార్
ఆశా రావ్
అనుశ్రీ రెడ్డి
శంతను అండ్ నిఖిల్
ముగ్ధ
రాఘవేంద్ర రాథోడ్
కవితా గుత్తా
ప్రత్యూష గరిమెళ్ల

మైసూర్ పాక్ లో మైసూర్ ఉండదు. బంజారా హిల్స్ లో బంజారాలు ఉండరు. పై పేర్లలో ఎవరూ బంజారాలు కాకపోవచ్చు. ఎక్కువ భాగం ఉత్తర భారతీయ ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్లు అయి ఉండాలి. ముగ్గురో, నలుగురో తెలుగు డిజైనర్లు కూడా ఉన్నట్లున్నారు. వారు తెలుగు మాట్లాడతారో లేదో ఇదమిత్థంగా మనకు తెలియదు.

బంజారా హిల్స్ లో ఆఫీసు ఉండడం వల్ల రోజుకు కనీసం అయిదారు సార్లు ఈ బోర్డులను చూస్తూ ఉంటాను. ఇస్సా, ఇరస్వ, తస్వ, త్వమేవాహం లాంటి వేదోక్తమయిన మంత్రపూరిత బీజాక్షరాలతో ఒంటి మీద పేలికల బట్టల ప్రత్యేక డిజైనర్ వేర్ షాపులకు పేర్లు పెడుతున్న వారి అభిరుచికి మనం శిరసు వంచి నమస్కరించాలి. శరీరంలో అంగాలను సూత్రబద్దంగా కట్టి ఉంచే బట్టలకు అంగసూత్ర అన్న నామం సార్థకం. అక్కడికొచ్చే ముత్తయిదువల మెడలో మంగళసూత్రం అప్రధానం అయి…అంగసూత్ర వస్త్రమే ప్రధానమయ్యింది కాబట్టి పొయెటిక్ జస్టిస్ జరిగినట్లే ఉంది.

ఒక డ్రస్సు నలభై వేల నుండి నాలుగు లక్షల వరకు ధర పలికే ఒక షాపులోకి ఒక దుర్ముహుర్తాన వెళ్లాల్సి వచ్చింది. నాకు తెలిసిన ఒక పెద్దామె వెనుక సంతలో దారి తప్పి తల్లిదండ్రుల కోసం దిక్కులు చూసే పిల్లాడిలా నేనున్నాను. కత్తిరించి వదిలేసి హ్యాంగర్లకు వేశారో లేక అదొక డిజైనో నేను అడగలేకపోయాను. కొన్ని కుట్టకుండానే చించి కొక్కేలకు తగిలించినట్లు ఉన్నాయి. కొన్ని వేసుకుంటే తప్ప శరీరంలో అవి ఏ భాగానికి అంగ వస్త్రాలో తెలియని ఆల్జీబ్రా పజిల్ సుత్రాల్లా ఉన్నాయి.

పొరపాటున ఒక కోటును ముట్టుకున్నాను. ఆ గుండీలు ఇటలీ నుండి వచ్చాయని, ఆ దారం జెర్మనీ నుండి వచ్చిందని, ఆ కాటన్ ఇంగ్లండ్ నుండి వచ్చిందని…చెబుతూ నీ మొహానికి ఇది కావాలా అన్న అంతరార్థ ధ్వనితో…వేసుకుని చూస్తారా? అని అడిగాడు. నా ముందున్న మేడం వెనుక వచ్చానన్నట్లు సైగ చేశాను. అంతే. వాడి నోట్లో మాట లేదు. సారీ…సారీ…అని అవనత శిరస్సుతో పక్కకు పోయాడు. ఆ మేడం ఎప్పుడూ ఇలాంటి షాపుల్లో టన్నులకు టన్నులు కొంటుంటారని నాకు తెలుసు. మా ఆఫీసు రోడ్డులో షాపింగ్ కు వచ్చినప్పుడు నా క్షేమ సమాచారాన్ని కనుక్కోవడానికి నన్ను ఆ షాపులోకి ఆహ్వానించారు. అదో మర్యాద. మనం కాదనకూడదు.

ఆ అమూల్య అమేయ అదృశ్య దేవతా వస్త్ర ఖండాల గుణదోషాలు నిర్ణయించే అధికారం నాకు లేదు. ఎటొచ్చీ అన్ని డిజైనర్ వేర్లు, అన్ని నక్షత్రాల ఆసుపత్రులు బంజారా పది రోడ్డులోనే ఉండడంతో పెద్దవారి పడవంత కార్లు పెట్టడానికి రోడ్డు మీద చోటే ఉండడం లేదు. దాంతో బెంట్లీలు, రోల్స్ రాయిస్ లు, బీ ఎం డబుల్యు సెవెన్ సిరీస్ లు, బెంజ్ ఎస్ క్లాసులు నడి రోడ్డు మీద, ఎర్రటి ఎండలోనే పార్క్ చేయాల్సి వస్తోంది.

ఈ పేలిక బట్టల షాపులు కిక్కిరిసి ఉండడం వల్ల రెండు గంటలు అదనంగా ట్రాఫిక్ జామ్ అయితే అయ్యింది కానీ…కలవారి వాహనాలకు ఇదేనా మనమిచ్చే మర్యాద? వారు ఎంతగా మనసులు చంపుకుని బంజారా రోడ్ల మీద షాపింగ్ మహోత్సవాలకు వస్తున్నారో! పాపం!
దీనికి నిష్కృతి లేదా?

-పమిడికాల్వ మధుసూదన్
[email protected]

RELATED ARTICLES

Most Popular

న్యూస్