Friday, November 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంవిద్యార్థుల మృత్యు ఘోష

విద్యార్థుల మృత్యు ఘోష

Alarming:  రాజస్థాన్ కోటా పట్టణం ఐ ఐ టీ ప్రవేశ పరీక్షల కోచింగ్ పరిశ్రమకు పెట్టింది పేరు. దేశవ్యాప్తంగా మధ్యతరగతి కలలన్నీ కోటాలో ఏడురంగుల ఐ ఐ టీ ఇంద్రధనుస్సులుగా వెల్లివిరిస్తూ ఉంటాయి. పెరిగే పిల్లలు ఐ ఐ టీ ల్లో ప్రవేశించడానికి కోటా కోచింగ్ తలుపులు తీస్తుందని తలిదండ్రుల నమ్మకం. తెలిసీ తెలియని వయసులో కోటాలో ఒక కాలు పెడితే చాలు…రెండో కాలు ఐ ఐ టీ లో పెట్టడమే అని పిల్లలు అనుకుంటున్నారు. లేదా అనుకునేలా చేశారు. ఒక్కో విద్యార్థికి సంవత్సరానికి సగటున రెండు లక్షల ఖర్చు. ఏటా రెండు లక్షల మందికి పైబడి కోటాలో కోచింగ్ తీసుకుంటున్నారు. అంటే ఒక్క కోటాలో ఐ ఐ టీ ప్రవేశ పరీక్షల కోచింగ్ వ్యాపార విలువ ఏటా నలభై వేల కోట్ల రూపాయలు. దేశమంతా కలిపితే ఐ ఐ టీ కలలకు కరుగుతున్న కాసుల విలువ ఏటా అక్షరాలా లక్ష కోట్ల రూపాయల దాకా ఉంటుందని కాకిలెక్కలు కట్టారు. దాదాపు పదిహేను లక్షల మంది విద్యార్థులు పోటీ పడితే అందులో అత్యుత్తమ ర్యాంకులు వచ్చిన పదిహేను వేల మంది మాత్రమే ఐ ఐ టీ ల్లో కాలు పెడతారు.

మిగతావారు ఏమి కావాలో? కోచింగ్ పరిశ్రమ పట్టించుకోదు. ఐ ఐ టీ కల నెరవేరకపోతే ఏమి చేయాలో ప్రత్యామ్నాయం చెప్పదు. ప్రపంచంలోనే అత్యంత కష్టతరమయిన పరీక్షగా ఐ ఐ టీ ప్రవేశ పరీక్ష తయారు కావడమే లక్షల కోట్ల వ్యాపారానికి కారణమయ్యిందని ప్రభుత్వాలు గుర్తించవు. తమకు ఐ ఐ టీ ప్రవేశ పరీక్షకు వెళ్లగలిగే చదువుల స్థాయి లేదని పిల్లలు తమకు తాముగా తెలుసుకోలేరు. అక్షరం ముక్క రాకపోయినా తమ పిల్లలు బృహస్పతులకే చదువులు చెప్పగలరనే భ్రమల నుండి తల్లిదండ్రులు బయటికి రారు. వెరసి ఏటా కోటాలో కోచింగ్ కు వెళ్లిన పిల్లల ఆత్మహత్యలు పెరిగాయి. ఈ సంవత్సరం ఇప్పటికి కోటాలో కోచింగ్ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 23 కు చేరింది.

పోనీ…అంత గొప్ప ఐ ఐ టీ ల్లో చేరిన తరువాత అయినా అంతా బాగుందా అంటే అదీ లేదు. అక్కడా విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి.

రాజస్థాన్ కోటాలో కోచింగ్ పరిశ్రమ అరాచకాలు రాస్తే మహాభారతం కంటే పెద్దవి. స్వేచ్ఛగా, ఇష్టంగా, హాయిగా ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన చదువు రోజుకు 25 గంటలు నిద్రాహారాలు మాని చదవలేక చస్తోంది. రేపటి అందమయిన కలల రాజస్థాన్ కోటా ఎడారుల ఎండమావుల్లో చదువుల దాహం తీరడం లేదు. పొద్దువాలని ర్యాంకుల కోటల్లో కోట గుమ్మాలకు పిల్లల బతుకు పొద్దువాలిపోతోంది. రాలిపోయే పిల్లల పూల బతుకులకు, వాలిపోయే పిల్లల భవితలకు వర్ణాలు పులమలేక ఆకాశం రోదిస్తోంది. రాగాలు అద్దలేక గాలి గుక్కపెట్టి ఏడుస్తోంది.

మనం కన్న పిల్లలను మనమే చంపుకునే చదువుల దాహం మనది. చంపేది చదువు కాదని తెలుసుకోలేని మూర్ఖత్వం మనది. బతుకు పాఠం చెప్పని చదువులకు కేరాఫ్ అడ్రస్ రాజస్థాన్ కోటా ఒక్కటే కాదు. ఊరికొక కోటా కోట కట్టుకుని ఉంది. ప్రెజర్ కుక్కర్ చదువుల్లో కొన్ని పేలిపోవడం సహజం అని పిల్లల చావులను కూడా తేలిగ్గా తీసుకునేంతగా మన మహోన్నత విద్యా ప్రమాణాలు రూపుదిద్దుకున్నందుకు సామూహికంగా తలలు వంచుకుని సిగ్గుపడదాం.

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్