Wednesday, November 27, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపెనుగొండలక్ష్మి-7

పెనుగొండలక్ష్మి-7

నలువైపులా విస్తరించిన పెనుగొండ బయళ్లలో చెడి బతికి ఉన్న చిహ్నమొకటి(రామబురుజు)…ఆత్మ శరీరాన్ని విడిచిన తరువాత మిగిలిన ఎముకల గూడులా నిలిచి ఉంది.

సింహం పిల్ల జూలు విదిలించి వనాన్ని ఒక్కసారి తేరిపార చూసినట్లు…ఈ రామబురుజు శత్రువులమీద ఒక కన్నేసి చూస్తోంది.

కొండచిలువలా ఇప్పుడిది తనకు తానే బరువై కదల్లేక ఇలా పడి ఉండవచ్చు. ఒకనాడు రామబురుజు కన్నెర్ర చేసి వేడి నిప్పులు చిమ్మితే…ఎంతటి శత్రువైనా మాడి…మసి కావాల్సిందే.

కొండగాలుల తాకిడికి ఈ రామబురుజు గుండెలో ఏదో రోదన మొదలవుతోంది. తన గతాన్ని తలచుకుని…రోదిస్తుంటే ఆ గాలులు ఓదారుస్తున్నాయేమో! తన ఉన్నతిని, దుర్గతిని తలచుకుంటూ నిర్వికల్ప సమాధిలో ఉందేమో!

అగ్నిపర్వతం లోపల లావాలా…ఈ రామబురుజు లోలోపల ఎంతగా రగిలిపోతోందో!

కన్నెత్తి చూడాలంటే వణుకు పుట్టే రోజులు పోయి…తలవాల్చిన బురుజుల ఆత్మాభిమానం తట్టిలేపేవారు లేని రోజులొచ్చాయి.

రామరాయల పాదముద్రలతో పులకించిన బురుజు…ఇప్పుడు గబ్బిలాలకు నెలవయ్యిందని ఏడుస్తుంటే…ఓదార్చేవారే లేరు.

చేవ కలిగిన్నన్నాళ్లు తనను తాను కాపాడుకున్న బురుజు…ముసలి ముప్పున ఒక మూలన పడి ఉన్నట్లుంది.

కాలపురుషుడి ఎన్ని సమ్మెట పోట్లకు తట్టుకుని ఈ బురుజు నిలబడిందో! చివరికి వాడిన పువ్వు నుండి ఒక్కొక్క రేకు రాలిపోయినట్లు ఎన్నెన్ని విభవాలు బురుజు నుండి రాలి పడిపోయాయో!

కొండ అద్దంలో కొంచెమై కనిపించినట్లు…ఈ బురుజు అద్దంలో పెనుకొండ కొండ చరిత కొంచెమైనా కనిపిస్తుంది.

కన్నులు మూసుకుని తపస్సు చేసుకునే యోగిలా ఈ బురుజు కాలాతీతంగా నిలిచి మౌనధ్యానంలో ఉంది.

జీర్ణమైన ఈ బురుజు హృదయతంత్రిని సవరించి…శ్రుతి చేసి పాడేవాడొకడైనా రాకపోతాడా? అని పెనుగొండ ఆశగా, ఆర్తిగా ఎదురుచూస్తోంది. కాలం కడుపు పండిన ఈ పులకిత శతాబ్దాల పెనుగొండ వైభవం తెలుగు తల్లికి మరపురాని రోజులు.

రేపు – పెనుగొండలక్ష్మి-8
“పెనుగొండ ఆలయాలు”

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్