Friday, November 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంచండీగఢ్ ఎన్నిక పాఠం

చండీగఢ్ ఎన్నిక పాఠం

సునిశితమయిన హాస్యంతో గుండెలు మెలిపెట్టే విషయాలను చెప్పడంలో చెయి తిరిగిన రచయిత జి ఆర్ మహర్షి దాదాపు దశాబ్దం క్రితం ప్రజాస్వామ్యంలో ఎన్నికల విచిత్రాల మీద ఒక వ్యంగ్య వ్యాఖ్య రాశారు. అందులో- సాధారణ ఎన్నికల ప్రచారం హోరెత్తుతూ ఉంటుంది. సభలు, ర్యాలీలు, మైకులు, నినాదాలు, పొగడ్తలు, తిట్లతో ఊరూ వాడా ఊగిపోతూ ఉంది. ఒక ఊరి పక్కన అడవిలో జంతువులకు ఈ ఎన్నికల హడావుడి అంతా విచిత్రంగా అనిపిస్తుంది. ఏమిటిదంతా అని ఆరా తీస్తాయి. ప్రజాస్వామ్య విధానంలో ఎన్నికలు కీలకం అని తెలిసి అడవిలో “ఆటవిక పాలన” అన్న నింద తొలగించుకోవాలంటే ఎన్నికలకు వెళ్లడమే ఉత్తమం అని జంతువులన్నీ అంగీకారానికి వస్తాయి.

సింహం మొదలు చీమ దాకా దేన్నీ వదలకుండా ఓటరు నమోదు జరుగుతుంది. గుంట నక్క రిటర్నింగ్ అధికారిగా ఒకానొక శుభ ముహూర్తాన పోలింగ్ జరుగుతుంది. ఏనుగు నుండి పిపీలికం దాకా అన్నీ క్యూలో నిలుచుని ఓట్లు వేశాయి. నిర్ణయించిన ముహూర్తానికి పోలింగ్ ఫలితాలు ప్రకటించడమే ఇక తరువాయి.

విప్పిన బ్యాలెట్ బాక్సులతో పాటు అన్నీ కలిసి సింహం గుహ దగ్గరికి వెళతాయి. సరిగ్గా అదే సమయానికి సింహం నిద్రపోతూ ఉంటుంది. నిద్ర పూర్తయి నెమ్మదిగా సింహం కళ్లు తెరిచి…ఏమిటి మొత్తం అంతా కట్టకట్టుకుని వచ్చారు? అని అడుగుతుంది. ఏమీ లేదు మహారాజా! మొన్న పోలింగ్ జరిగింది కదా? మీరు అనుమతిస్తే ఫలితాలు ప్రకటిస్తాం…అని భయ భక్తులతో తగ్గు స్వరంతో మనవి చేసుకున్నాయి. అలాగే ప్రకటించండి…ఎలాగూ అడవికి నేనే కదా రాజును? అని సింహం ఆవులిస్తూ చెప్పింది.

“సింహం ఆవులించి నిద్ర లేచింది…ప్రజాస్వామ్యం పలాయనం చిత్తగించింది” అని ముగించారు జి ఆర్ మహర్షి.

ఇందులో అంతరార్థం ఏమిటో వివరించాల్సిన పనిలేదు. అర్థం చేసుకున్నవారికి చేసుకున్నంత.

ఈ కథ కల్పితం, జరగలేదు అనుకుని కొట్టిపారేయకండి. తేలిగ్గా తీసుకోకండి. తాజాగా చండీగఢ్ మేయర్ ఎన్నికల ఫలితాల ప్రకటన- సింహం గుహ దగ్గర ఫలితాల ప్రకటన సేమ్ టు సేమ్. షేమ్ టు షేమ్!

రెండు పార్టీల కూటమికి మేయర్ స్థానం గెలిచే బలం ఉండి ఉండవచ్చు. ఇప్పుడు ఆ స్థానాన్ని దక్కించుకున్న పార్టీకి గెలిచే సంఖ్యాబలం ఉండి ఉండకపోవచ్చు. కానీ…సింహం ఆవులించి నిద్ర లేచినప్పుడు…ఎంతటి బలమైన ప్రజాస్వామ్యమైనా ప్రాప్తకాలజ్ఞతతో పలాయనం చిత్తగించాల్సిందే కదా!

ప్రజాస్వామ్యం అంటే పట్టపగలు అందరూ చూస్తుండగా అత్యంత పారదర్శకంగా రిటర్నింగ్ అధికారి కొన్ని ఓట్లను పెన్నుతో రుద్ది…రద్దు చేయడమే కదా!

భవిష్యత్ ఎన్నికల్లో సింహాల ఏకపక్ష విజయాలకు చండీగఢ్ ఓట్ల దిద్దిబాటు, సర్దుబాటు, రద్దుబాట్లు కాంతివంతమైన, సులభంగా ఆచరించగల ఆదర్శాలు కాగలవు. చక్కటి పాఠాలు కాగలవు.

ఏయ్!
ఎవర్రా అక్కడ?
“ప్రజాస్వామ్యమంత అరాచకమైనది మరొకటి లేదు; ప్రజాస్వామ్యానికి మించిన ప్రత్యామ్నాయం లేదు”
అన్న వాడిని పట్టుకుని…చండీగఢ్ రిటర్నింగ్ అధికారి ముందు తక్షణం ప్రవేశపెట్టండి!

“ఉన్నది మనకు ఓటు-
బతుకుదెరువుకే లోటు…
గాంధి పుట్టిన దేశమా ఇది?
నెహ్రు కోరిన సంఘమా ఇది?
సామ్యవాదం, రామరాజ్యం సంభవించే కాలమా ఇది?”

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్