Friday, September 20, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఇక టోల్ గేట్లు మాయం

ఇక టోల్ గేట్లు మాయం

జీవితం ఒక గమ్యంలేని పయనం. అంతం లేని ఈ భూమి అంతా ఒక పురాతన రహదారి. ఆ రహదారికి పొద్దున; సాయంత్రం రెండే రెండు ద్వారాలు. ఒక ద్వారం గుండా రావాలి. మరో ద్వారం ద్వారా వెళ్ళిపోవాలి. దారి మధ్యలో ఉండాలన్నా జీవితం ఉండనివ్వదు. ఉండిపోవాలనుకోవడం సృష్టి ధర్మానికి వ్యతిరేకం.

ఆ పురాతన రహదారే ఆధునిక యుగంలో జాతీయ రహదారి అయ్యింది. ఈ ఆధునిక రహదారిలో ప్రతి అరవై కిలోమీటర్లకు మన పాపపుణ్యాలను మనకు శాస్త్రీయంగా గుర్తు చేసేవే టోల్ గేట్లు. అందులో మన సంచిత పాప ఫలానికి అంటే అక్యుములేటెడ్ పాపానికి ప్రతిరూపంగా రూపొందినదే ఫాస్ట్ ట్యాగ్.

చిన్నయసూరి రాసిన వ్యాకరణానికి బాల వ్యాకరణం అని పేరు పెట్టాడు. నిజానికి ఇప్పుడది వృద్ధులకు కూడా జీర్ణం కాని మహా ప్రౌఢ వ్యాకరణం. అందులో సమాస పరిచ్చేదం ఒక భాగం. రెండు పదాలు ఒకటిగా ఏర్పడ్డం సమాసం. ఫాస్ట్ ట్యాగ్ రెండూ ఇంగ్లీషు పదాలే అయినా అందులో సమాసం లేకుండా పోదు.

ఫాస్ట్ గా వెళ్ళడానికి ట్యాగ్;
ఫాస్ట్ గా పంపే ట్యాగ్;
ఫాస్ట్ గా వెళ్లే ట్యాగ్;
ఫాస్ట్ గా వెళ్లడానికి అనువయిన ట్యాగ్;
ఫాస్ట్ గా వెళ్లడానికి అనుమతించే ట్యాగ్;
ఫాస్ట్ గా వెళ్లే వాహనానికి ట్యాగ్…ఇలా ఏ సమాసం కిందికి వస్తుందో వ్యాకరణవేత్తలు నిగ్గు తేల్చుకోలేకపోతున్నారు.

వేదం అందరూ చదవలేక, చదివినా అర్థం కాక, అర్థమయినా ఆచరించలేక వేదాంతాన్ని ఆశ్రయిస్తారు. తెలిసేట్టు చెప్పేది సిద్ధాంతం. తెలియకుండా చెప్పేది లేదా తెలియకుండా చేసేది వేదాంతం. ఇక్కడే ఫాస్ట్ ట్యాగ్ కు- వేదాంతానికి పొత్తు చక్కగా కుదురుతుంది.

టోల్ గేట్లు ఎందుకు? ఎన్ని యుగాలపాటు టోలు గేట్లలో మన తోలు ప్రయివేటువాడు వొలుచుకోవడానికి అధికారముంటుంది? అన్నవి అర్థరహితమయిన ప్రశ్నలు. సనాతన ధర్మంలో ఎన్నో జన్మల పాప పుణ్యాలు క్యారీ అవుతూనే ఉంటాయి. జన్మ రాహిత్యమే మోక్షం. కాబట్టి కొన్ని కోట్ల జన్మల్లో పేరుకుపోయిన మన పాపం పటాపంచలు కావాలంటే టోలు గేట్లగుండా మనం వీలయినంత ఎక్కువ ప్రయాణిస్తూనే ఉండాలి. దాంతో యమ స్పీడ్ గా పాప క్షయం అవుతుంది.

ఇదివరకు టోల్ గేట్లలో మనుషులు కూర్చుని డబ్బు తీసుకుని, ఇనుప రాడ్ పైకెత్తి వాహనాలను పంపే పద్ధతివల్ల పాపక్షయం స్లోగా ఉండేది. దాంతో జాతి విశాల పాపక్షయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఫాస్ట్ ట్యాగ్ పద్ధతి వచ్చింది. ఇది మన పురాకృత జన్మల పుణ్య విశేష ఫలం.

ఫాస్ట్ ట్యాగ్ ముందే కొని మెడలో బిళ్లలా వాహనం ముందు అద్దానికి అతికించుకోకపోతే- టోల్ గేట్లలో రెండింతల జరిమానాకు దయగల చట్టం అనుమతిస్తోంది.

ఫాస్ట్ ట్యాగ్ వల్ల కూడా మన పాప క్షయం అనుకున్నంత వేగంగా జరగడం లేదని భావిస్తున్న దయగల కేంద్ర ప్రభుత్వం టోల్ గేట్లే అవసరం లేని జి పి ఎస్ ఆధారిత ఫాస్ట్ ట్యాగ్ వసూళ్లను మొదలుబెట్టబోతోంది. దాంతో టోల్ గేట్లు మాయం. టోల్ వసూళ్లలో వేగం. ఒకే దెబ్బకు అనేక పిట్టలు.

శంకరాచార్యులు అన్నపూర్ణ స్తోత్రంలో చివర ఫల శ్రుతిలో ఒక మాటన్నాడు.

“జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీ చ పార్వతీ!”

జ్ఞాన వైరాగ్యాలు భిక్షగా పెట్టు తల్లీ! అని అన్నపూర్ణాదేవి కాళ్లా వేళ్లా పడాలట మనం.

“దీపించు వైరాగ్య దివ్యసౌఖ్యం బియ్య-
నోపకకదా నన్ను నొడఁబరుపుచు
పైపైనె సంసార బంధములఁ గట్టేవు
నాపలుకు చెల్లునా? నారాయణా!”

అని యావత్ తెలుగు సాహిత్య చరిత్రలోనే ఇంకెవ్వరూ అనని మాటను ప్రయోగించాడు అన్నమయ్య. వెలుగులతో దీపించే దివ్య సుఖమట-ఆ వైరాగ్యం. పైగా ఆ వైరాగ్య సుఖం దేవుడే ఇవ్వాలట. భక్తి కర్మయోగంతో మొదలై…జ్ఞాన యోగంగా మారినప్పుడు ఈ వైరాగ్యయోగం అర్థమవుతుందంటారు. అనుభవంలోకి వస్తుందంటారు.

ఫాస్ట్ ట్యాగ్ ఉద్దేశం అదే. జ్ఞానానికి జ్ఞానం. వైరాగ్యానికి వైరాగ్యం. వేదాంతానికి వేదాంతం. వేగానికి వేగం. ఖర్చుకు ఖర్చు. పాపక్షయానికి పాపక్షయం.

“రోడ్లు అభివృద్ధికి సూచికలు.”
మన రోడ్లు బాగుండాలంటే మన చర్మం మనమే వలిచి, మనమే వాటిని రోడ్లకు ఒక మెత్తటి లేయర్ గా వేసి, సుఖమయిన ప్రయాణానికి మనకు మనమే అర్పణ కావాలి. హారతి కర్పూరం కావాలి.

అన్నట్లు-
ఫాస్ట్ ట్యాగ్ ల ద్వారా కేంద్ర ప్రభుత్వానికి గడచిన సంవత్సరం వచ్చిన ఆదాయం అక్షరాలా 51 వేల కోట్ల రూపాయలు. అంటే అర లక్ష కోట్లు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే దాదాపు 50 శాతం పెంపు. వచ్చే ఏడాదికి ఇది లక్ష కోట్లు అయినా కావచ్చు. సున్నాలదేముంది? ఒకదశ దాటిన తరువాత ఎన్ని సున్నాలయినా గోడక్కొట్టిన సున్నాలే!

(పాత కథే. టోల్ గేట్ల కథనంలో మార్పు ఉండదు. కొన్ని అంకెలు కొత్తగా తోడయ్యాయి- అంతే)

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

RELATED ARTICLES

Most Popular

న్యూస్