Thursday, September 19, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంప్రమాణస్వీకారోత్సవంలో పదనిస

ప్రమాణస్వీకారోత్సవంలో పదనిస

కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం భారతీయ సాహిత్యంలో అత్యుత్తమమైన రచన. దుశ్యంతుడు కణ్వుడి ఆశ్రమానికి వెళ్లేసరికి అక్కడ జంతువులు జాతి వైరం మరచి…పాము- ముంగీస వన్ బై టు చాయ్ పంచుకుని ఒకే సాసర్ లో తాగుతూ ఉంటాయి. గద్ద- పాము తీరిగ్గా కూర్చుని చదరంగం ఆడుకుంటూ ఉంటాయి. పిల్లి- ఎలుక తీరుబడిగా పిట్టకథలు చెప్పుకుంటూ ఉంటాయి. పులి- జింక పక్కపక్కన కూర్చుని ఒకే సండే మ్యాగజైన్లో పదకేళి పూరిస్తూ ఉంటాయి. సింహం- ఏనుగు కలిసి ఒకే కంచంలో పప్పన్నం తింటూ ఉంటాయి.

చిన్నప్పటినుండి పులులు, సింహాలను వేటాడి వాటిని మచ్చిక చేసుకోవడంలో ఆరితేరిన దుశ్యంతుడికి జంతు స్వభావాల మీద చాలా అవగాహన ఉంది. కానీ ఇలా పరస్పర జాతివైరం మాని…ఏనుగుకు సింహస్వప్నమైన సింహం తలదువ్వడం; పులి చంపిన జంతువుల ఎంగిలి మాంసం తినడం తప్ప గోతికాడ నక్కలు ఇలా అరిటాకులో అటుకులన్నం తినడం; పాములకు గద్దలు పాలు పట్టడం దుశ్యంతుడు ఏనాడూ చూడలేదు.

శకుంతల కుండల్లో నీళ్లు తెచ్చి పూల చెట్ల పాదుల్లో పోస్తుంటే…ఆమె వెంట చిలుకలు, కోయిలలు వచ్చి ఏ చెట్టుకు ఎన్ని కుండల నీళ్లు పోయాలో చెప్పేవి. అందుకే ఆమె కణ్వుడి ఆశ్రమం వదిలి వెళ్లిపోతుంటే…సింహాలు, పులులు, ఏనుగులు, జింకలు, నెమళ్లు, కుందేళ్లు, పక్షులు అన్నీ తీరం దాకా వెంట వచ్చి…వెక్కి వెక్కి ఏడుస్తూ…వీడ్కోలు పలికాయి.

అరుణాచలంలో రమణ మహర్షి ఆశ్రమంలో కూడా ఇలాగే జంతువులు జాతి వైరం మరచి…పరస్పర అనురాగంతో మెలిగేవట.

కాళిదాసు రెండున్నరవేల ఏళ్ల కిందటివాడు. ఆయన రాసిన అభిజ్ఞాన శాకుంతలం ఇంకా ఇంకా పాతది. రమణ మహర్షి ఆశ్రమంలో సన్నివేశాలు కూడా నిన్నటి తరానివి. విన్నవారే తప్ప చూసినవారు లేరు.

అలాంటి సన్నివేశాలు పురాణాల్లో, కాల్పనిక సాహిత్యంలోనే చూడగలం అనుకునేవారి కనులపంటగా మొన్న మోడీ మూడోసారి ప్రమాణస్వీకారోత్సవం వేళ రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో ప్రత్యక్ష ప్రసారం సాక్షిగా ఒక జంతువు తాపీగా వేదిక వెనుక పచార్లు చేస్తోంది.

కొందరు దాన్ని పులి అన్నారు. కొందరు పెంపుడు పిల్లి అన్నారు. కొందరు హిమాలయం కొండ ప్రాంతాల్లో తిరిగే జంతువు అన్నారు. వామ్మో! అదేదో పులిలా ఉంది. పక్కనే రాష్ట్రపతి. కొలువుదీరనున్న కొత్త మంత్రివర్గం సభ్యులు. ముందు వరుసలో వివిధ దేశాధినేతలు. అతిరథ మహారథులు. “అది అలా వేదిక వెనుకకు వెళ్లిపోయింది కాబట్టి సరిపోయింది. రెండు మెట్లు దిగి…ఇలా ముందుకు వచ్చి ఉంటే!” అని జాతి యావత్తు గుండెలు బాదుకుంటోంది.

కేంద్రప్రభుత్వ ఆధీనంలోనే ఉండే ఢిల్లీ పోలీసులకు ఈ వార్తలతో వెన్నులో వణుకు పుట్టింది. అనేక మంది నిపుణులతో అనేక బృందాలు తక్షణం విచారణ చేసి…చేసి…అది క్రూర మృగం కాదని…ఇళ్లల్లో తిరిగే సాధారణ పిల్లి అని తేల్చారు.

కానీ…అది సాధారణ పిల్లిలా లేదని…పులిలా ఉందని మీడియాలో కొందరి అనుమానం.

అది పులే అయితే- ముందున్న రాజకీయ సింహాలముందు తోక జాడించలేక…పిల్లిలా కళ్ళుమూసుకుని వెళ్లిపోయి ఉండాలి.

అది పిల్లే అయితే…పెళ్లికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకుని ఎందుకు వెళ్లడం అనుకుని…తన మానాన తను వెళ్లిపోయి ఉండాలి.

అసురసంధ్యవేళ వేదిక వెనుక కుడి నుండి ఎడమకు పిల్లి నడిచి వెళితే మార్జాల శకున శాస్త్రం ఏమి చెబుతోందో! వివరిస్తూ శకునం చెప్పే బల్లులు కుడితిలో పడ్డట్టు ఇంకా టీ వీ ఛానెళ్లలో సాయం సంధ్యా డిబేట్లు మొదలు కాలేదా?

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్