‘యూరప్ లో చదువుతున్న మీ అబ్బాయి రేప్ కేసులో ఇరుక్కున్నాడు. బయటపడటం చాలా కష్టం’- ఉదయాన్నే వచ్చిన ఈ ఫోన్ తో ముందు భయపడ్డాడా తండ్రి. అవతలి వాళ్ళు తాము ముంబై పోలీసులమని అర్జెంటు గా యాభై వేలు పంపితే ఏం చేయాలో చెప్తామనడంతో అనుమానం వచ్చింది. వాళ్ళతో మాట్లాడుతూనే భార్యకి సైగ చేశాడు కొడుక్కి ఫోన్ చెయ్యమని. వెంటనే ఆమె పక్క రూమ్ లోకి వెళ్లి కొడుక్కి ఫోన్ చేసి అంతా అబద్ధమని తేల్చుకుంది. భర్తకి ఆ విషయం చెప్పగానే ఫోన్లో మాట్లాడుతున్న వాళ్ళతో గట్టిగా బెదిరించాడు. అంతే, కాల్ కట్. – ఇటీవల హైదరాబాద్ లో జరిగిన సంఘటన. ఇక్కడ కొంచెం బుర్ర ఉపయోగించారు కాబట్టి బయట పడ్డారు గానీ నిత్యం ఎంతమంది ఇలా మోసపోతున్నారో వార్తాపత్రికల్లో , టీవీ ల్లో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా రిటైర్ అయిన వారు, పిల్లలు విదేశాల్లో ఉండి ఒంటరిగా నివసిస్తున్న వారు ఎక్కువగా మోసపోతున్నారు. ఇంకొంతమందికి పార్సెల్ కస్టమ్స్ లో ఉందని డబ్బు పంపమంటున్నారు. ఆ మధ్య ఒకాయన ఇలాగే మోసపోయి డబ్బు ఇచ్చి వెంటనే పోలీసులకు చెప్పడంతో డబ్బు నేరగాళ్లకు చేరకుండా చేయగలిగారు. అయినా ఇంకా రోజూ అనేకులు ఈ మోసగాళ్ల బారిన పడుతున్నారు. రోజురోజుకూ విస్తరిస్తున్న మోసాలు ఎన్ని రకాలుగా ఉన్నాయో చూద్దాం.
- మీ బ్యాంకు అకౌంట్ హ్యాక్ అయింది. వివరాలకోసం ఈ లింక్ క్లిక్ చెయ్యండి
- మీకు పార్సెల్ వచ్చింది. డెలీవరీ చెయ్యాలంటే లింక్ క్లిక్ చెయ్యండి
- మీ ఫోన్ కె వై సి వివరాలు సబ్మిట్ చెయ్యడానికి లింక్
- మీకు విదేశాల నుంచి పార్సెల్ వచ్చింది. కస్టమ్స్ క్లియరెన్స్ కోసం లింక్
- మీ పిల్లలు డ్రగ్స్ కేసులో అరెస్టయ్యారు. వారి గురించి సిబిఐ ఆఫీసర్ తో వీడియో కాల్
- మీ ట్రేడింగ్ అకౌంట్ లో సమస్య ఉంది. పరిష్కారానికి లింక్ చూడండి
- మీ లావాదేవీల పాయింట్లు మూలుగుతున్నాయి. క్లెయిమ్ చేసుకోడానికి లింక్
- మీకు ఇన్ కమ్ టాక్స్ నుంచి కొంత రిఫండ్ వచ్చింది. కింది లింక్ క్లిక్ చేసి చూడండి
ఇలా ఒకటా రెండా? ఒక మోసం తెలిసిందనుకునే లోపే మరో మోసం చేయడానికి రెడీగా ఉంటున్నారు
మాయగాళ్లు.
అక్కడికీ పోలీసులు, సైబర్ నిపుణులు ఫిర్యాదు రాగానే కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు కానీ నేరగాళ్లు మరింత తెలివి మీరుతున్నారు. చివరకు ఈ చలాన్ కూడా డూప్లికేట్ లింక్ పంపిస్తున్నారంటే ఎంతగా మోసాలు మరిగారో అర్థమవుతుంది. ఇప్పుడు ఇంట్లో ప్రతివారూ ఈ మోసాల గురించి తెలుసుకోవాలి. మాట్లాడుకోవాలి. ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి. వచ్చిన ప్రతి లింక్ క్లిక్ చెయ్యకూడదు. బ్యాంకులు కూడా వినియోగదారుల రక్షణకు చర్యలు తీసుకోవాలి. తీసుకోవలసిన జాగత్తలు అన్ని ప్రసార మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావాలి. అప్పుడే కొంతయినా అడ్డుకట్ట వెయ్యగలుగుతాం.