ఎల్. బి. శ్రీరామ్ గారికి,
నమస్సులు. మీరు నిర్మించి, నటించిన “కవిసమ్రాట్ విశ్వనాథ”ను యూట్యూబ్ లో చూశాక స్పందనగా ఈ నాలుగు మాటలు.
“అల నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగ మస్మాదృశుం
డలఘుస్వాదు రసావతార ధిషణాహంకార సంభారదో
హల బ్రాహ్మీమయమూర్తి శిష్యుఁ డైనా డన్నట్టి దావ్యోమపే
శలచాంద్రీ మృదుకీర్తి చెళ్ళపిళవంశస్వామి కున్నట్లుగన్”
నిజమే.
విశ్వనాథలాంటి శిష్యుడిని పొందగలిగే భాగ్యం చెళ్ళపిళ్ళవారికి దక్కింది కానీ…నన్నయ్య, తిక్కనలకు దక్కిందా?
“ఋషివంటి నన్నయ్య రెండవ వాల్మీకి
తిక్కన్న శిల్పపుఁ దెనుఁగుతోట
యెఱ్ఱన్న సర్వమార్గేచ్ఛావిధాతృండు
పోతన్న తెలుఁగుల పుణ్య పేటి
శ్రీనాధుఁడు రసప్రసిధ్ధ ధారాధుని
కృష్ణరాయఁ డనన్య కృతిప్రబంధ
పెద్దన్న వడపోత పెట్టి నిక్షురసంబు
రామకృష్ణుఁడు సురారామగజము
ఒకఁడు నాచనసోమన్న, యుక్కివుండు
చెఱిపి పదిసార్లు తిరుగ వ్రాసినను మొక్క
వోని యీ యాంధ్రకవిలోకమూర్ధమణుల
మద్గురుస్థానములుగ నమస్కరించి”
నిజమే.
నన్నయ్య మనకు రెండో వాల్మీకి. తెలుగు శిల్పానికి తిక్కన తోట. ఎర్రన కొత్త పంథా తొక్కినవాడు. తెలుగువారి కోటిజన్మల పుణ్యంకొద్దీ పుట్టినవాడు పోతన. శ్రీనాథుడు కవిత్వ రసధార. కృష్ణదేవరాయలు, పెద్దన, రామలింగడు, నాచన సోమన మహామహులు.
“ఈ సంసార మిదెన్ని జన్మలకు నేనీ మౌని వాల్మీకి భా
షాసంక్రాంతఋణంబుఁ దీర్పఁగలదా ! సత్కావ్యనిర్మాణరే
ఖాసామాగ్రి ఋణంబుఁ దీర్పఁగలదా ? కాకుత్థ్సుఁ డౌ స్వామి గా
థాసంపన్నము భక్తిఁదీర్చినను ద్వైతా ద్వైతమార్గంబులన్
ఒక్క వాల్మీకి కాక వేఱొక్కఁ డెవఁడు
సుకవిశబ్దవాచ్యుం డిఁక గుకవినింద
యప్రశస్తపథంబుగా నవుటఁ జేసి
మునిఋణముఁ దీర్ప నీ కావ్యమును రచింతు”
నిజమే.
ఎన్ని జన్మలెత్తినా మహర్షి వాల్మీకి రుణం తీర్చుకోగలమా? ఒక్క వాల్మీకిని తప్ప సుకవి అనడానికి ఇంకొకరికి అర్హత ఉందా? ఆ ముని రుణం తీర్చుకోవడానికే విశ్వనాథవారు రామాయణ కల్పవృక్షం రాశారు.
“మరలనిదేల రామాయణంబన్నచో
నీప్రపంచక మెల్లనెల్ల వేళ
దినుచున్న యన్నమే దినుచున్న దిన్నాళ్ళు
తనరుచి బ్రతుకులు తనవిగాన
చేసిన సంసారమే సేయుచున్నది
తనదైన యనుభూతి తనదిగాన
తలచిన రామునే తలచెద నేనును
నాభక్తి రచనలు నావిగాన
వ్రాసిన రామచంద్రు కథ వ్రాసితివీవనిపించుకో వృథా
యాసముగాక కట్టుకతలైహికమా! పరమా యటంచు దా
జేసిన తండ్రియాజ్ఞయును జీవునివేదన రెండు నేకమై
నాసకలోహ వైభవ సనాథము నాథకథన్ రచించెదన్”
నిజమే.
తెలుగు వాల్మీకి మన విశ్వనాథ సత్యనారాయణ. రామాయణ కల్ప వృక్షం ఆయన మనకిచ్చిన అనన్యసామాన్యమయిన గ్రంథం. ఇంతమంది ఇన్ని యుగాలుగా ఇన్ని రామాయణాలు రాస్తున్నారు కదా? మళ్లీ రామాయణమే ఎందుకు రాస్తున్నానంటే? అని ఆయనకు ఆయనే ప్రశ్న వేసుకుని…ఆయనే తిరుగులేని సమాధానం కూడా చెప్పుకున్నారు.
ఈ లోకం రోజూ తింటున్న అన్నమే తింటోంది. చేస్తున్న సంసారమే చేస్తోంది. తన రుచి తనది. అలా నాదయిన భక్తి రచన నాది కాబట్టి తలచిన రాముడినే తలచుకుంటాను…రాస్తే రాముడి కథ రాసి నిలబడు…పాడు కట్టు కథలు దేనికి? అని మా నాన్న చెప్పిన మాట; నాలో జీవుడి వేదన రెండూ కలగలిసి రాముడినే స్మరిస్తున్నాను…అని రామాయణం తెలుగుసేత మొదలుపెట్టారు విశ్వనాథ.
తెలుగు సాహితీ సరస్వతిని తొలిసారి జ్ఞానపీఠం మీద కూర్చోబెట్టిన అంతటి విశ్వనాథ సత్యనారాయణ ఎవరో, ఆ మహానుభావుడు ఒక జీవితకాలంలో ఎన్ని చదివాడో, ఎన్నెన్ని ప్రక్రియల్లో ఎన్నెన్ని కావ్యాలు రాశాడో ఇప్పటి తరానికి తెలియదు. తెలుసుకోవాలన్న ఉత్సాహమూ లేదు.
పంక్తిలో చివర రెండు ప్రాసాక్షరాలు పేర్చగలిగిన ప్రతివాడూ కాళిదాసుకే కవిత్వ పాఠాలు చెప్పగలిగే ఈరోజుల్లో;
పూర్వకవుల ప్రఖ్యాత కవిత్వాలను కాపీకొట్టి సాహిత్య అవార్డులను కొల్లగొట్టగల కవిత్వ చోరాగ్రేసరులు చెలరేగే ఈరోజుల్లో;
ప్రభుత్వ అవార్డులను రాబట్టే పట్టుపరిశ్రమ విద్యల్లో ఆరితేరిన కవిసింహాలు జూలు విదిల్చి తిరిగే ఈరోజుల్లో;
సినిమా సాహిత్య సంప్రోక్షణ జరిగేతేనే అన్నమయ్యకైనా ఆస్కార్ అవార్డు లభించే ఈరోజుల్లో-
విశ్వనాథ అనేవాడొకడు ఉండేవాడు అని లోకానికి చెప్పడం కోసం మీరు పడ్డ శ్రమ తక్కువది కాదు.
ప్రభుత్వ చట్టాలను తుంగలో తొక్కి ఎర్రచందనం దుంగలను దొంగిలించే కథలు పుష్పించి…ఫలించి…కాసుల వర్షం కురిపించే ఆధునిక అభిరుచుల కాలంలో విశ్వనాథ సాహితీ విశ్వరూపాన్ని లోకానికి పరిచయం చేయాలనుకోవడమే పెద్ద సాహసం. మీ శక్తికి మించిన ప్రయత్నం. తెలుగువారికి పట్టని ఇలాంటి కథలకు తెలుగు నిర్మాతలెవరూ ముందుకురారు కాబట్టి మీరే నిర్మాతగా ముందుకొచ్చి చేతులు కాల్చుకున్నందుకు మీకు చేతులు జోడించి నమస్కారం పెడుతున్నాను.
అందులో ఒక పాత్ర టి ఎన్ ఆర్ కరోనాతో కనుమూశాడు. అంటే బహుశా మూడు నాలుగేళ్ళ క్రితమే దీన్ని పూర్తి చేసి…థియేటర్లలో విడుదల చేయడానికి ఎవరూ ముందుకు రాక…నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లాంటి పెద్ద ఓ టి టి లవారు డబ్బు పెట్టక…చివరికి ఆహాలో- యూట్యూబులో విడుదల చేసినట్లున్నారు. ఇందులో కూడా మీకు నయాపైసా రాకపోవచ్చు. వచ్చినా అది మీ శ్రమకు తగిన ప్రతిఫలం కాకపోవచ్చు.
విశ్వనాథ వేయిపడగలను హిందీలోకి అనువదించారు పి వి నరసింహారావు. “హిమాలయం ఎత్తు కొలవగలం కానీ…విశ్వనాథ పాండిత్యం లోతు కొలవగలమా?” అన్నారు పి.వి. అలాంటి విశ్వనాథను మాకు అద్దంలో చూపించినందుకు మీకు కృతఙ్ఞతలు చెప్పే సంస్కారం కూడా మాకు లేదని బాధపడకండి. మేమంతే. గుర్రం జాషువా ఎవరో మాకు పట్టదు. రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ, గుంటూరు శేషేంద్ర, పుట్టపర్తి నారాయణాచార్యులు, సామల సదాశివ, కపిలవాయి ఎవరో మాకు తెలియదు. సినిమా పాటలు రాయడంవల్ల సి నా రె(జ్ఞానపీఠం పొందిన రెండో తెలుగు కవి) ఎవరో మాకు తెలుసు. జ్ఞానపీఠం అందుకున్న మూడో తెలుగు వ్యక్తి రావూరి భరధ్వాజ ఎవరో తెలుసుకునే ఓపిక మాకు లేదు.
ప్రపంచం పట్టనంత సాహితీ శిఖరం విశ్వనాథ హిందీలోనో, బెంగాలీలోనో, ఇంగ్లిష్ లోనో రాసి ఉంటే…ప్రపంచకవి అయి ఉండేవాడు. విజయవాడ వీధుల్లో రిక్షాల్లో తిరుగుతూ ఏ లెక్కలకూ అందనంత సాహిత్యాన్ని తెలుగులో రాశాడు కాబట్టి ఇలా మీలాంటివారు చెబితే తప్ప తెలియనివాడయ్యాడు. అందుకు తెలుగువాడిగా సిగ్గుపడుతూ…సగటు తెలుగు భాషాభిమానిగా మీ ప్రయత్నానికి ప్రణమిల్లుతూ…సాహిత్య విద్యార్థిగా మనసారా అభినందనలు.
మనముందు మొన్నటికి మొన్న మనలాగే రక్తమాంసాలతో పుట్టిన విశ్వనాథ సృష్టించిన సాహితీ సముద్రాలను ఎంతో కొంత తెలుసుకోవాలనుకునేవారు ఈ లింక్ ఓపెన్ చేసి…చూడవచ్చు.
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు