Wednesday, April 16, 2025
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపన్నూడగొట్టుకోవడానికి ఏ ప్రకటనల రాయైతే ఏమి?

పన్నూడగొట్టుకోవడానికి ఏ ప్రకటనల రాయైతే ఏమి?

ఒక సాయంత్రం ఇంటికొచ్చి టీ వీ లో ఐ పి ఎల్ మ్యాచ్ ప్రత్యక్షప్రసారం రెండు ఓవర్లు చూడబోతే ఎదురైనవి ఇవి:-

ఒక నవలావణ్య సుందరి విరగపూచిన గులాబీ చెట్ల మధ్య ఒంటరిగా తారాడుతూ ఉంటుంది. ఈలోపు ఒకబ్బాయి గులాబీ కొమ్మల ముళ్ళు చేతికి గుచ్చుకునేలా చెట్టుకు ఆనుకుని అమ్మాయివైపు వస్తాడు. మోచేతికి రక్తం కారుతున్నా…అమ్మాయిచేతిలో గులాబీ పువ్వు పెట్టి ప్రేమను వ్యక్తపరుస్తాడు. తన మెడకు చుట్టుకున్న దుపట్టాను అతడి చేతి గాయానికి కట్టి…సంకెలగా చుట్టి…అబ్బాయి నోటికి హైడ్ అండ్ సీక్ బిస్కట్ అందిస్తుంది. కొన్ని కథలు ఇలా మొదలవుతాయి- అన్న వాయిస్ ఓవర్ తో యాడ్ ముగుస్తుంది. ఇదే హైడ్ అండ్ సీక్ వారిది మరో యాడ్. అమ్మాయి ఒంటరిగా సైకిల్ తొక్కుతూ చెయిన్ పడిపోతే సరిచేసుకుంటుంది. ఈలోపు ఇదే అబ్బాయి బిస్కట్ తీసుకుని ఎవరూలేని ఏకాంత రోడ్డుమీద ఈ కాంతకోసం వస్తాడు. బిస్కట్ ఇవ్వబోతే అమ్మాయి సైకిల్ చెయిన్ సరిచేసుకోవడంవల్ల చేతులు మురికిగా ఉంటాయి. అమ్మాయి నోటికి బిస్కట్ అందిస్తాడు. కొన్ని కథలు ఇలా మొదలవుతాయి- అని ముగుస్తుంది. ఇరవై- ఇరవై కలిపి నలభై ఓవర్లు చూసి ఉంటే…వీరి కథలకు బీజంగా నోట్లో బిస్కట్ పడడానికి సృష్టించిన కష్టాలన్నీ నాకు తెలిసేవి!

నేలమీద ప్రేమ బిస్కట్లు వేయడానికి యాడ్ క్రియేటివిటీనే ఈ స్థాయిలో ఉంటే…ఇక ఆకాశంలో అయితే ఆ క్రియేటివిటీకి ఆకాశమే హద్దు. టర్కిష్ విమానంలో మనం కూర్చోగానే గగనసఖి ఇచ్చే తిండికి మొహం వచ్చినట్లు హైడ్ అండ్ సీక్ బిస్కట్ కాగానే టర్కిష్ ఎయిర్ లైన్స్ వారి ఆకాశంలో అన్నదాన కార్యక్రమం యాడ్!

ఆ ప్రేమ బిస్కట్లు, ఈ టర్కిష్ అన్నం తినగానే ఎక్కిళ్ళు తప్పవు. వెంటనే హేమమాలిని శుద్ధ పానీ అంటూ గ్లాసులో మంచినీళ్ళతో వస్తోంది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఎక్కిళ్ళతోనే పోయేవాళ్ళం!

…పోయినా…పోకపోయినా పర్లేదు…పాప ఉయ్యాల్లో ఉన్నప్పుడే మ్యూచువల్ ఫండ్స్ లో డబ్బును ఇన్వెస్ట్ చేస్తే చాలు- అంటూ మహేంద్రసింగ్ ధోనీ సంసారపక్షంగా ఆర్థిక సలహా ఇస్తుంటాడు!

ఈలోపు అజయ్ దేవగన్ విమల్ ఇలాచీని దంచి దంచి నా నోట్లో వేశాడు. అప్పటికే అయిదు టన్నుల విమల్ ఇలాచీ తిన్నాను…ఇంత ఇలాచీ భూమ్మీద మనుషులు తినకూడదు- అంటే విననే వినడు. చీకటి రాత్రిలో నల్ల కళ్ళజోడు పెట్టుకున్న అజయ్ దేవగన్ కు లోకమంతా గుడ్డిగానే కనిపించినట్లుంది. మొత్తం విమల్ ఫ్యాక్టరీలో తయారైన ఇలాచీని మా ఇంట్లోనే విసిరి విసిరి పోయాడు!

భూగోళానికంతటికి సరఫరా చేయదగ్గ ఈ ఇలాచీని ఏమి చేయాలో తెలియక తలపట్టుకుని కూర్చుని ఉంటే…సల్మాన్ ఖాన్ వచ్చి…రాజ్ శ్రీ బ్రాండ్ ఇలాచీని అంతే పరిమాణంలో ప్యాకెట్లుగా విసిరి విసిరి చల్లిపోయాడు- గోడదెబ్బకు తోడు చెంపదెబ్బ కూడా ఒకేసారి తగిలినట్లు!

…ఈ కష్టాలెందుకు? నడుముకు రబ్బరు ట్యూబులు కట్టుకుని స్విమ్మింగ్ పూల్లో దూకండి అంటూ ఏంజిల్ వన్ స్టాక్ బ్రోకింగ్ నీళ్ళల్లోకి తోసింది!

నిండా మునిగినవాడికి చలేమిటి? అనుకుంటూ…ట్యూబ్ లేకుండానే ప్రకటనల కొలనులో మునిగాను.

మ్యాచ్ ను ఓడించి…ప్రకటనలను గెలిపించిన ఈ వినోదక్రీడలో బంతి బంతికో యాడ్ యాడవుతూ ఉంటుంది. ఇంతకూ…నేను ఐ పి ఎల్ లో ఏ మ్యాచ్ చూశాను? మ్యాచే చూశానా?

బాబ్బాబూ!
ఇంటినిండా విమల్ ఇలాచీ మూటలు. రాజశ్రీ ఇలాచీ పొట్లాలు. హైడ్ అండ్ సీక్ బిస్కట్ల గాట్లతో మోచేతులు, మోకాళ్ళకు గాయాలు. చిన్న ఇల్లు. కాలు తీసి కాలు పెట్టలేకపోతున్నాను. అటుగా వచ్చినప్పుడు తలా పిడికెడు యాడ్ తిలా పాపం తీసుకెళుదురూ…!

అయ్యో! మీరు రెండు మ్యాచులూ కలిపి ఎనభై ఓవర్లు చూశారా? పాపం! మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు!!

ఐ పి ఎల్ మ్యాచుల ప్రసార హక్కులు దక్కించుకున్న జియో స్టార్ కు 2025 సంవత్సరపు మ్యాచులమీద ముష్టి అయిదు వేల కోట్ల ఆదాయం మాత్రమే వస్తుందట- పాపం!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

RELATED ARTICLES

Most Popular

న్యూస్