తెలతెలవారుతుండగా నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల రిసార్ట్ బాల్కనీలో కూర్చుంటే కనిపించిన దృశ్యానికి, వినిపించిన శబ్దాలకు అనువాదమిది.
అటు ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా శ్రీశైలం జలాశయం. ఆ బ్యాక్ వాటర్ లో ఇటు తెలంగాణ నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల. రెండు కొండల నడుమ సరిహద్దులెరుగని కృష్ణమ్మ నీరు పల్లమెరుగు అన్న ప్రకృతి సహజ న్యాయసూత్రం ప్రకారం సోమశిలలో లలితా సోమేశ్వరస్వామి పాదాలు కడుగుతోంది. కిచకిచలాడుతూ పిచుకలు బాల్కనీలో నా పక్కనే కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాయి. తెల్లటి కొంగలు నల్లటి బురదనేల మీద దేనికోసమో వెతుకుతున్నాయి. కొన్ని కొంగలు నిజంగానే ఒంటికాలిమీద తపస్సు చేస్తున్నాయి. కొన్ని కొంగలు ఆకాశంలో ఎగురుతున్నాయి. కాకులు అరుస్తున్నాయి. పావురాలు ఎగురుతున్నాయి.
జాలర్లు తొట్టెల్లో, పడవల్లో ఏటికి ఎదురీదుతూ అప్పుడే చేపలవేటకు బయలుదేరారు. నీటి మట్టం తగ్గినప్పుడు మూడు, నాలుగు నెలలు మాత్రమే దోస, పుచ్చకాయలు పండించే రైతులు నీటి గట్టువెంబడి దున్నడానికి ఎడ్లకాడికి నాగళ్ళు కడుతున్నారు.
సంవత్సరంలో ఏడెనిమిది నెలలు నీళ్లల్లో మునిగి వేసవిలో మాత్రమే బయటికి తేలే సంగమేశ్వరాలయం కొండ వెనుక కంటికి కనిపించడం లేదు. మనసుకు మాత్రం కనిపించేంత దగ్గరగానే ఉంది. అది ఆంధ్రప్రదేశ్ లో ఉండడం వల్ల…ఇటు తెలంగాణలో ఎక్కిన బోటు అక్కడికి వెళ్లకూడదని…నీళ్ళమధ్యలో సరిగ్గా సరిహద్దు గీత దగ్గర ఆపి…అదే సంగమేశ్వరాలయం అని దూరం నుండి మా బోటు డ్రయివర్ చూపించినప్పుడు మనసు చివుక్కుమంది. రెండు రాష్ట్రాల టూరిజం శాఖ మంత్రులో, కార్యదర్శులో కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారమయ్యేంత చిన్న సమస్య కాదేమో ఇది! దేశాల మధ్య సరిహద్దు భద్రత కంటే ఏదో పెద్ద సమస్యలా భయపడుతున్నారిక్కడ రెండువైపులా బోట్ల ఆపరేటర్లు.
తూరుపు కొండలను చీల్చుకుని సూర్యుడు పొద్దెక్కాడు. రిసార్ట్ బాల్కానీనుండి కిందికి విసిరిన లిక్కర్ బాటిళ్ళు, ప్లాస్టిక్ బాటిళ్ళు, బీర్, కూల్ డ్రింక్ టిన్నులు కనిపించాయి. మనకిప్పుడు వీకెండ్ అంటే తాగడమే. తాగితే తాగారు కానీ…అలుపెరుగక యుగయుగాలుగా ప్రవహించే పవిత్ర కృష్ణమ్మలో మనం తాగే ఈ చీప్ లిక్కర్ బాటిళ్ళను వేయకూడదన్న కనీస ఇంగితజ్ఞానం లేకపోవడం బాధాకరం. ఆ కృష్ణ నీళ్ళే మనం తాగుతున్నాం- అవే మన పొలాలు కూడా తాగుతున్నాయన్న స్పృహ ఉండదు మనకు.
రిసార్టులు, ఇతర వసతుల వల్ల జనం తాకిడి పెరిగింది. స్థానికులకు ఉద్యోగావకాశాలు పెరిగాయి. జీతం తక్కువైనా ఉన్న ఊళ్ళోనే కాబట్టి తృప్తిగానే ఉందన్నారు ప్రత్యేకించి మహిళలు.
ఎక్కడి కృష్ణ? ఎంతెంత దూరం ప్రయాణించి…మధ్యలో ఎన్నెన్నిటిని తనలో కలుపుకుంటూ ఇక్కడిదాకా వచ్చిందో! ఇక్కడి నుండి ఇంకా వెళ్లాల్సిన దూరం ఇంకా ఎంత ఉందో? మధ్యలో ఇలాగే నాగార్జున సాగరంగా, ప్రకాశం బ్యారేజ్ గా ఇంకా ఎన్నెన్ని చోట్ల ఇల్లు కట్టుకుని ఉండాలో? కోట్ల గొంతులను తడిపి…లక్షల ఎకరాలను తడిపి…కోట్ల గొంతుక కావాలో?
కనకదుర్గ పాదాలు కడిగిన పరవశంతో కృష్ణమ్మ ఉక్కిరిబిక్కిరిగా సముద్రంవైపు పరుగులు తీస్తోందంటారు విశ్వనాథ. “తెలుగింటమ్మా! వెలుగింటమ్మా! మా కృష్ణవేణీ!” అంటారు వేటూరి. అలా తను నడిచిన దారంతా ఈ కృష్ణ ఎందరి తృష్ణను తీర్చిందో! ఎన్ని నేలలను పునీతం చేసిందో! ఎన్నిటిని పుణ్య తీర్థాలుగా మార్చిందో! ఎన్నిటిని పుణ్యక్షేత్రాలుగా మార్చిందో! ఎన్నెన్ని సుడులు తిరిగి జలవిద్యుత్తుగా మన బతుకుల్లో వెలుగులకు, మన నడకల్లో శక్తికి జలకేతనంగా మారిందో!
రేపు:-
సోమశిల ఆలయాలు
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు