“పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం” అని తెలియనిదెవరికి? అయినా సేవిస్తూనే ఉన్నాం. అలా సేవిస్తే తల్లి గాజులు అమ్మి ఆసుపత్రికి కట్టినా బతికి బట్టకట్టలేమని హృదయవిదారకమైన స్టాచ్యుటరి ప్రకటనను దశాబ్దాలుగా చూడలేక…చూడలేక…చూస్తూనే ఉన్నాం. సినిమాల్లో పొగ, మద్యం కనపడిన ప్రతిసారీ ఆ సన్నివేశం కిందే చట్టబద్దమైన ఆరోగ్య హెచ్చరిక అక్షరాలా ఉంటూనే ఉంటుంది.
1. చట్టం, నేరం, శిక్ష, జరిమానా, హెచ్చరిక, సలహా, సూచన ఒక ట్రాక్ మీద వెళుతూ ఉంటాయి.
2. అలవాట్లు, సరదాలు, వ్యసనాలు పక్కనే మరో ట్రాక్ మీద వెళుతూ ఉంటాయి.
3. న్యాయం, ధర్మం, నైతికత, ఆదర్శాలు వీటికి దూరంగా ఎక్కడో దేవతవస్త్రం లాంటి కనిపించని ట్రాక్ మీద, కనిపించని ప్రయాణం చేస్తుంటాయి.

ఏ ట్రాక్ మీద వెళ్లేవి ఆ ట్రాక్ మీదే వెళ్లాలి. లేకపోతే పెను ప్రమాదాలు జరుగుతాయి!
భారతదేశంలో చిరుతిళ్ళు, ప్యాక్డ్ ఫుడ్డు (ఎక్కువ కాలం పొట్లాల్లో నిలువ ఉంచిన తినుబండారాలు) తెచ్చిన పెను ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం ఇన్నేళ్ళకు దృష్టి సారించింది. వీటిల్లో విపరీతమైన ఉప్పు, తీపి ఉండడంతో చిన్నా పెద్దా అందరూ కొండల్లా తయారై చివరికి దేశమే స్థూలకాయంతో కదలలేకపోతోందని కేంద్రం గుర్తించింది. ఇకపై సిగరెట్టు పెట్టెలపై “ఆరోగ్యానికి హానికరం” అన్న చట్టబద్దమైన హెచ్చరికలా సమోసా, జిలేబీ, కచోరి, వడాపావ్, గులాబ్ జామూన్, పిజ్జా, ఫ్రెంచ్ ఫ్రయిస్, కూల్ డ్రింక్ లలో ఎంతెంత చక్కెర, ఆయిల్, ఉప్పు, కొలెస్ట్రాల్ ఇతర హానికర పదార్థాలున్నాయో అమ్మేచోట డిస్ప్లే బోర్డులు పెట్టించాలని కేంద్రం అన్ని శాఖలకు ఆదేశాలిచ్చింది. తొలుత పూనాలోని ఎయిమ్స్ క్యాంటీన్లో ఇలా బోర్డులు ఏర్పాటు చేశారు. దీనిమీద పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టారు.

పిల్లల్లో ఊబకాయానికి, ఇతర ఆరోగ్య సమస్యలకు ఈ చిరు తిళ్ళు, ప్యాక్డ్ ఫుడ్డే కారణమన్నది ప్రభుత్వ పరిశీలన. ఆయా ఆహార పదార్థాలను, తయారీని నిషేధిస్తే…ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేసి ప్రస్తుతానికి సలహాలకు, సూచనలకే పరిమితమయ్యింది.
పనిలో పనిగా…ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ యాప్ ల విజృంభణ తరువాత పిల్లలతోపాటు పెద్దల్లో కూడా పేరుకుపోతున్న అనారోగ్యం మీద కేంద్రం దృష్టిసారిస్తే…బయటపడే విషయాలు విని తట్టుకోవడానికి ఒక్కొక్కరికి రెండు, మూడు గుండెలున్నా సరిపోవు!

చట్టబద్దమైన హెచ్చరిక:-
చట్టబద్దమైన హెచ్చరికలవల్ల పొగ, మద్యం తాగడం ఏమన్నా తగ్గిందా! అని నిట్టూర్చడం కంటే…కేంద్రం ఆరోగ్య హెచ్చరికలవల్ల ఇన్ని కోట్ల మందిలో ఒక శాతం మారినా ఒకటిన్నర కోటి మందికి శ్రీరామరక్ష. పదిశాతం మారితే…దాదాపు పదిహేను కోట్లమందికి ఆరోగ్య భద్రత. అంటే భూగోళంలో కొన్ని దేశాల మొత్తం జనాభా కంటే ఎక్కువ మంది తమను తాము రక్షించుకున్నట్లు. మంచిదే. అంతకంటే కావాల్సిందేముంటుంది?
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

