ఏ తల్లి పాడేను జోల
ఏ తల్లి ఊపేను డోల
ఎవరికి నీవు కావాలి
ఎవరికి నీ మీద జాలి
మొన్న ఒకేరోజు పత్రికల్లో దాదాపుగా ఒకే అంశానికి సంబంధించిన రెండు వార్తలు వచ్చాయి. మొదటిది హైదరాబాద్ లో సృష్టి టెస్ట్ ట్యూబ్ సెంటర్ మోసం లో అనాథగా మిగిలిన పిల్లవాడు కాగా, రెండోది హిమాచల్ వరదల్లో తనవారిని కోల్పోయిన చిన్నారిని ప్రభుత్వంతో సహా అందరూ అక్కున చేర్చుకోవడం. రెండుచోట్లా బాధితులు పసివారే. వారి బాధ్యత తీసుకోవడంలో ఎంత వైరుధ్యం?
ముందుగా సృష్టి టెస్ట్ట్యూబ్ సెంటర్ నిర్వాకం చూద్దాం. వీళ్ళు పిల్లలు లేని దంపతులని ఎంచుకుని సంతాన భాగ్యం కలిగిస్తామంటారు. మెల్లగా సర్రోగసి కి ఒప్పిస్తారు. ముందే ఎవరెవరినుంచో వీర్యం సేకరించి ఉంచుతారు. పేదవాళ్ళని డబ్బుతో కొని సర్రోగసి కి ఒప్పిస్తారు. కొన్నిసార్లు వారి బిడ్డనే కొని, సర్రోగసి ద్వారా జన్మించినట్టు నమ్మించి సంతానం కోసం వచ్చిన వారి దగ్గరనుంచి లక్షల రూపాయలు వసూలు చేస్తారు. అలా ఒక దంపతులు సంతానం కలగడం లేదని వెళ్లారు. వారిని సర్రోగసి కి ఒప్పించారు. ఫీజు లక్షల్లో ఉండగా విడతల వారీగా వసూలు చేశారు. మరో రాష్ట్రానికి చెందిన జంటకి పుట్టిన పిల్లాడిని సర్రోగసి ద్వారా పుట్టాడని అప్పగించారు. అయితే పిల్లవాడి రూపురేఖలు తేడాగా ఉండటంతో డిఎన్ఏ టెస్ట్ చేయించారు. అసలు నిజం బయటపడింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. డొంకంతా కదిలింది. తమకు పుట్టలేదు కాబట్టి ఆ పిల్లవాడు వద్దు అని వదిలేశారు. ఈ లోగా అసలు తల్లిదండ్రులు అరెస్ట్ అయి జైలులో ఉన్నారు. ప్రస్తుతం ఆ బిడ్డడు ప్రభుత్వ శిశువిహార్ లో ఉన్నాడు. రెండునెలలలోపు తల్లిదండ్రులు తీసుకెళ్లకపోతే ప్రభుత్వం దత్తతకు పెడుతుంది. ఇక్కడ తప్పెవరిది? కాసులకు కక్కుర్తి పడ్డ పేదరికానిదా? లక్షలతో వ్యాపారం చేసే డాక్టరు దా? సరైన పర్యవేక్షణ చేయని ప్రభుత్వానిదా? ఇప్పుడు ఎవరు పాడాలి జోల?

హిమాచల్ ప్రదేశ్ లో మొన్న జూన్ నెలలో ఆకస్మికంగా వరదలు వచ్చాయి. అమ్మ, నాన్న, నాన్నమ్మల మధ్య హాయిగా నిద్రపోతున్న నెలల చిన్నారి నికితకు తెలీకుండానే తన వారంతా వరదలో కొట్టుకుపోయారు. అయినా తల్వారా గ్రామస్తులు ప్రేమతో అక్కున చేర్చుకున్నారు. ఆమె బంధువులు, దేశ విదేశాల వారు దత్తత చేసుకుంటామని ముందుకొచ్చారు. కానీ సమీప బంధువుకు సంరక్షణ అప్పగించారు. ఇప్పుడు ప్రభుత్వం ముఖ్యమంత్రి సుఖ ఆశ్రయ యోజన పథకం కింద నికితను చేర్చుకుంది. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకోసం ఉద్దేశించిన ఈ పథకం ద్వారా నిఖితకు 27 సంవత్సరాలు వచ్చేవరకు నెలకు నాలుగువేల రూపాయలు పోషణ కోసం ఇస్తారు. ఇప్పటికే ఆమె సేవింగ్స్ బ్యాంకు ఖాతాలో జులై, ఆగష్టు రెండునెలలకు ఎనిమిదివేల రూపాయలు వేసినట్టు మండి డిప్యూటీ కమీషనర్ అపూర్వ్ దేవగన్ తెలిపారు. ఇటువంటి దుర్ఘటనల్లో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను ఆదుకోడానికి ప్రభుత్వం సంక్షేమపథకాల ద్వారా కృషి చేస్తోందని తెలిపారాయన. ఇప్పుడు ఎవరైనా నికితకు ధైర్యంగా జోల పాడతారు. డోలా ఊపుతారు. ఆ పాప అందరికీ అపురూపమే!
-కె. శోభ
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

