Friday, June 12, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంవిమానాలన్నాక ఎదురెదురుగా రావా ఏమిటి?

విమానాలన్నాక ఎదురెదురుగా రావా ఏమిటి?

విమానం రెక్కలు విప్పి ఆకాశంలో ఎంతెత్తుకు ఎగిరినా నేలకు దిగాల్సిందే. రన్ వే మీద ల్యాండయిన విమానం రెక్కల్లో ఇంధనం నింపుకుని, పొట్టలో ప్యాసింజర్లను పొదివి పట్టుకుని మళ్ళీ పక్షిలా గాల్లోకి ఎగరాల్సిందే. త్రేతాయుగం నాటికే ఇప్పటి డబుల్ డెక్కర్ ఎయిర్ బస్ కంటే మెరుగైన పుష్పక విమానాలు ఉండేవని రామాయణం సుందరకాండను ప్రస్తావిస్తూ నమ్మేవారు నమ్ముతారు. నమ్మనివారు కేవలం వాల్మీకి ఊహగా, కవి కల్పనగా కొట్టిపారేస్తారు.

1903 డిసెంబర్ 17న రైట్ బ్రదర్స్ తొలిసారిగా విమానాన్ని గాల్లో నడిపిన క్షణం నుండి రెక్కలు కట్టుకుని మనం దాటిన దేశాలెన్నో! ఖండాలెన్నో! సముద్రాలెన్నో! దూరాలెన్నో! లెక్కే లేదు. ఒకప్పుడు విమానయానం సంపన్నులకే పరిమితం. ఇప్పుడు విమానయానం సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చింది. ఒకప్పుడు ప్రభుత్వ ఎయిర్ లైన్స్ ఒకటే. ఇప్పుడు రెక్కలు విప్పిన ప్రయివేటు విమానయన సంస్థలు లెక్కలేనన్ని.

ప్రపంచంలో భారత్ మూడో అతిపెద్ద విమానయాన మార్కెట్. ప్రస్తుతం సంవత్సరానికి 40కోట్లమంది విమానాల్లో ప్రయాణిస్తున్నారు. ఏటా ఈ సంఖ్య పదినుండి పన్నెండు శాతం పెరుగుతోంది. 24 అంతర్జాతీయ విమానాశ్రయాలతో కలిపి భారత్ లో 140 విమానాశ్రయాలున్నాయి. భవిష్యత్తులో ఈ సంఖ్య దాదాపు 375కు చేరవచ్చు. ఏటా విమానయాన రంగం వ్యాపార విలువ అయిదు లక్షల కోట్లు. ఇలా ఏటేటా పెరిగే విమానయాన పరిశ్రమగురించి పులకింతగా ఎన్ని లెక్కలైనా చెప్పుకోవచ్చు. కానీ విమానసంస్థల వ్యవహారం మాత్రం అంత గొప్పగా లేదు. చిత్ర విచిత్ర పద్ధతుల్లో ప్రయాణికులను దోచుకోవడంలో పోటీలు పడుతున్నాయి. సిగ్గూ ఎగ్గూ విడిచి ప్రవర్తిస్తున్నాయి.

ఉత్తరప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో మహాకుంభమేళా జరిగితే…“ఊళ్ళో పెళ్ళయితే…ఎవరికో హడావుడి” అన్నట్లు విమానయాన సంస్థలు భక్తులను పిండుకుని...కుంభమేళాను నిస్సిగ్గుగా సొమ్ము చేసుకున్నాయి.

ఆమధ్య జమ్మూ కాశ్మీర్ లో మినీ స్విట్జర్లాండ్ గా పేరుపొందిన పహల్గాం కొండమీది బైసరన్ పచ్చిక బయళ్ళలో పర్యాటకులు ప్రకృతిని చూసి పరవశిస్తుండగా ముష్కరమూకలు దాడి చేశాయి. 26మంది అక్కడికక్కడే తూటాలకు బలై ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ దాడి తరువాత జమ్మూ కాశ్మీర్ పక్షులు ఎగిరిపోయిన చెట్టులా తయారయ్యింది. వేలమంది వెనువెంటనే కాశ్మీరం వదిలి సొంత ఊళ్ళకు బయలుదేరారు. కాశ్మీర్ వెళదామనుకుని టికెట్లు కొనుక్కున్నవారు విమానం టికెట్లను క్యాన్సిల్ చేసుకున్నారు. ఒక్కసారిగా కాశ్మీర్ నుండి తిరుగు ప్రయాణికుల రద్దీ పెరిగింది. ప్రయాణికుల భయాన్ని, ఆదుర్దాను, ఆందోళనను విమానసంస్థలు పోటీలు పడి సొమ్ము చేసుకున్నాయి. సాధారణంగా ఆరేడు వేలున్న టికెట్ ధరను అరవై, డెబ్బయ్ వేల వరకు పెంచారు.

జపాన్ లో సంక్షోభ సమయంలో ప్రభుత్వం, ప్రయివేటు సంస్థలు సమాజానికి ఉచిత సేవలు చేస్తాయట. గల్ఫ్ యుద్ధ సమయంలో ఎయిర్ ఇండియా, భారత వాయుసేన వేలమందిని ఉచితంగా, భద్రంగా స్వదేశానికి తీసుకువచ్చింది. ఒళ్ళు గగుర్పొడిచే ఈ సాహసగాథల ఆధారంగా “ఎయిర్ లిఫ్ట్” లాంటి సినిమాలు కూడా వచ్చాయి.

ఒకపక్క రక్తపు మరకలతో ప్రయాణికులు భయపడుతుంటే…
ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉన్నపళాన సొంత ఊళ్ళకు వెళ్లిపోవాలని తొందరపడే వేళ…
ఇదే సందని ప్రయివేటు విమానసంస్థలు నిర్దయగా దోచుకున్నాయి. డబ్బులు లెక్కపెట్టుకున్నాయి.

ఇంతగా ప్రయాణికులను దోచుకోవడంలో పోటీలుపడే విమానయాన సంస్థలు ప్రయాణికుల భద్రత విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నాయా అంటే…సమాధానానికి దేవుడే దిక్కు. ఆమధ్య అహ్మదాబాద్ నుండి లండన్ కు టేకాఫ్ ఆఫ్ అవుతూ రన్ వే దాటీ దాటకముందే మెడికల్ కాలేజీ మీద పడితే ఒక్కడు తప్ప అందరూ ప్రాణాలు కోల్పోయారు. విమానం ఇంజిన్ కు ఇంధనం సరఫరా కావడానికి నొక్కే స్విచ్ ను ఒక పైలట్ ఆపడంవల్లే ఈ పెను ప్రమాదం జరిగిందని విచారణలో తేలినట్లు వార్తలు గుప్పుమన్నాయి. అలా ఏమీ లేదు…అది కారణం కాదని మీడియాకు అధికారిక లీకులిచ్చారు కానీ…అంతటి ప్రమాదానికి అసలు కారణమేమిటో ఇప్పటికీ లోకానికి తెలియలేదు.

ఈలోపు విమానాశ్రయాల్లో ఎదురెదురుగా విమానాలు ఢీ కొట్టుకోబోయి ప్రయాణికుల పూర్వజన్మల పుణ్యఫలంవల్ల చివరి నిముషంలో పక్కకు తప్పుకుని వెళ్లిన సంఘటనలు ఒకటి రెండు జరిగాయి. తాజాగా కేరళ తిరువనంతపురం నుండి ఢిల్లీ బయలుదేరిన ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తి…అత్యవసరంగా చెన్నయ్ లో ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈసందర్భంగా ల్యాండింగ్ కు రన్ వే ఖాళీ లేక రెండు గంటలు చెన్నయ్ నగరం మీద మేఘాల్లో చక్కర్లు కొడుతున్నప్పుడే విమానంలో సగం మందికి పై ప్రాణాలు పైనే పోయాయి. తీరా రన్ వే ఖాళీ అయి…ల్యాండింగ్ కు గ్రౌండ్ కంట్రోల్ ఏ టీ సి అనుమతి వచ్చాక విమానాన్ని దించబోతే…రన్ వే మీద మరో విమానం అడ్డంగా ఉండడంతో అప్పటికప్పుడు విమానాన్ని కొద్దిగా పైకి లేపడంతో పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు. అబ్బే…అలాంటిదేమీ లేదు…విమానంలో ఉన్న కాంగ్రెస్ ఎం పి కె. సి. వేణుగోపాల్ దీన్ని అనవసరంగా వివాదం చేస్తున్నారని చెన్నయ్ ఎయిర్ పోర్ట్ అధికారులు కొట్టిపారేస్తున్నారు.

ఈనేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వ్యాఖ్యలు ఇవి:-

  • ఎదురుగా విమానం అడ్డుగా ఉందో లేదో పైలట్లతోపాటు ప్రయాణికులు కూడా చూసి చెప్పడానికే టేకాఫ్, ల్యాండింగ్ అప్పుడు కిటికీ తలుపులు తెరిచి పెడతారు. బాధ్యతగల ప్రయాణికులు ఇకపై ఎదురుగా ఏముందో ఒక కన్నేసి ఉండాలి!

  • ఏ టీ సీ, ఆటోమేటిక్ సాంకేతిక వ్యవస్థలకంటే మన ఎడ్లబండి సైగలు, భాషలు కూడా పైలట్లకు నేర్పి…విమానం ముందు నౌకలకు పెట్టినట్లు మూడు, నాలుగు కిలోమీటర్ల దూరానికయినా వినిపించేలా పెద్ద లౌడ్ స్పీకర్లు పెట్టాలి!
  • రన్ వే లు బాగా బిజీగా ఉంటే మహానగరాల ఓ ఆర్ ఆర్ లలో విమానాలను దించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి!
  • ఒక్కో పైలట్ కు ఎన్ని వేల గంటల ఫ్లయింగ్ టైమ్ అనుభవముందో చెబుతున్నట్లే వారి సర్వీసులో ఎన్ని సార్లు విమానాలు అడ్డుగా ఉన్నా సునాయాసంగా, భద్రంగా, చాకచక్యంగా టేకాఫ్, ల్యాండింగ్ చేయగలిగారో కూడా చెప్పాలి. వీలయితే ఫ్లైట్ స్టిమ్యులేటర్ మొదలు అసలు విమానం నడపడం దాకా శిక్షణలో విమానాల అడ్డును ఎలా దాటాలో శాస్త్రీయంగా, ప్రాక్టికల్ గా నేర్పాలి!

-పమిడికాల్వ మధుసూదన్
9989090018

YouTube – ధాత్రి మహతి 
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular