Friday, June 12, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంమానవత్వమా? జీవ కారుణ్యమా?

మానవత్వమా? జీవ కారుణ్యమా?

మొన్న రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ ఒక చిన్న పిల్లవాడిని కుక్కలు చుట్టుముట్టి చంపినపుడు ఏమయ్యారు జీవ కారుణ్య వాదులు అన్నారు. నిజమే కదా! నాకూ కుక్కలంటే భయమే. కానీ మెల్లగా పోగొట్టుకుంటున్నాను. వీధి కుక్కల దగ్గర మాత్రం ఎవరేం చెప్పినా నమ్మను. మూగజీవులు, జీవ హింస ఇవన్నీ నమ్ముతాను. ఆచరిస్తాను. అయితే ఇటీవల కుక్క కాటుకు బలవుతున్న పిల్లలు, మహిళల వార్తలు చూసినపుడు విపరీతమైన భయం వేసింది. అలాంటి కాలంలోనే ఒక ఫంక్షన్ కి వెళ్ళాను. వచ్చేటప్పుడు కార్ కోసం ఎదురుచూస్తున్నాను. కొంచెం దూరంలో ఒక చెత్తబండి ఉంది. అక్కడే రెండుమూడు కుక్కలు తిరుగుతున్నాయి. నేనేమో పట్టుచీరలో ఉన్నాను. మెల్లగా ఆ కుక్కల చూపు నా మీద పడింది. ఏమిటో ఆ రోడ్ లో పెద్దగా జనసంచారం లేదు. ఒక నల్ల కుక్క మరీ సమీపం లోకి వచ్చేస్తోంది. భయం నరనరానా పాకుతోంది. మెల్లగా ముందుకు నడిచాను. అవికూడా నాతో పాటే వస్తున్నాయి. అందులో ఒక నల్ల కుక్క మీద పడుతుందేమో అన్నట్టు తిరుగుతోంది. చేతిలో ఆయుధాలు ఏమీ లేవు. పుస్తకాలు ఉన్నాయి. కొంచెం దూరంలో రోడ్, షాప్స్ కనిపిస్తున్నాయి. మెల్లగా నడవడం ప్రారంభించాను. నాలుగడుగులు వేసి పోతే పో అన్నట్టు చూసి తిరిగి వెళ్లిపోయాయి. అంతకు ముందే ఒక పిల్లవాడిని పీక్కు తిన్న దృశ్యాలు గుర్తొచ్చాయి. కార్ ఎక్కాక కానీ గుండెదడ తగ్గలేదు. అసలు రోడ్లపైన కుక్కలకి బొత్తిగా భయం ఉండడం లేదు. అదిలించినా విదిలించినా పోయే రోజులు కావు.

సుప్రీం కోర్ట్ చెప్పింది అవుననీ అనలేం. కాదనీ అనలేని పరిస్థితి. ఎంత అందంగా ఉన్న కుక్కలైనా అరవకుండా కరవకుండా ఉంటేనే ముద్దు. రాత్రిపూట నిద్రపోనివ్వకుండా అరుస్తూ ఉంటే ఒళ్ళు మండిపోవడమూ సహజమే. మన మానాన నడుచుకుంటూ పోతున్నా మీదపడి కొరికే కుక్కల పైన జాలి చూపాలా? ఇంతకన్నా మనుషులు పెద్ద నేరాలు చెయ్యడం లేదా అని జంతు ప్రేమికులు అంటారు. వారిని శిక్షించడానికి చట్టాలు ఉన్నాయి. మరి కరిచే కుక్కలను శిక్షించే చట్టాలు లేవుకదా!

సరే పోనీ ఈ జీవకారుణ్య వాదులు రోడ్లపైన కనిపించిన కుక్కలన్నీ తీసుకెళ్లి పెంచుకోగలరా? పోనీ సరయిన పరిష్కారాలన్నా చూపగలరా? చాలా చోట్ల కుక్కలు ఉన్నవారికి ఇల్లు అద్దెకు ఇవ్వరు. సమాధానం లేని ప్రశ్నలు చాలా ఉన్నాయి ఈ విషయంలో. అయినా నా వంతుగా కొన్ని సూచనలు

  • జంతు ప్రేమికులు ఒక సంఘంగా ఏర్పడి అటు ప్రజలకు, ఇటు కుక్కలకు ఇబ్బంది లేని వాతావరణం సృష్టించాలి.
  • ప్రభుత్వ సహకారంతో వీరు సేఫ్ జోన్ షెల్టర్లు ఏర్పాటు చెయ్యాలి
  • కొందరికి బొద్దింకలంటే భయం. మరి కొందరికి బల్లులంటే భయం. అలాగే కుక్కలన్నా. అది అందరూ అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం, జంతు ప్రేమికులు కలసి అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలి. రోడ్ మీద గుంపులుగా కుక్కలు ఉంటే ఎలా జాగ్రత్త పడాలో చెప్పాలి. కుక్కలు గుంపులుగా చేరకుండా చూడాలి
  • కనీసం ఎండాకాలంలో వీధి కుక్కలకు ఆహారం, నీరు అందేలా చూడాలి
  • కుక్క కరిచిన వాళ్ళకి సానుభూతి, తగిన సహాయం అందించాలి

ఇవండీ నా ఆలోచనలు. సమస్య వస్తే పరిష్కారం కోసం ఆలోచించాలి గానీ గొడవ పడకూడదు కదా! పక్కింటి కుక్క తెగ అరుస్తోంది ఏమిటో! చూసి వస్తా …

-కె. శోభ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular