పల్లవి :-
పల్లెల్లో కళ ఉంది – పంటల్లో కలిముంది
అని చెప్పే మాటల్లో విలువేముంది?
కళ్ళల్లో నీరుంది – ఒళ్ళంతా చెమంటుంది
ఆ చెమ్మకు చిగురించే పొలమే ఉంది
చరణం 1
చినుకివ్వని మబ్బుంది – మొలకివ్వని మన్నుంది
కరుణించని కరువుంది – ఇంకేముంది?
రైతేగా రాజంటూ అనగానే ఏమైంది?
అది ఏదో నిందల్లే వినబడుతోంది
అనుదినం ప్రతి క్షణం బదులేమివ్వని ప్రశ్నగా మారెనే కొడవలి?
పైరుకా, పురుగుకా ఎవరికి మేలని తెలుసునా విషమయే ముందుకి?

చరణం 2
వరి వెన్నే విరిసేనా గ్రామసీమ వాడితే?
మనవెన్నే నిలిచేనా రైతు పేగు మాడితే?
నమ్ముకున్న నేలతల్లి నెర్రెలుగా చీలితే
అమ్ముకున్న జీవాలన్నీ కబేళాకి చేరితే?
ఏ చెవికీ వినబడవేం పల్లె తల్లి ఘోషలు?
ఎవ్వరికీ కనబడవేం చిల్లుపడిన ఆశలు?
సినిమా – యాత్ర
దర్శకుడు – మహి వి రాఘవ
గీతరచయిత – సిరివెన్నెల
గానం – బాలు
సంగీతం – కె
ఈ పాట విన్న తరువాత మాటలు మూగబోతాయి. గుండె బరువెక్కుతుంది. మసకబారిన రైతు విషాదం కళ్ళల్లో నీటి తెరగా మారుతుంది.
వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ఇతివృత్తంగా తెరకెక్కిన యాత్ర సినిమాలో పాదయాత్రలో భాగంగా వచ్చే పాట ఇది. అసలు సినిమా, సందర్భంతో నిమిత్తం లేకుండా సర్వకాల, సర్వావస్థలకు అన్వయించారు సిరివెన్నెల. అన్నీ తెలిసిన తేలికయిన పదాలే. ఏముంది? ఇంకేం మిగిలింది? అని నిర్వేదంలో, నిట్టూర్పులో ఎవరయినా అనుకునే మామూలు మాటలే. కానీ…అందరి నోళ్ళల్లో నిత్యం నానే ఆ మాటలచేత సిరివెన్నెల ఇందులో ఎంత చాకిరి చేయించుకున్నారో? ఏడు పదులుదాటిన వయసులో కూడా ఎవడురా నా గొంతుకు పోటీ అని బాలు సవాలు విసిరినట్లు పాడారు. ఎంత ఆర్ద్రత? ఎంత ఆర్తి?ఎంత విషాదాన్ని మునిపంట అదిమిపట్టి పాడినట్లు ఉంది.

వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి…దేశం వదిలి పారిపోయి…లండన్ అతిశీతల వీధుల్లో దర్జాగా సిగార్ తాగుతూ మనదేశ దీనావస్థను తలచుకుని తలుచుకుని బాధపడుతుంటారు కొందరు. రాళ్లను వజ్రాలుగా , వజ్రాలను బ్యాంకులవాళ్లకు రాళ్లగా మలచి అమెరికా ఏడు నక్షత్రాల హోటళ్లలో న్యాయాన్యాయాల సమీక్షలు చేస్తుంటారు మరికొందరు. లక్షల కోట్ల రుణాలు ఎగ్గొట్టి రాజ్యలక్ష్మినే చెరబట్టిన రుణపురుషులు మనపక్కనే వీధికొకడు.
వీరికి భిన్నంగా రైతు లక్ష అప్పుకు 20 వేలు వడ్డీ కకట్టలేక పురుగులమందుతో ప్రాణాన్ని బ్యాంకుకు చెల్లు వేస్తాడు. రైతు పేరిటే ఉద్యమాలు, ప్రత్యేక పథకాలు, భిక్షాలు ఎన్నెన్నో?
కానీ…
రైతు ఒక విషాదం. రైతు ఒక చెదిరిన స్వప్నం. రైతు నిలువెత్తు కన్నీరు. రైతు ఒక ప్రశ్న. రైతు ఒక నిరాశ. రైతు ఒక అరణ్య రోదన.
రైతు కాళ్లు పుళ్లు పడి రక్తం కారేలా బొంబాయిలో పాదయాత్రలు చేసినా, రాజధాని నగరంలో సిగ్గువిడిచి తమ మూత్రం తామే తాగి నిరసన తెలిపినా, పరిహారమయినా కుటుంబానికి దక్కనీ అని పొలంలోనే కొమ్మకు ప్రాణాన్ని వేలాడేసినా – నేడు వ్యవసాయం ఒక దండగ. వ్యవసాయం ఒక అంటరానిది, చేతకానివారిది, తెలివిలేనివారిది, చదువురానివారిది.
చివరకు పల్లెలు పట్టణాల శిల్పారామాల్లో, వ్యవసాయం నగరాల ఎగ్జిబిషన్ లలో మాత్రమే చూసుకోవాల్సిన రోజులొస్తున్నాయి.
అలాంటి విధ్వంసమయిన పల్లెలకు, విషాదమైన రైతులకు ప్రతిధ్వని ఈ పాట. ప్రతినిథి ఈ పాట.

పల్లెల్లో కళ, పంటల్లో కలిమి అని గొంతు చించుకుని అరుస్తుంటాం. కానీ కళ్ళల్లో రక్తం కారే రైతును చూడం- చూడలేం – చూడాలని అనుకోము. అలాంటప్పుడు మన మాటలకు విలువేముంది?
రుతువుల్లో నీళ్లు లేకపోయినా – రైతు కళ్ళల్లో నీటితో, ఒళ్ళంతా చెమట చుక్కలతో పొలాన్ని ఎలాగో ఒకలా చిగురింపజేసుకుంటున్నాడు. కురవని మబ్బులు, మొలకివ్వని మన్ను రైతుకు తోడు నీడ. ఇలాంటప్పుడు రైతే రాజు అంటే పుండుమీద కారం పూసినట్లు ఉంది. కొడవలి ఫలసాయం కోయడానికి. తమాషానో…విషాదమో…అది ప్రశ్న గుర్తునే పోలి ఉంటుంది. రైతు ప్రశ్నకు కొడవలి కూడా ప్రశ్నగానే…సాయమూ, సమాధానమూ ఇవ్వలేక మిగిలి ఉంది. మందులు పురుగులకు ఆహారమై, రైతుకు విషమవుతున్నాయి.
వరివెన్ను విరిగి పల్లె ఎపుడో వెన్నెముక లేనిదిగా పడిపోయింది. రోజూ మనం కడుపుకు అన్నమే తినాలి. కానీ పండించే రైతు మాత్రం మూడుపూటలా విషమే తాగాలి. భవితలేక రైతు నుదురు నెర్రెలుగా చీలిపోయింది. ఒక్క గడ్డిపోచ లేక, గుక్క నీరులేక పెంచుకున్న పాడి పశువులను రైతే కబేళాలకు పంపుతున్నాడు.
అయినా మనం శెలవులప్పుడు మాత్రమే టోల్ గేట్ల నిరీక్షణలు దాటి గూగుల్ లో పల్లెలను వెతుకుతాం. చిల్లుపడిన పల్లెలను చూసేంత తీరిక, ఓపిక ఇప్పుడు మనకెక్కడ?
మదనపల్లెలో టమోటా రైతు కిలో పది పైసలకు అమ్ముకోలేక రోడ్లమీదే వదిలేసి వెళ్ళిపోతాడు. అనంతపురంలో వేసిన వేరుశెనగవిత్తనం నీరులేక చెదపురుగులు తింటే రైతు ఎండ్రిన్ తాగుతాడు. రంగారెడ్డి పూల రైతు పూలమ్మినచోట కట్టెలమ్మలేక గుడిమల్కాపూర్ చెత్తబుట్టకు వాడని పూలను అలంకరించి వెళతాడు. నిజామాబాద్ చెరకు తీపి…కానీ రైతుకు మిగిలింది చేదే. నూజివీడు మామిడి మనకే రుచి – రైతుకు అరుచి. అమలాపురం బెల్లం – రైతుకు అల్లం. పలాస జీడిలో ఎన్నెన్ని రక్తపు జీరలో?
కదిలిస్తే రైతు నిలువెల్లా కన్నీరు. “ఏకో రసః కరుణ ఏవ”. నలుగురు కూర్చుని నవ్వేవేళల నాపేరొకతరి తలవండీ – అని గురజాడ పూర్ణమ్మ అందరినీ అడిగింది. రైతుకూడా ఈ పాట ద్వారా అలాగే ఆడుతున్నాడు. కనీసం పట్టెడన్నం తినేవేళ అయినా పండించిన రైతు పచ్చగా ఉండాలని కోరుకుందాం.

సందర్భం:-
జాతీయ నేరాల చిట్టా విభాగం(నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో- ఎన్ సీ ఆర్ బీ) ప్రకారం భారత దేశంలో 2023 సంవత్సరంలో సగటున గంటకొక రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సంవత్సరం మొత్తం మీద దాదాపు రెండు లక్షల మంది బలవన్మరణం పాలయ్యారు. ఇందులో వరుసగా మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోనే ఎక్కువ ఆత్మహత్యలు జరిగాయి. 2022తో పోలిస్తే రైతుల ఆత్మహత్యలు కొంత తగ్గుముఖం పట్టాయని అంటున్నారు. మంచిదే.
కానీ ఏటా రెండు లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారంటే చిన్నవిషయం కాదు. ఒక దేశంగా భయపడాల్సిన విషయం. ఒక సువిశాల ప్రజాస్వామ్య శ్రేయో రాజ్యంగా సిగ్గుతో తలదించుకోవాల్సిన విషయం. వికసిత్ ఆత్మనిర్భర్ సుందర స్వప్నాలేవీ గ్రామీణభారతికి భరోసా ఇవ్వలేని వ్యథ. పొలంలో రైతు గుండెకోత. దేశానికి తీరని కడుపుకోత.

విషాదం:-
ఆత్మహత్య మహా పాపం. భారత శిక్షాస్మృతిలోని 309 సెక్షన్ ప్రకారం నేరం. కాబట్టి నేరాల పద్దులో అంకెలుగా నమోదు అవుతున్నాయి. ఆత్మహత్యకు ప్రేరేపించడం కూడా సెక్షన్ 306 ప్రకారం అంతే నేరం. అలాంటప్పుడు ఇన్ని లక్షలమంది రైతుల ఆత్మహత్యలకు ప్రేరేపించిన ఎన్ని లక్షలమందిమీద సెక్షన్ 306 ప్రకారం కేసులు పెట్టాలి? ఆ నేరాలు రుజువైతే ఎన్ని లక్షల మంది పదేళ్ళ జైలు శిక్ష అనుభవించాలి?
ఇంతకూ…
అన్నదాతలవి ఆత్మహత్యలా? వ్యవస్థలు చేస్తున్న హత్యలా?
ఆత్మహత్య నేరమే అయితే ఆ నేరాన్ని ప్రోత్సహిస్తున్నది ఎవరు? ఎవరు బాధ్యులు? ఎవరికి వేయాలి శిక్ష? ఎవరు వేయాలి శిక్ష?
“ఏది జీవితమేది మృత్యువు?
ఏది పుణ్యం? ఏది పాపం?
ఏది నరకం? ఏది నాకం?
ఏది సత్యం? ఏదసత్యం?
ఏది కారణమేది కార్యం?
ఓ మహాత్మా! ఓ మహర్షీ!”
-పమిడికాల్వ మధుసూదన్
9989090018
YouTube – ధాత్రి మహతి
Twitter – ఐధాత్రి2
Facebook – ఐధాత్రి తెలుగు
Instagram – ఐధాత్రి తెలుగు

