Thursday, June 11, 2026
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంఓడించారుగా...డబ్బు వెనక్కు ఇవ్వండి!

ఓడించారుగా…డబ్బు వెనక్కు ఇవ్వండి!

ప్రజాస్వామ్యం అంటే ఓట్ల పండుగ. నోట్ల పండుగ. తీసుకున్న నోట్లకు ఓట్లు తేలాల్సిన లెక్కల పండుగ.
నల్గొండ జిల్లాలో ఒక పంచాయతీలో నిజంగానే దేవుడిమీద ప్రమాణం చేయించి లెక్కలు తేల్చే పంచాయతీ పరాజయ పరాభవ లోకోత్తర దృశ్యం తెరలు తెరలుగా వీధుల్లో ఆవిష్కారమవుతోంది.
ఓటు వేయడం కాదు,
ఓటు వేసినట్టు ఒట్టు వేయాల్సిన రోజులు వచ్చేశాయి!

నార్కట్‌పల్లి మండలం ఔరవాణి గ్రామంలో జరిగిన ఈ ఘటన
మన ఎన్నికల ప్రజాస్వామ్య రాజకీయ వ్యవస్థముందు అనేక ప్రశ్నలను సంధిస్తోంది.

సర్పంచ్ ఎన్నికల్లో కల్లూరి బాలరాజుగౌడ్
458 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
ఓటమి జీర్ణం కాలేదు.
డబ్బుల లెక్కలు తేలలేదు.
అందుకే ప్రజాస్వామ్యానికి కొత్త లెక్క మొదలైంది.

“నాకు ఓటు వేశావా?
లేదా నా డబ్బులు తిన్నావా?”
— ఇదీ కొత్త రాజకీయ ప్రశ్నాపత్రం!

ఎన్నికల ముందు ఓటుకు డబ్బు…
ఎన్నికల తర్వాత ఓటుకి ఒట్టు…
ఇదే ఔరవాణి గ్రామంలో నడుస్తున్న
డబుల్ ఎంట్రీ రాజకీయ అకౌంటింగ్.

ఓడిన అభ్యర్థి భార్యను వెంటబెట్టుకుని
ఒక్కో ఇంటి తలుపు తట్టారు.
బ్యాలెట్ పేపర్ అడగలేదు…
బూత్ స్లిప్ అడగలేదు…
నేరుగా కులదైవం మీద ఒట్టు అడిగారు.

“నన్ను నమ్మి ఓటు వేశానని ఒట్టు వేయి…
లేదంటే నా డబ్బులు వెనక్కి ఇవ్వు!”
అన్నది ఇక్కడ ప్రజాస్వామ్య పాఠమిప్పుడు!

చివరికి…చేసేదేమీ లేక కొంతమంది ఓటర్లు తాము తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చారట.

డబ్బులిచ్చి ఓట్లు కొనడం తప్పా?
డబ్బు తీసుకుని ఓటు వేయకపోవడం తప్పా? ఓటుకు నోటును వెనక్కి అడగటం తప్పా? ఏ రాజ్యాంగ నిపుణులు నివృత్తి చేయాలి ఈ ధర్మసందేహాన్ని?

ఔరవాణి ఘటన
ఒక ఊరి పంచాయతీ కథ కాదు.
ఇది మన ఓట్ల రాజకీయాల నిజమైన ముఖచిత్రం.

ప్రజాస్వామ్యం అంటే
ఓటు హక్కు ఎంతో
ఒట్టు హక్కు కూడా అంతే!
ఔనా ఔరా వాణి?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular