Saturday, November 23, 2024

బైక్ రైడింగ్

నిదానమే ప్రధానం.
అతివేగం ప్రమాదకరం.
స్పీడ్ థ్రిల్స్, బట్ కిల్స్.
పరుగెత్తి పాలు తాగడం కంటే- నిలబడి నీళ్లు తాగడమే మంచిది.
భాష ఏదయినా వేగం మంచిది కాదనేదే భావం.

కానీ- నత్తకు నడకలు నేర్పే వేగానికి విలువేముంటుంది? పరుగెత్తాలి. పరుగెత్తుతూనే ఉండాలి. వాయు, మనోవేగాలను దాటి దూసుకుపోవాలి. కంటికి కనిపించనంత వేగంతో కాంతిరేఖగా చీల్చుకుని వెళ్లాలి. దేశం కాని దేశం ఫ్రాన్స్ వీధుల్లో…అర్ధరాత్రి అయినా…ఊపిరి ఆడని…కాలు కదలని వేళ అయినా…తొక్కు సీను…తొక్కు…ఎక్సలేటర్ విరిగిపోయేలా తొక్కాల్సిందే. మేఘాలలో తేలిపోవాల్సిందే. తుఫానులా చెలరేగిపోవాల్సిందే.

ఒక కోట కొడుకు.
ఒక అజారుద్దీన్ కొడుకు.
ఒక బాబు మోహన్ కొడుకు.
ఒక కోమటిరెడ్డి కొడుకు.
ఒక నారాయణ కొడుకు.
ఊరూపేరూ లేకుండా పోయిన ఇంకా ఎందరో కొడుకులు…
బతికి అనుభవించాల్సిన ఎంత ఆయుస్సును వారి వేగం మింగేసిందో? ప్రాణం ఎవరికయినా ప్రాణమే. పుత్ర శోకం ఎవరికయినా గుండె కోతే.

నలభై ఏళ్ల కిందటి వరకు అంబాసిడర్, ఫియట్ కార్లే. అది కూడా పది ఊళ్లకు ఒక కారు కనిపిస్తే గొప్ప. కదిలీ కదలక అంబాసిడర్ కారు మధ్యలో మొరాయిస్తే బానెట్ తెరిచి తడారిన దాని గొంతులో గంగాజలం వేస్తే డుగు డుగు అని మదించిన ఏనుగులా మందగమనంతో వెళ్లేది. స్కూటర్లు, బైకులు కూడా అందరికీ ఉండేవి కావు.

ఇదివరకు రోడ్లు అంటే గుంతలు, కంకర, ఇసుక, బురద, ఎగుడు దిగుళ్లే. దాంతో సాటిలేని శ్రీ మహా విష్ణువు గరుడ వాహనమయినా అసంకల్పితంగా నెమ్మదిగానే వెళ్లేది. ఇప్పుడు రోడ్లు అద్దాలయ్యాయి. పది సెకన్లలో వంద కిలో మీటర్ల వేగం దాటిపోగల విమానం టెక్నాలజీ టర్బో ఇంజిన్ కార్లు, బైకులు లెక్కలేనన్ని వచ్చాయి. అద్దాల్లాంటి రోడ్లమీద వేగం అసూయపడేంత స్పీడ్ గా వెళ్లకపోతే వెధవ మనిషి జన్మే వృథా!

కలవారికి కార్ల మోజు. వారి పిల్లలకు బైకులు మోజు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయదు. చేతిలో డబ్బు. ఒంట్లో ప్రాయం. ఇంట్లో లెక్కలేనితనం. సహజంగా యువకులకు వేగం బలహీనత. ఇతరేతర అలవాట్లు కూడా తోడయితే…ఇక వేగంలో వారి ప్రాణమే ద్రవమై చుక్కల్లో చుక్కగా మిగిలిపోతుందని తెలిసినా వేగం ఆగదు.

ఏ కార్లు, బైకుల ప్రకటనలు చూసినా వేగమే ఒక ఎర. ఇప్పుడు నడి రోడ్డు మీద ఎక్కడ చూసినా డుగ్గు డుగ్గు అని రాయల్ ఎన్-ఫీల్డ్ బండెక్కి వచ్చేత్తా పా… అని ప్రపంచం నర్తిస్తోంది.

బుస్సు బుస్సు అని సుజుకీలు, హోండాలు, పల్సర్లు, బజాజ్ లు, యమహాలు…అతి నాజూకువారు నడిపే కైనెటిక్కులు, నిరుపేదలు నడిపే టీ వి ఎస్ మోపెడ్లు నడిపితే కిక్కేముంది?
సఖిని వెంటబెట్టుకుని డెబ్బయ్ లక్షలు పెట్టి కొన్న కవసాకిలో సాకీలు పాడుకుంటూ యమ వేగంతో వెళితే యముడయినా పక్కకు తప్పుకోవాల్సిందే.
పాతిక లక్షలు పోసి కొన్న హార్లీ డేవిడ్సన్ మీద డార్క్ గ్లాసులు పెట్టుకుని వెళుతుంటే ఎనభై ఏళ్ల పండు ముసలి కూడా పాతికేళ్ల పడుచువాడు అయిపోవాల్సిందే.
డుకాటి, ఫ్యూరీ, డార్క్ హార్స్, రోడ్ మాస్టర్, స్ప్రింగ్ ఫీల్డ్…ఇంకా సవాలక్ష నోరుతిరగని పేర్ల పేరుగొప్ప బైకులు కలవారి గ్యారేజ్ లో కావలి కుక్కలుగా పడి ఉండాల్సిందే.

వేగం సరదా. కార్లతో ఆటలు. బైకులతో విన్యాసాలు. ఒక చక్రాన్ని గాల్లోకి లేపి ఒక చక్రంతోనే బైకు నడిపేవాడు ఒకడు. రెండు చేతులు హ్యాండిల్ మీదినుండి తీసేసి బైకు నడిపేవాడు ఒకడు. కళ్లు మూసుకుని కారు నడిపేవాడు ఒకడు. తాగి నడిపేవారు ఎందరో?
ఒకరి సరదా మరొకరి ప్రాణం తీస్తూ ఉంటుంది. వారి సరదా వారినే మింగేస్తూ ఉంటుంది.

అనుభవాలు పాఠాలు నేర్పాలి. కానీ అనుభవాలు జ్ఞాపకాల పొరల్లో పడిపోతూ ఉంటాయి.

పిల్లలు అల్లరి చేస్తే తల్లిదండ్రులు అట బొమ్మలు కొనిస్తూ ఉంటారు. పిల్లలు సరదా పడితే కారు బొమ్మలు, బైకు బొమ్మలు కొనిస్తూ ఉంటారు. కీ ఇస్తే అవి కాసేపు తిరిగితే తిరగవచ్చు.

పిల్లలు ముచ్చటపడితే ముప్పయ్ లక్షల బైకులు, మూడు కోట్ల కార్లు బొమ్మల్లా కొనిచ్చే గారాల తల్లిదండ్రులున్నారు. వారి సంపద. వారి పిల్లలు. వారి మురిపెం. వారి ఇష్టం. కానీ- ఇంటినుండి తుళ్లుతూ బైకు మీద వెళ్లిన గారాల పట్టి…పి ఓ పి పట్టీలతో ఇంటికొస్తే శోకం ఎవరికి? జింకలా ఎగురుతూ వెళ్లిన చెట్టంత నిటారుగా ఎదిగిన కొడుకు…స్ట్రెచర్ మీద అడ్డంగా పడుకుని వస్తే కన్నీళ్లు ఎవరికి? సంతోషం పంచాల్సిన పిల్లలు సంతాపం మిగిల్చి వెళితే ఓదార్పుకు దిక్కేది?

ఎంత సీ సీ (వాహన చోదక శక్తి) బైక్ అయినా ఇసుక రేణువు పాదధూళికి ఎలా ఎగిరి అవతల పడుతుందో సీ సీ టీవీల్లో చూస్తూనే ఉన్నాం. మనిషికొక పోలీసును పెట్టలేరు. పెట్టకూడదు. పెట్టడం సాధ్యం కాదు. ఆరోగ్యకరమయిన భయమే అనాదిగా సమాజాన్ని ఉన్నంతలో జాగ్రత్తగా నడుపుతూ ఉంటుంది.

కిక్కిరిసిన భారతీయ మహా నగరాల రోడ్ల మీద బతుకు నిత్య నరకం. అందులో ఎంత సీ సీ పెరిగితే ఆ వాహనాలు అంత నరకాతి నరకం- అని తెలుసుకున్నవారు బతికిపోతారు. తెలిసి తెలిసీ సీ సీ పెంచుకునే వారు ఇలా సీ సీ టీవీల్లో దృశ్యాలుగా పలకరిస్తుంటారు.

ఇంతకూ…
తప్పెవరిది?

-పమిడికాల్వ మధుసూదన్

Also Read: ఆడీకి ఆటో లేఖ

Also Read:లైఫ్ లో లైఫ్ ట్యాక్స్ కట్టం

RELATED ARTICLES

Most Popular

న్యూస్