Friday, November 22, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకన్నీటి డోసుల వ్యాక్సిన్ వేదాంతం

కన్నీటి డోసుల వ్యాక్సిన్ వేదాంతం

ఉన్నది ఒకటే. కానీ- రెండుగా కనపడుతుంది. నిజానికి రెండు లేవు. దేవుడు- జీవుడు వేరు కాదు. ఒకటే. అదే అద్వైతం. అద్వైతంలోనే ఉన్నా- మనమున్నది అద్వైతంలోనే అని నమ్మకం కుదరడానికి అద్వైత సిద్ధాంతం అంచులు చూడాలి. మాయ పొర తొలగి పిండాండం- బ్రహ్మాండం అంతా ఒకటిగా కనిపించడానికి పరిపూర్ణమయిన సైద్ధాంతిక అవగాహన అయినా ఉండాలి. లేదా గుడ్డిగా నమ్మనయినా నమ్మాలి. ఇది జీవబ్రహ్మైక్య అహం బ్రహ్మాస్మి అద్వైత చర్చ కాదు. కరోనా- వ్యాక్సిన్ విశిష్టాద్వైత చర్చ.

మోసులెత్తిన జ్ఞాన డోసులు
——————–
వ్యాక్సిన్ ఫార్ములా ఆవిష్కరణ, క్లినికల్ ట్రయల్స్, అనుమతులు, తయారీ, అతిశీతల డబ్బాల్లో నిలువ, రవాణా, పంపిణీ, పని తీరు, పేటెంట్ హక్కులు, ధరలు, లాభనష్టాలు…ఇలా వ్యాక్సిన్లకు సంబంధించిన జ్ఞానం ఇప్పుడు డోసుల కొద్దీ జనసామాన్యం సొంతమయ్యింది. ఒక్క ఫార్మా ఫీల్డ్ వాళ్లకు తప్ప మిగతా అందరికీ వద్దంటే వ్యాక్సిన్ జ్ఞానం.

దూసుకొచ్చిన డోసు గ్యాపులు
——————–
వ్యాక్సిన్ మొదటి డోసు తరువాత నెల రోజులకు రెండో డోసు. ఆపై ఈ గ్యాప్ ఆరు వారాలకు పెరిగింది. రెండు నెలలు. ప్రస్తుతానికి నాలుగు నెలలు అయ్యింది. అవసరార్థం గ్యాపా? సాంకేతికంగా గ్యాపా? ఏదో కమ్యూనికేషన్ గ్యాపా?

డోసినంత దోచుకో
——————
డోసు రేట్లు డోసులే నిర్ణయించుకోవడం యుగధర్మం. ఎందరో దోషులు దోషులను పట్టుకోగా లేనిది- డోసులే డోసుల రేట్లను నిర్ణయించుకోవడంలో అభ్యంతర పెట్టాల్సింది ఏమీ లేదు.

ఏటేటా డోసేసుకోవాలి
——————–
మొదటి డోసుకే దిక్కులేదు- అప్పుడే రెండో డోసా? అని అనుకోకండి. ఎంత దిక్కులేని డోసులయినా ఏటేటా వేసుకోవాల్సిందే. పోయినవారికి ఏటా సంవత్సరీకాలు. ఉన్నవారికి ఏటేటా సంవత్స వ్యాక్సీకరాలు .

స్వజాతి డోసుల విజాతి బాసలు
——————–
ఇది ఎవరికి వారు తెలుసుకోవాల్సిన విషయం. బహిరంగ వేదికల మీద మాట్లాడకూడని బహిరంగ రహస్యం.

ఇది డోసుల వేళయని…
——————–
డోసు దొరికినవారు దోసిట్లో డోసు సాక్షిగా బిక్కు బిక్కుమంటూ ఉంటారు. డోసు దొరకనివారు దోసిలి పట్టి డోసో వ్యాక్సిన్ చంద్రా! అని అలమటిస్తూ ఉంటారు.

డోసులు- దోషులు
——————-
వ్యాక్సిన్ డోసులు మోసులెత్తినా సరిపోకపోవడానికి- సరిపోవడానికి నడుమ దోషులెవరు? డోసుల ఊసులు మూగబాసలుగా మిగలడానికి బాధ్యులెవరు? ఫార్మా కంపెనీలు ప్రభుత్వాన్ని నిర్దేశిస్తాయా? ప్రభుత్వాలు కంపెనీలను ప్రాధేయపడతాయా? ఈ అభావ కవితలో పొయెటిక్ జస్టిస్ ఎక్కడుంది?

కలవారి డోసులు
——————-
ఉన్నవారు విమానం వేసుకుని దుబాయ్ వెళ్లి అత్యుత్తమ ఫైజర్ వ్యాక్సిన్లు పొడిపించుకుని వస్తున్నారు. ఎంత ధర అయినా పెట్టి కొనగలుగుతున్నారు.

కన్నీటి డోసులు
——————
లేని వారికి లేకేమి? ఉన్నాయి- కన్నీటి డోసులు.

-పమిడికాల్వ మధుసూదన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్