ACB-Pipes-Notes :
కర్ణాటకలో ఈమధ్య అవినీతి నిరోధక శాఖ- ఏ సి బి అధికారులు పదిహేను మంది ప్రభుత్వ అధికారుల ఇళ్లల్లో ఏకకాలంలో దాడులు చేశారు. ఆవులించకుండానే పేగులు లెక్క పెట్టగలిగే నిఘా సాఫ్ట్ వేర్లు ఏ సి బి దగ్గర ఉన్నట్లు…ఏ సి బి ఒళ్లంతా కళ్లు చేసుకున్నా కనిపించకుండా అవినీతి సొమ్మును ఎలా దాచుకోవాలో అందులో మునిగి తేలే అధికారులకు దాచుకునే జ్ఞానం ఉంటుంది. ఎవరి జ్ఞానం వారిది. అయితే ఎన్నడూ లేనట్లు ఈసారి ఏ సి బి దాడుల్లో ఇంటి నీటి గొట్టాల్లో కూడా నోట్ల కట్టలు దొరకడంతో అందరూ నోరెళ్లబెట్టారు. పైపులు మధ్యలోకి కోస్తే…అందులో నీళ్లు కాకుండా నోట్లు కట్టలు కట్టలుగా కారుతున్నాయి. సారీ…కురుస్తున్నాయి. ఇది చెబితే అర్థమయ్యేది కాదు. అవినీతి ఎలా పైపుల్లో కుదురుగా గడ్డకట్టి…ఎలా ప్రవహిస్తోందో ఈ వీడియోలో మీరే చూడండి.
బహుశా పైపుల్లో అవినీతిని దాచిన ఆ అధికారులు సివిల్ ఇంజనీర్లు అయి ఉంటారు. ఆయా పైపుల వాల్వులు తెలివిగా ఆపి ఉంటారు. నీళ్లొచ్చే పైపులు, నిధులొచ్చే పైపులు వేరు వేరుగా ఉండి ఉంటాయి.
ఈ లెక్కన అన్ని రాష్ట్రాల్లో ఏ సి బి అధికారులకు సివిల్ ఇంజనీరింగ్, స్ట్రక్చరల్ డిజైనింగ్, ఇంటీరియర్ మెటీరియల్ ఇన్స్టలేషన్ మీద సమగ్రమయిన, సాధికారికమయిన అవగాహన కలిగించాల్సిన అవసరం ఎంతయినా ఉంది. అలాగే ఎయిర్ పోర్ట్ స్కానర్లలో నోట్ల కట్టలను పసి గట్టినట్లు పైపుల్లో, ఫాల్స్ సీలింగుల్లో దాచిన నోట్ల కట్టలను పసిగట్టగలిగే స్కానర్లు ఏ సి బి లకు అందుబాటులో ఉండాలి.
దాసరి లంచావతారం సినిమాలో ఒక్కో లంచం మొత్తానికి ఒక స్పూన్ తలపాగాలో చేరుతూ ఉంటుంది. ఒక దశలో తలపాగా పట్టనన్ని స్పూన్లతో తల బరువెక్కుతుంది. ఆ సినిమాలో అవినీతి డబ్బు అందినట్లుగా స్పూన్ సంకేతం. దశాబ్దాల క్రితమే అవినీతి చెంచాల మీద అంత సృజనాత్మకంగా సినిమా తీసిన దాసరి అభినందనీయుడు. ఇప్పుడలా సినిమా తీయాలంటే లోకంలో ఉన్న చెంచాలు, గరిటెలు చాలనే చాలవు.
కాన్సెప్షువల్ గా అవినీతి నిరోధక శాఖ పేరు బాగానే ఉంది కానీ…అవినీతి జరుగుతున్నప్పుడు పట్టుకుంటేనే అది అవినీతి నిరోధక శాఖ అవుతుంది. జరిగిన తరువాత పట్టుకుంటే అది అవినీతి విచారణ శాఖ అవుతుంది. భావంలో స్థూలంగా రెండూ ఒకటే కాబట్టి ఇందులో వర్తమాన, భూతకాలిక క్రియా పదాల జోలికి వెళ్లకూడదు.
అయినా…
అవినీతి కాలాతీతం. గతంలో ఉంది. వర్తమానంలో ఉంది. భవిష్యత్తులో ఉంటుంది.
ఇకపై ఏ సి బి టీముల్లో సివిల్ ఇంజనీర్లకు, ఐ టి ఐ చదివిన కట్టర్లు, వెల్డర్లకు కూడా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దొరుకుతాయి.
ఇంజనీర్లకు, ఇంటీరియర్ డిజైనర్లకు అవినీతి అధికారులు కొత్త కొత్త ఐడియా పాఠాలు చెప్పగలుగుతారు.
పైపే కదా అని కోస్తే…
నోటు చిరుగుతుంది. జాగ్రత్తగా కోయాలి. అప్పుడు బిందెల్లో, బక్కెట్లలో నోట్లు జల జలా… బిర బిరా నిండుతాయి.
ఈ చల్లటి పైపులో
ఏ కట్టలు దాగెనో?
ఈ తెల్లని గోడలో
ఏ వజ్రము దాగెనో?
-పమిడికాల్వ మధుసూదన్
Also Read :