Saturday, November 23, 2024

వంచనా శిల్పం

Shilpa Chowdary Scam:
శిల్పా చౌదరి వంద కోట్లకు జనాన్ని ముంచిందని, బాధితులు ఇంకా చాలా మంది ఉన్నారని, వారందరినీ వంచించిన మొత్తం రెండు వందల కోట్ల పైనే ఉంటుందని అంటున్నారు. విలువ లేని సున్నాలదేముంది? చేయిదాటిన సున్నాలు శూన్యంలో కలిసిపోతాయి. గోడకేసిన సున్నం, చేయి దాటిన సున్నం ఎన్నటికీ తిరిగిరాదు.

శిల్పా చౌదరి ఎవరు? ఉపోద్ఘాతం లేకుండా శిల్ప ఎలా తెలుస్తుంది? అన్నవి అర్థం లేని ప్రశ్నలు. చదువు సంధ్యలు లేకుండా…అమోఘమయిన చదువు సంధ్యలున్న ఎందరినో వంచించగలిగిందంటే శిల్ప వంచనా శిల్పానికి ఉపోద్ఘాతం ఎందుకు? శిల్ప భర్త ఇంకా ఘనుడు. పెనం మీద అట్లు వేయకుండానే…జర్మనీ దోసెలను అమ్మగలిగాడు. నార్సింగి రోడ్డు పక్కన అమ్మే రెండు వేల ఇనుప పెనాన్ని ఇరవై అయిదు వేలకు అమ్మి…ఎందరికో పిండి లేని జర్మనీ దోసెల రుచి చూపించగలిగాడు.

ఐ ఐ ఎం లు, హార్వర్డ్ లు, స్టాన్ఫోర్డ్ లు, లండన్ ఎకనమిక్ స్కూల్స్ అర్జంటుగా హైదరాబాద్ నార్సింగ్ కు రావాలి. ప్రపంచ ప్రఖ్యాత బిజినెస్ స్కూల్స్ శిల్పా చౌదరి, ఆమె భర్త ముందు పద్మాసనం వేసుకు కూర్చుని, బుద్ధిగా పలకా బలపం పట్టుకుని వ్యాపార పాఠాలు నేర్చుకోవాలి.

నార్సింగి శిల్ప దంపతులు నయా పైసా పెట్టుబడి లేకుండా రెండు లేదా మూడు వందల కోట్లు కొల్లగొట్టే దాకా మోసపోయినవారందరూ పెద్దవారే. బాగా చదువుకున్నవారే. పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నవారే. బయటికి చెప్పుకోలేని వారు ఇంకెందరున్నారో తెలియదు. బయటపడ్డ శిల్పలు మాత్రం ఒకరిద్దరే ఉంటారు. జర్మనీ పెనం మీద అత్యాశల అట్ల కాడ కాల్చి వాతలు పెడుతుంటే తనివితీరా ఆ వాతలు కోరి కోరి వేయించుకున్నవారు ఉన్నంతవరకు…పెనాలు అమ్మేవారు ఉంటారు.

ఈజీ మనీకి, విలాసాలకు అలవాటు పడి జనాన్ని దోచిన శిల్ప మొదటి వ్యక్తీ కాదు. చివరి వ్యక్తీ కాదు. చిట్టీలు వేస్తూ ఉడాయించిన శిల్పలు, రియల్ ఎస్టేట్ వెంచర్ల పేరిట ముంచిన శిల్పలు, అధిక వడ్డీ ఆశ చూపి వేల కోట్లు వసూలు చేసి అదృశ్యమయ్యే శిల్పలు వీధికొకరు. ఊరికి వందమంది.

నిజానికి…
ప్రస్తుత కిట్టీ పార్టీ శిల్పా చౌదరి, జర్మనీ పెనాల ఆమె భర్త మోసాలు బయటపడ్డం వల్ల జాగ్రత్త పడేవారు ఎందరుంటారో గానీ- ఈ దంపతుల మోసాలను ఆదర్శంగా తీసుకుని ఆ దారిలో నడిచేవారు మాత్రం చాలా మంది ఉంటారు. జర్మనీ పెనం పేరు మార్చుకుని అమెరికా పెనం అవుతుంది. శిల్ప పేరు మారి కల్ప అవుతుంది. మోసం మాత్రం మారదు. అత్యాశ మాత్రం ఆగదు. ఇది నార్సింగ్ దగ్గర ఖరీదయిన సిగ్నేచర్ విల్లాల్లో జరిగిన అతి ఖరీదయిన మోసం. అత్యాశ బలహీనతల నార్సింగుల సిగ్నేచర్ విల్లాలు ప్రతి ఊళ్లో ఉంటాయి. అక్కడ మోసం పాటలకు రెడీమేడ్ ఆటో సిగ్నేచర్ ట్యూన్ లు కడుతూనే ఉంటారు. ఇదొక అంతులేని వంచనా శిల్పం.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

మాయమైపోతున్నడమ్మా మనిషన్న వాడు

RELATED ARTICLES

Most Popular

న్యూస్