Monday, November 25, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంకరోనా వేళ కొల్లలు కొల్లలుగా విల్లులు!

కరోనా వేళ కొల్లలు కొల్లలుగా విల్లులు!

తాగే నీరు లీటర్ల లెక్కన కొన్నప్పుడు కలికాలం అనుకున్నారు.
పీల్చే గాలి సిలిండర్లలో కొంటున్నాం.
కలివిలయ కాలం.

ఇది వరకు వైద్య విద్య చదివి తెల్లకోటు వేసుకుంటేనే మెడలో స్టెత స్కోప్ ఉండేది. థర్మామీటర్, ఆక్సీ మీటర్లు డాక్టర్లే వాడేవారు.

ఇప్పుడు అందరూ గుండె కొట్టుకుంటూ ఉందో లేదోనని గడియకొకసారి చెక్ చేసుకుంటున్నారు. థర్మా మీటర్ సరేసరి. వేళ్ళకు ఆక్సీ మీటర్ ఉంగరంలా కొత్తగా తోడయ్యింది. అందులో మీటర్ 95 దాటి ఉంటే-మనం ఉన్నట్లు. 90 లోపు ఉంటే మనం పోతున్నట్లు అని సామాన్యులకు కూడా ప్రాణవాయువులో ప్రాణస్పందన తెలిసిపోతోంది.

ఈరోజుకు నిన్న గతం.
రేపు ఈరోజుకు ఆగతం.
ఈరోజుకు ఎల్లుండి అయోమయం.
ఈరోజుకు వచ్చే నెల అగమ్యగోచరం.
కరోనా దెబ్బకు కాలచక్రం తిరుగుతున్నా తిరగనట్లే ఉంది.

మనం తిరగకపోయినా కరోనా చక్రాలతో కాలం ఏడాది తిరిగినట్లే ఉంది. ఇంకెంత? ఇంకో రెండేళ్లలో కరోనా అంతమై- అనాది కాలపు ఆనందాలు మళ్లీ వస్తాయని ఆశాజీవుల పాజిటివ్ నమ్మకం.

ఒక తరం అంటే ముప్పయ్ ఏళ్లు అయితేగానీ కరోనా పోయేలా లేదన్నది నిరాశాజీవుల నెగటివ్ నమ్మకం. పాజిటివ్ పాజిటివ్ కాదు- నెగటివ్ నెగటివ్ కాదన్నది వేదాంతుల నమ్మకం.

కరోనా వేళ పాజిటివ్ పరమ నెగటివ్.
నెగటివ్ పరమోత్కృష్ట పాజిటివ్.
ఉండేదెవరు? పోయేదెవరు?
ఏది నెగటివ్? ఏది పాజిటివ్?
అంతా మిథ్య- ఈరోజుకు ఉన్నాం.
రేపు ఉంటామని గ్యారెంటీ లేదు.
ఎల్లుండి తెలియదు. ఎందుకొచ్చిన గొడవ? అని ధనవంతులు ఆస్తి పాస్తుల పంపకాలు, లీగల్ గా విల్లు రాయడాలు చేస్తున్నారు.

దేశవ్యాప్తంగా ఇన్నేళ్లలో సగటు విల్లులు రాయడాలతో పోలిస్తే కరోనా సంవత్సరంలో రాసుకున్న విల్లులు మూడింతలు పెరిగాయి. వందల, వేల కోట్ల ఆస్తులు సంపాదించి, లండన్లో, దుబాయ్ లో, అమెరికాలో దాచి…చివరకు కరోనాతో టపీమని పోతే – పిల్లలు ఆ ఆస్తులకోసం జుట్లు పట్టుకోవడం కంటే – బతికి ఉండగానే పంపకాలను లీగల్ గా విల్లు రాసి పెట్టడం అన్నివిధాలా శ్రేయస్కరమని అనుకుంటున్నారు.

“పుట్టినవాడికి మరణము తప్పదు”

అని భగవద్గీత చెప్తూనే ఉన్నా ఇన్నేళ్లలో ఎవరూ వినలేదు. మృత్యు సిద్ధాంతాన్ని, మృత్యు వ్యాకరణాన్ని కరోనా కావాల్సినదానికంటే ఎక్కువగా బోధించింది. పోవడం గ్యారెంటీ అయినప్పుడు- వెనకో ముందో విల్లు రాస్తే తప్పేమిటి? అన్నది కూడా ఒక పాయింటే. ఇప్పటికే రాసి పెట్టిన విల్లులను కొందరు రీ రైట్ చేస్తున్నారు. ఇప్పటిదాకా విల్లు రాయనివారు అర్జంటుగా రాసేస్తున్నారు.

“Where there’s a will there’s a way” అని ఆత్మవిశ్వాసమే విల్లుగా ఎక్కు పెట్టి ఎంతటి లక్ష్యాన్నయినా ఛేదించవచ్చని చెప్పేవారు. కరోనా వేదాంతంలో ఆ సామెత వరుస మార్చి-

“Where there’s no will there’s a legal will” అని చెప్పుకోవాల్సి వస్తోంది!

భయపెట్టే కరోనా బతికి ఉండగానే ఉత్తర క్రియలను అలవాటు చేస్తోంది. వెంటాడే కరోనా బతికి ఉండగానే చనిపోయాక చేయాల్సిన పనులను అలవాటు చేస్తోంది. పాపం ఎల్ ఐ సి ఏజెంటు! నువ్ పోతే నీ కుటుంబానికి ఈ పాలసీ ఉపయోగపడుతుంది-అని అమంగళం చెప్పలేక దశాబ్దాలుగా నలిగిపోయాడు.

ఇప్పుడు కరోనా అమంగళాన్ని విల్లుగా రాసి పసుపు పెట్టి పోకముందే పోయిన తరువాతి పంపకాలను పత్రంగా పంచి పెడుతోంది. అమంగళము ప్రతిహతమగుగాక!

-పమిడికాల్వ మధుసూదన్

RELATED ARTICLES

Most Popular

న్యూస్