Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంభాగ్యవంతుల బాధ

భాగ్యవంతుల బాధ

Open Letter:
హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ గారికి బహిరంగ లేఖ:-

అయ్యా,

వరుసగా కొన్ని రోజులనుండి మీడియా వార్తలు మమ్మల్ను అవమానపరుస్తున్నాయి. మా మనోభావాలను దెబ్బ తీస్తున్నాయి.

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యాపారి టోనీ దగ్గర మత్తు పదార్థాలు రెగ్యులర్ గా కొంటున్న ప్రముఖ వ్యాపారవేత్తల జాబితాలో మా పేర్లు లేకపోవడంతో మాకు జరుగుతున్న సామాజిక, రాజకీయ, ఆర్థిక, మానసిక కష్టనష్టాలను మీ దృష్టికి తీసుకువస్తున్నాము.

వేల కోట్ల తెలుపు- నలుపు వ్యాపారాలు చేసే మాకు టోనీతో సంబంధాలున్నట్లు తెలిస్తే ఆయా సర్కిల్స్ లో మా స్టేటస్ పెరిగేది. మమ్మల్ను ప్రముఖ వ్యాపారవేత్తలుగా గుర్తించేవారు.

జంధ్యాల ఎగతాళిగా చెప్పినట్లు…భోంచేసినప్పుడు ఒక జర్దా కిళ్లీ…కిళ్లీ నములుతున్నప్పుడు ఒక సిగరెట్టు…సిగరెట్టు కాలుస్తున్నప్పుడు ఒక బాటిల్…బాటిల్ మూత ఓపెన్ చేసినప్పుడు జూద, వేశ్యాగృహాల వెంట వెళ్లడం తప్ప ఏ ఇతర అలవాట్లు లేని మమ్మల్ను మా పనివాళ్లే మనుషులుగా గుర్తించడం లేదు.

అయిదు వేల కోట్ల ఆస్తికి అన్ని అసలు సిసలు డాక్యుమెంట్లు చూపితే మొన్న పెళ్లిచూపుల్లో అమ్మాయి వేసిన ప్రశ్నకు అక్కడే ఫ్యాన్ కు ఉరేసుకుని చావాలనిపించింది. అంతా ఒకే కానీ…అడిగిన వెంటనే టోనీ దగ్గరనుండి టెన్ గ్రామ్స్ స్టఫ్ తెచ్చే ఇది ఉందా? లేదా? అంది. ఎవరికి చెప్పుకోవాలి సార్ మా బాధ?

మా ఇంటి డాబా మీద థాంక్ గాడ్ ఇట్స్ ఏ డే అని రోజూ పార్టీలు చేసుకుంటూ ఉంటాం. నార్త్, సౌత్, వెజ్, నాన్ వెజ్, లిక్కర్ చుక్కలు అన్నీ పెట్టాము. టోనీ పౌడర్ లేదని ముక్కుపచ్చలారని పిల్లలు మొహం చిన్నబుచ్చుకుని ఏమీ తినకుండా, తాగకుండా వెళ్లిపోయారు. మా పిల్లల బాధ చూస్తే కడుపు తరుక్కు పోదా సార్?

Drugs

మొన్న ఈశాన్య రాష్ట్రాల్లో మా సొరంగం పనుల బిల్లు వచ్చిందని ఇక్కడ మా శామీర్ పేట్ ఫార్మ్ హౌస్ లో పార్టీ పెడితే ఎంత గొడవయ్యిందనుకున్నారు?  అంతకుముందు మామూలు బిల్లుకే మేము లోకల్ మాదక ద్రవ్యాలను వడ్డించామట. సొరంగం బిల్లు పెద్దది కదా? టోనీ తెల్లపొడి ఉంటుందనుకుని లాక్ డౌన్ ఆంక్షలను కూడా తుంగలో తొక్కి వచ్చారు. తీరా డైరక్టర్స్ స్పెషల్, బ్లాక్ లేబుల్ లాంటివే అని తెలిసి…ఇంకెప్పుడూ ఇలా మమ్మల్ను అవమానించకండి అని మొహమ్మీద ఉమ్మేసి పోయారు. పరువు గల కుటుంబాల వాళ్లం. ఎవరికి చెప్పుకోగలం సార్?

మేమొక రోజు శ్రీశైలంలో కార్తీక దీపం వెలిగించడానికి వెళ్లాం. ఇంటర్ అయి ఇంట్లో కూర్చున్న మా అబ్బాయి ఆకలయి జూబ్లీహిల్స్ మెట్రో పిల్లర్ కింద చీకట్లో పది గ్రాములు కొకైన్ కొంటూ దొరికాడని ఫోన్ వస్తే…తల కొట్టేసినట్లయ్యింది. వేల కోట్ల ఆస్తికి ఏకైక వారసుడు వాడు. చీకట్లో పది గ్రాములు కొనడానికి వాడు వెళ్లడమేమిటి? టోనీతో సంబంధాలు ఉండి ఉంటే ఇంట్లోనే గోధుమ పిండి డబ్బా పక్కన టోనీ తెల్ల పిండి డబ్బా కూడా పెట్టుకునేవాళ్లం కదా? వుయ్ ఆర్ నాట్ బెగ్గర్స్ సార్. వుయ్ ఆర్ టాక్స్ పేయర్స్ ఆఫ్ దిస్ బ్లడీ కంట్రీ యూ నో! వాట్ ది హెల్ ఈజ్ గోయింగ్ ఆన్?

మీ డ్యూటీ మీరు చేసుకోండి. మా డ్యూటీ మేము చేసుకుంటాం. చట్టం తన పని తాను చేసుకుంటూ…మా పని కూడా చేసి పెడుతుందని మాకు అపారమయిన నమ్మకముంది. తెల్లపొడి టోనీతో మా ఫోటోలు లేకపోవడం వల్ల సమాజంలో నలుగురు నాలుగు రకాలుగా మమ్మల్ను చులకన చేస్తున్నారు. ఈ అమాదక అవమానాలు మా వ్యాపార అవకాశాలను కూడా బాగా దెబ్బ తీస్తున్నాయి. పెద్ద పెద్ద బిజినెస్ సర్కిల్స్ లో అంటరానివాళ్లం అవుతున్నాం. ఈ అంటరానితనం అనేది ఏదయితో ఉందో…అది మహా పాపం! ఘోరం! నేరం!

కాబట్టి ఏడాదికి వెయ్యికోట్ల పైన సంపాదించే భాగ్యనగర భాగ్యవంతులందరికీ టోనీతో పరిచయభాగ్యం కలిగించాలని…సమాన అవకాశాల లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ క్రీడా స్ఫూర్తిని కాపాడాలని క్రీడాకారుడు కూడా అయిన మిమ్మల్ను ప్రార్థిస్తున్నాం.

ఇట్లు,
టోనీ పరిచయాపేక్ష భాగ్యనగర భాగ్యవంతుల సంఘాల ఉమ్మడి కార్యాచరణ ఐక్య వేదిక- టో ప భా భా సం ఉ కా ఐ వే

-పమిడికాల్వ మధుసూదన్

Also Read : అవార్డులకు గులాం

RELATED ARTICLES

Most Popular

న్యూస్