Saturday, November 23, 2024
Home'ఐ'ధాత్రి ప్రత్యేకంపదవి పోయె...పార్టీ కూడా పోయె...

పదవి పోయె…పార్టీ కూడా పోయె…

Devendra Fadnavis : మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు, ఠాక్రేల చేజారిపోతున్న శివసేన, ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు ఉప ముఖ్యమంత్రిగా పనిచేయడం…లాంటి అనేకానేక వార్తలు, వ్యాఖ్యలు, చిత్రాలు, సంపాదకీయాలతో పాఠకులను, ప్రేక్షకులను మీడియా ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. పైకి కనిపించే కారణాలు వేరు. లోపల జరిగింది వేరు. అసలు సంగతి ఏమిటో తెలుసుకోవాలంటే ఈనాడు, సాక్షి పత్రికల పాకెట్ సైజ్ చిన్న కార్టూన్లు చూస్తే చాలు. పాలు తాగే పసి పిల్లలకు కూడా మహారాష్ట్రలో జరిగింది ఏమిటో? ఇక జరగబోయేది ఏమిటో? అర్థమైపోతుంది.

Devendra Fadnavis

ఈనాడు మొదటి పేజీలో అర పేజీ ప్రకటన ఉండడం వల్ల పాకెట్ కార్టూన్ లోపలి పేజీలో అప్రధానం అయిపోయింది. లేకపోతే షిండే, ఫడ్నవిస్ ప్రమాణ ప్రమాణస్వీకారం వార్తతో పాటు మొదటి పేజీలోనే ఉండాల్సిన కార్టూన్ ఇది. ఉప ముఖ్యమంత్రిగా ఫడ్నవిస్ అతి పెద్ద సింహాసనం మీద దర్జాగా కాలు మీద కాలు వేసుకుని కూర్చుని విలాసంగా ఉండగా…వెనుక ఎక్కడో చిన్న కుర్చీలో ముఖ్యమంత్రి షిండే వినయంగా, చేతులు కట్టుకుని, బెరుకు బెరుకుగా కూర్చుని ఉన్నారు. వెయ్యి సంపాదకీయాలతో సమానమయిన మాటలు అవసరం లేని కార్టూన్ ఇది. మహారాష్ట్ర భవిష్యత్ ప్రభుత్వ పాలనా చిత్రమిది.

సాక్షిలో మొదటి పేజీ కార్టూన్ ఇది. “ఎవరు తిరుగుబాటు చేస్తే వారే సి ఎం. ఈ స్కీమ్ ఏదో బాగుందే!”
అని కింద కామెంట్. నిజానికి మహారాష్ట్రలో జరిగింది ఇదే. ఇందులో మాటలు మోయలేనన్ని కుట్రలు, కుయుక్తులు, దీర్ఘకాలిక ఎత్తుగడలు, పాత పగలకు ప్రతీకారాలు, గుణపాఠాలు…ఇంకా ఎన్నెన్నో దాగి ఉన్నాయి. అర్థమయినవారికి అర్థమయినంత.

ఇప్పుడు అసలు విషయంలోకి వెళదాం. సంఖ్యాపరంగా శివసేన చీలికర్గం కంటే బి జె పి కే అసెంబ్లీలో సీట్లు ఎక్కువ. అలాంటిది ఫడ్నవిస్ ను ఉప ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టి…షిండేను ముఖ్యమంత్రిని చేయడంలో మోడీ- అమిత్ షా చాణక్య నీతి దాగి ఉంది.

 Devendra Fadnavis

1. బాల్ ఠాక్రే స్థాపించిన శివసేనకు బి జె పి వెన్నుపోటు పొడిచింది. నన్ను బి జె పి బజారుపాలు చేసింది అని ఉద్దవ్ ఠాక్రే క్లెయిమ్ చేసుకుని సానుభూతి పొందడానికి వీల్లేకుండా…షిండే తిరుగుబాటుగా చూపించదలుచుకున్నారు.

2. షిండే చీలిక వర్గం జారిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత షిండే మీదే ఉంటుంది.

3. పేరుకు షిండే ముఖ్యమంత్రి అయినా…రిమోట్ కంట్రోల్ మొత్తం ఉప ముఖ్యమంత్రి ఫడ్నవిస్ చేతిలోనే ఉంటుంది.

4. అతివాద హిందూ భావజాలానికి కేరాఫ్ అడ్రస్ అయిన శివసేనను ఉద్దవ్ కాంగ్రెస్, ఎన్ సి పి కాళ్ల దగ్గర పెట్టడం వల్లే ఈ తిరుగుబాటు తప్పనిసరి అయ్యిందని ఒక సిద్ధాంతాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చు.

5. భవిష్యత్తులో శివసేనను పూర్తిగా బి జె పి లోకి విలీనం చేసేసుకోవచ్చు. ఉద్దవ్ కు పోయింది పదవి కాదు. చేజారింది పార్టీ.

6. ప్రస్తుత బి జె పి తో పెట్టుకుంటే ఎవరయినా ఉద్దవ్ లా దిక్కూ మొక్కూ లేక ఇలా శంకరగిరి మాన్యాలు పట్టుకుని పోవాల్సిందేనని ఒక బలమయిన సందేశం ఇవ్వదలుచుకున్నారు.

7. ప్రాంతీయ పార్టీల్లో ఎవరయినా ఇలా షిండేలా పార్టీని నిలువునా చీలిస్తే…వెను వెంటనే ముఖ్యమంత్రిని చేస్తామని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు.

ఇంకా అర్థం కాకపొతే…మరొక్కసారి ఈనాడు, సాక్షి కార్టూన్లను తరచి చూడండి. పాలకు పాలు, నీళ్లకు నీళ్లలా అన్నీ విడి విడిగా బయటపడతాయి.

అన్నట్లు-
ఉద్దవ్ తండ్రి బాల్ ఠాక్రే గొప్ప గొప్ప పొలిటికల్ కార్టూన్లు వేశాడు. ఉద్దవ్ కూడా గొప్ప ఫోటోగ్రాఫర్. ప్రకటనలు తయారు చేసే యాడ్ ఏజెన్సీని కూడా నడిపారు. ప్రకటనలో ప్రకటించని విషయాలెన్నో మిగిలిపోయి ఉంటాయి. అవేమిటో ఇప్పుడు ఉద్దవ్ కు తెలిసి ఉంటాయి.

రంగు వెలిసిన చిత్రానికి విలువ లేదు.
వరద పొంగు మిగిల్చిన విషాదానికి భాష లేదు.

-పమిడికాల్వ మధుసూదన్

Also Read :

జనతా గ్యారేజ్

RELATED ARTICLES

Most Popular

న్యూస్