Costly (Silly)Comments:
“ఊరికే ఉన్న ప్రాణానికి ఉరేసుకోవడం”
ఎలాగో తెలియాలంటే కాంగ్రెస్ సీనియర్ లీడర్లను అడగండి చెప్తారు. ఒకపక్క రాహుల్ గాంధీ రోడ్లమీద పడి కనిపించిన ప్రతి గుడికి తడి వస్త్రాలతో వెళ్లి, భక్తిగా హారతి కళ్లకద్దుకుని…హిందూ వ్యతిరేక ముద్రను చెరిపేసుకోవడానికి పొర్లు దండాలు పెడుతుంటే…కాంగ్రెస్ సీనియర్ లీడర్, కేంద్ర మాజీ హోమ్ మంత్రి శివరాజ్ పాటిల్…రాహుల్ కష్టాన్ని గంగపాలు చేయడానికి కంకణం కట్టుకున్నారు.
శివరాజ్ పాటిల్ గారి దివ్యజ్ఞానం ప్రకారం-
“శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన భగవద్గీత జీహాద్ అట.
అన్ని రకాలుగా పోరాడిన తరువాత ఎలాంటి లాభం లేకపోతే “జీహాద్”కు వెళ్లాలని కేవలం ఖురాన్లోనే కాదు…మహాభారతంలో కూడా ఉందట.
కలంతో రాసి ప్రయోజనం లేనప్పుడు కత్తితో చరిత్రను రాయడం తప్పు కాదట”
(Video Courtesy: Hindustan Times)
వెనకటికి ఒక టీచర్ యాభై మంది పిల్లలున్న క్లాసు రూములో చాక్ పీస్ చూపించి…దీన్నేమంటారు? అని అడిగితే…
నలభై అయిదు మంది చాక్ పీస్ అన్నారు.
ఇద్దరు డస్టర్ అన్నారు.
ముగ్గురు ఏమో తెలియదన్నారు.
చాక్ పీస్ అన్న నలభై అయిదు మందికి చాక్ పీస్ తెలుసు. డస్టర్ అన్న ఇద్దరికి అటు చాక్ పీసూ తెలియదు; ఇటు డస్టరూ తెలియదు.
సేమ్…అలాగే ఉంది శివరాజ్ పాటిల్ వ్యవహారం. తనకు ఖురానూ, గీతా రెండూ తెలియవని ఆయనే లోకానికి చెప్పదలుచుకున్నట్లున్నారు. లేక తెలిసి ఉద్దేశపూర్వకంగానే గీతను కించపరచాలని విపరీతార్థాలు వెతుకుతూ అయినా ఉండాలి.
గుజరాత్ ఎన్నికల వేళ గుజరాత్ గడ్డ మీద ఆయన గీతలో జీహాద్ బోధను ఆవిష్కరించడంతో కాంగ్రెస్ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. జయరాం రమేష్ వెంటనే పాటిల్ వ్యాఖ్యలను ఖండించారు. అది పార్టీ అభిప్రాయం కాదని చెప్తూ డిస్కవరీ ఆఫ్ ఇండియాలో “గీత విశ్వజనీనం” అన్న నెహ్రు మాటలను ప్రస్తావించారు.
అవతలివారు ఆయుధాలు ఇవ్వకుండానే…ఆయుధాలను అందిపుచ్చుకోగల బి జె పి దీన్ని ఎందుకు వదిలిపెడుతుంది?
గుజరాత్ లో ఒక వర్గం ఓట్లను రాబట్టుకోవడానికి భగవద్గీతను, పరమ పవిత్ర హిందూ మత గ్రంథాలను ఇలా నీచంగా వక్ర భాష్యాలతో అవమానిస్తారా? ఎప్పటికీ మారరా? అని ఈ గీత చెరిగిపోకుండా సజీవంగా ఉంచడానికి వారి ప్రయత్నం వారు చేస్తున్నారు.
అదే గుజరాత్ గడ్డ మీద ముఖ్యమంత్రిగా ఉన్న మోడీని కాంగ్రెస్ అధినేత్రి మౌత్ కా సౌదాగర్- మృత్యు బేహారి అనడంతో…ఆయన ప్రధాన మంత్రి అయ్యారు. అదే గుజరాత్ గడ్డ మీద ఏవన్నా కాంగ్రెస్ కు నూకలు మిగిలి ఉంటే…వాటిని కూడా మిగల్చకుండా తుడిచిపెట్టడానికి పాటిళ్లు పాటుపడుతూ ఉంటారు.
అంతేలే…
ఆవు చేలో మేస్తుంటే…
దూడ గట్టున మేస్తుందా?
రాజకీయరంగంలోనే పాండిత్యం ప్రకోపించి వెర్రి తలలు వేస్తుందని అనుకోవడానికి వీల్లేదు. అజ్ఞానం మీద ఏ రంగంలో ఎవరికయినా పేటెంట్ ఉంటుంది. మార్కండేయ కట్జూ అని ఒక రిటైర్డ్ న్యాయమూర్తి ఉన్నారు.
“వాల్మీకి రామాయణం రాసినప్పుడు రాముడు దేవుడు కాదు- తరువాత రెండు వేల సంవత్సరాలకు అవధిలో తులసీదాసు రామచరిత మానస్ రాసే సరికి రాముడు దేవుడయ్యాడు” అని ఎవరూ అడక్కుండానే మార్కండేయ స్వాములవారు తీర్పు చెబుతున్నారు.
“మనిషి, కోతి నా దృష్టిలో గడ్డిపరక కంటే నీచం కాబట్టి…మనిషి, కోతి కాకుండా…ఇంకెవరి చేతిలో నేను చావకూడదు” అని రావణుడు కోరుకున్న, బ్రహ్మ సరేనన్న వరం. కాబట్టే విష్ణువు మనిషి(రాముడు)గా; శివుడు కోతి(హనుమ)గా వచ్చారన్న చిన్న లాజిక్ పాయింట్ ను అంత పెద్ద జడ్జి గారు ఎందుకు మిస్సవుతున్నారో?
అదే వాల్మీకి రామాయణం ఉత్తరకాండలో బ్రహ్మ అయోధ్యకు వచ్చి…స్వామీ! చాలా కాలమయ్యింది…
రామావతార ప్రయోజనం నెరవేరింది….మీరు వైకుంఠం వదిలి… మళ్లీ విష్ణువుగా వైకుంఠానికి రండి…
అని అడిగిన విషయం కట్జూ గారికి ఎవరు చెప్పాలి.
సాక్షాత్తు రాముడు- బ్రహ్మ- వాల్మీకి వచ్చి చెబితే తప్ప వినరేమో ఇలాంటివారు!
-పమిడికాల్వ మధుసూదన్
Also Read :
Also Read :