Sunday, November 24, 2024

మనసున్న పులి

The tallest personality: ఈ అనుభవం నేను తెలుగులోనే రాయగలను. ఆనందం అర్ణవమైతే అనుభూతి అంబరమైతే, గుండె పలికే భావాన్ని సొంత భాషలో చెప్తేనే తృప్తిగా ఉంటుంది. ఇదీ అలాంటి సందర్భమే…తెలుగులాంటి తీయదనమే.

ఎప్పుడో 1983 లో హిందూ స్పోర్ట్స్ కాలం చదువుతూ ‘175 కొట్టాడురా కపిల్ దేవ్…వీడు సామాన్యుడు కాదు’ అని నాన్న గొప్పగా చెప్పినప్పుడు, నాన్నే ఒప్పుకున్నాడంటే కపిల్ దేవ్ నిజంగా దేవుడే అనుకున్నా. నాలో ఇప్పటికీ అదే భావన. కాలం ఆగిపోవడం అంటారు… అలాంటిదే. భారత దేశ క్రికెట్ చరిత్రను తిరుగులేని మేలి  మలుపు తిప్పిన 175 రన్నుల కపిల్ ఇన్నింగ్స్  ఆ రోజు 1983 జూన్ 18 న  స్టేడియంలోని వాళ్ళు తప్ప మరెవ్వరూ చూడలేదు. వీడియో రికార్డ్ అవలేదు. బీ.బీ.సి రన్నింగ్ కామెంటరీ కూడా ఇవ్వలేదు. ఆరోజు బీ.బీ.సి ఉద్యోగులు స్ట్రైక్ లో ఉన్నారట. కారణం ఏదైనా, బీ.బీ. సి ని నేను క్షమించక పోవడానికి ఉన్న ఎన్నో కారణాల్లో ఇదీ ఒకటి.  నా మటుకు, నా క్రికెట్ కపిల్ దేవ్ తో మొదలై ధోనీతో ఆగి పోయింది.

‘నువ్వు మరీనూ … సచిన్లూ విరాట్లూ లేరా ఏంటి …’ అంటారా.. అది మీ ఇష్టం. మీతో నాకెలాంటి వైరమూ లేదు. నాకు తెలిసిన క్రికెట్ ఆటగాళ్లు ఇద్దరే.. కపిల్ దేవుడూ. ధోనీ మహేంద్రుడూ. నేను ఫాసిలీకరణ (fossilization) చెందాననుకోండి. పొగరనుకుంటారా.. సరే, నన్ను  పొగిడారనుకుంటా… అదో ఆనందం. ఇలాంటి ఆనందాలే నన్ను మనిషిని చేస్తాయి. ఇద్దరిలోనూ నాకు నచ్చిన అంశాలు…ఆకాశాన్ని తాకుతూ కూడా నేల మీద నడవడం. జట్టుని ముందుండి నడపడం. నమ్మడం. దేశం కోసం మాత్రమే ఆడటం. అలాంటి దేవుడిని… కపిల్ దేవుడిని దగ్గరగా చూడటం, మాట్లాడటం, ఖఛ్చితంగా తెలుగులోనే పంచుకోగల ఆనందం. ఒక్కమాటలో చెప్పాలంటే తెలుగు ఎంత ఇష్టమో కపిల్ దేవుడూ అంతే.

ఢిల్లీ లో ఓ కార్పొరేట్ సమారోహం. పిలిచారు. రాలేనన్నాను. కపిల్ వస్తాడన్నారు. అయిదు పది నిముషాలు కపిల్ తో ప్రత్యేకంగా పరిచయం చేస్తామన్నారు. గుండె ఆగి కొట్టుకుంది. ఈ రోజేనా అని అడిగాను. వారం రోజులు రోజూ ఎదురు చూశా. ఆ రోజు… ఎదురుగా కపిల్…సన్నగా పొడుగ్గా చలాకీగా చురుగ్గా. అక్కడక్కడా నల్లటి జుట్టు కలిసిన తెల్లటి జుట్టు. గుబురు మీసాలు. చీల్చే చూపులు…కళ్ళు పులి కళ్ళు,  చిన్న నవ్వు హుందాగా…మనిషి గంభీరంగా.. కళ్ళు తిప్పుకోలేం. పులి ఎదురుగా నిలబడ్డట్లే ఉంది. గుండె 175 కొడుతోంది.

“మిమ్మల్ని కలవడం చాలా సంతోషం గా ఉంది” అన్నా. అంతకంటే చెప్పలేక పోయా. చెప్పాలంటే ఒక వాక్యంతో ఆగదే. వరద పారుతుంది. “నేను ఫలానా… రైల్వే లో పనిచేస్తా” అన్నా. కపిల్ అందుకుని “నేను ఆడే రోజుల్లో మాకు రైల్వే వాళ్ళు ఓ గోల్డెన్ పాస్ ఇచ్చే వారు. అది చూపించి టికెట్ రిజర్వ్ చేసుకునే వాళ్ళం. నేను నా కారుని పంపేసి రైలే ఎక్కేవాడిని. అవి చాలా సంతోషకరమైన రోజులు” అన్నాడు దేవుడు. “ రైల్వే వాళ్ళు దేశానికి చాలా సేవ చేస్తున్నారు. మరింతగా చేయండి” అన్నాడు. అవునని తలూపా. ఏమి మాట్లాడాలన్నా, అనవసరంగా నేను  మాట్లాడినట్లు అవుతుంది. దేవుడ్ని మాట్లాడనిస్తేనే బాగుంది అనుకున్నా. “ఆహా.. కపిల్ రైల్వే గురించి ఇలా అన్నాడు” అని ఓ కాప్షన్ రాసుకోండి అన్నాడు నన్ను తీసుకెళ్లిన వ్యక్తి.

నా పక్కన ఉన్న మరో వ్యక్తి ‘సర్ నేను ఫలానా.. మాదీ  హర్యానానే’ అన్నాడు హర్యానా హరికేన్ తో. “నాది ఇండియా” అన్నాడు కపిల్ వెంటనే తడుముకోకుండా. నేనెప్పుడూ ఫలానా నగరం నుండి అని పరిచయం చేసుకోను అన్నాడు. ఆమాట ఎదుటివారి మెప్పుకోలు కోసం అన్నట్లుగా లేదు. ఎంతో  మామూలు గా అన్నాడు కపిల్. అది  అతని నిజమైన  తత్త్వం. “మరిప్పుడు నాకు టికెట్ అవసరమైతే మీకు చెప్పొచ్చా” అంటూ నవ్వాడు. “సర్ మీరు అడగాలి గాని మీకోసం ఓ ప్రత్యేకమైన రైలు వేయమన్నా వేయిస్తాం”  అనేశా ఆవేశంగా. ఆయనెలాగూ అడగడు. కొద్దిసేపు నిశ్శబ్దం. ఫోటో అడగాలని ఉంది. ఏమనుకుంటాడో అని బెరుకుగానూ ఉంది. నాతో వచ్చిన వ్యక్తి ఓ ఫోటో తీసుకోండి అన్నాడు. కపిల్ కొంచెం ఇబ్బందిగా నవ్వాడు…అయినా ఫోటోకి ఫోజు ఇచ్చాడు. ఛాతి  చప్పన్ ఇంచులు పొంగింది. “ పిక్ విత్ ది టైగర్” అని పోస్ట్ చేద్దాం అనుకున్నా. వచ్చే ముందు మళ్ళీ చేయి కలిపి బయటికి నడిచా.

చిన్నప్పుడు మా ఊరికి ప్రచారరథం లో ఎన్.టీ.ఆర్ వస్తే ఆ గుంపులో తోసుకెళ్లి మరీ పదేళ్ల వయసున్న మా తమ్ముడు విశ్వ విఖ్యాత నట సార్వభౌముని షేక్ హాండ్ దక్కించుకున్నాడు. వాడు మురిసి పోతుంటే, ‘ఒరేయ్ ఆ చెయ్యి కడగకుండా అలాగే  దాచుకో”  అని మా నాన్న వాడిని ఆట పట్టించింది గుర్తొచ్చింది. కపిల్ తో చేయి కలిపాక ఇక ఆ రోజంతా మరెవ్వరితోనూ చెయ్యి కలపలేదు. ‘ఆన్ షేకింగ్ హాండ్స్’  అనే ప్రసిద్ధ  వ్యాసంలో  ఏ.జీ గార్డెనర్ అన్నట్లు “ there is a candour and courage in that hand”.


సభ మొదలైంది. మోమిన్ ఖాన్ చేతిలో 150 ఏళ్లనాటి 43 తంత్రుల సారంగి సమ్మోహనంగా రాగాలాపన చేస్తోంది. కపిల్ దగ్గరలోనే కూచుని ఉన్నాడు. పక్కన ఎవరూ లేరు. మనసు పీకుతోంది మరో ఫోటో కోసం. కానీ మొహమాటం. చూస్తుండగానే ఒకరి తరువాత ఒకరు క్యూ కట్టి (బలవంతపు) సెల్ఫీలు దిగడం మొదలు పెట్టారు కపిల్ తో. అసహనంగా ఉన్నా కాదన లేక పోతున్నాడు.

కపిల్  స్టేజ్ మీదికి రావడం తోటే అన్నాడు… “ నాకిచ్చిన డబ్బులకి  నే చేయాల్సిన పని అయిపొయింది. ఫొటోలకు ఫోజులు ఇచ్చేందుకూ డబ్బులు తీసుకుంటారని నాకు గతంలో తెలీదు.  ఇక ఇప్పుడు ఈ ఇరవై నిముషాలైనా  నాకిష్టమైన పని చేస్తా. మనం మాట్లాడుకుందాం. మనుషుల్ని కలవడం మాట్లాడటం కంటే ఆనందం ఏముంది. స్టేజి మీద నా పైన ఉన్న స్పాట్ లైట్ తీసేసి రూమ్ లో లైట్లు వెలిగించండి. మీ చిరునవ్వులు నాకు చూపించండి”  అన్నాడు. అప్పటి నుండి ఓ ఇరవై నిముషాలు ప్రశ్నోత్తరాలు జరిగాయి. కపిల్ మాట్లాడిన ప్రతీ మాటా చాలా సౌమ్యంగా ఉన్నా చాలా నిక్కచ్చిగానూ  సూటి గానూ  ఉన్నాయి.

“మీ కార్పొరేట్ వ్యవహారాలు నాకసలు అర్ధం కావు. మీరంతా ప్లాన్-ఏ, ప్లాన్-బీ అని మాట్లాడుతారు. నాకైతే మైదానంలో దిగిన తరువాత ఒకటే లక్ష్యం. గెలవడం. ప్లాన్-బీ అంటే ఓడి పోవడం. మీ ప్లాన్ నుండి మారుతున్నారు అంటే, మీరు బలహీనులని అర్ధం” అన్నాడు. “మీ ప్లాన్ పట్ల మీకు నిబద్దత  లేక పొతేనే మరో ప్లాన్ అవసరం”. “నా జీవితాన్ని  తపన, నిబద్దత, నాపై నాకున్న నమ్మకం తోనే నిర్మించుకున్నా” అన్నాడు. జీవితంలో ప్రతిభ కంటే నిబద్దత ముఖ్యం. నిబద్ధత లేని ప్రతిభ వ్యర్థం. మా టీమ్ లో అందరికన్నా ప్రతిభ తక్కువ ఉన్న బ్యాట్సమన్ ఉండే వాడు (ఆ పేరు చెప్పాడు కానీ ఇక్కడ రాయడం లేదు). కానీ అతని నిబద్దత ముందు ఎవరూ నిలవరు. నేనతనికి చెప్పే వాడిని … నువ్వు రన్స్ చేయక పోయినా పరవాలేదు. క్రీజ్ దగ్గర నిలబడు. బౌలర్స్ ని అలసిపోయేట్లు చెయ్యి. తరువాత రన్స్ అవే  వస్తాయి అని. దేశం మొత్తం అతడిని  తిట్టి పోసేది. కానీ అతను కెప్టెన్ చెప్పినట్లే ఆడేవాడు. మేము గెలిచే వాళ్ళం. అది అతని నిబద్దత. అలాగే, నా మీద టీమ్ లో చాలా మందికి నమ్మకం ఉండేది కాదు. నేను మాత్రం నన్ను నమ్మాను, ఇండియా గెలుస్తుంది అని నమ్మాను.” అన్నాడు. “ఆట  ముగిశాక ఇండియా గెలిచిందా లేదా అనేదే చూడాలి. ఇండియా ఓడిపోయాక ఏ ఆటగాడు ఎన్ని  రన్స్ చేశాడని అడగటం అనవసరం, చర్చించడం అనవసరం”  అన్నాడు కపిల్.

కపిల్ కొనసాగించాడు “మీరు ఈ క్షణంలో జీవించండి. అదే మీ గెలుపుకి బాటలు వేస్తుంది. మీరంతా నాతో ఫోటోలు తీసుకుంటూ పోస్ట్ చేయడం, షేర్ చెయ్యడంలోనే ఉన్నారు. మీరు ఇక్కడ ఈ క్షణంలో  జీవించడం లేదు. మీరిక్కడ ఉన్నా, మీ మనసంతా పోస్ట్ ఎవరు చూస్తారో, ఎంతమంది చూస్తారో, ఏమనుకుంటారో అనే ఆతృతే.  మైదానంలో దిగిన తరువాత మేము మనసుకు గంతలు కట్టుకుంటాం. అప్పుడు ఆక్షణం పూర్తిగా జీవిస్తాం. తరువాత అప్పుడేమి చేశావు అంటే నేను చెప్పలేను. ఎందుకంటే నా మనసు ఆడటం మీదే నిమగ్నం అయ్యేది. చుట్టూ ఏమి జరిగిందో నాకు తెలీదు” అన్నాడు.  నేను నా హీరోని కలిసినప్పుడు “ఫోటో కావాలా” అంటే వద్దన్నాను. పది నిముషాలు నాతో మాట్లాడమని ప్రాధేయపడ్డాను. నాకు నా హీరో గొప్పతనం తెలియాలి అతని ఆలోచన తెలియాలి, ఆచరణ తెలియాలి గాని ఫోటోతో నాకు పని లేదు” అన్నాడు కపిల్. “అందుకే మా ఇంట్లో క్రికెట్ కి సంబంధించిన ఒక్క ఫోటో కూడా గోడకి వేలాడదీసి ఉండదు” అన్నాడు.

ఈ మాటలు చెప్తూనే, కపిల్ మరో మంచి సందేశం ఇచ్చా డు. “నా జీవితంలో నాకు ఎప్పుడూ ఒక్కడే హీరో ఉండరు. నా హీరోలు మారుతూ ఉంటారు. గతాన్ని పట్టుకుని వేలాడను. కొత్తగా నేర్చుకుంటూనే ఉంటాను. నా పని నేను చేసుకుంటాను,  డ్రైవర్ రాని  రోజు కార్ కడుక్కోవడం తో సహా ” అన్నాడు. అక్కడున్న వారు రకరకాల ప్రశ్నలు వేశారు. స్టేజి దిగి చలాకీగా తిరుగుతూ సమాధానాలు చెప్పాడు. మీ జీవితంలో ఒక హీరో గురించి చెప్పామన్నారు ఎవరో.  “చెప్తాను.ఎందుకో కూడా చెప్తాను”  అన్నాడు కపిల్.

నెల్సన్ మండేలాను నేను కలవడానికి ఏర్పాటు జరిగినప్పుడు నా కూతురు కూడా నాతో వస్తానంది. సరేనని వాళ్ళ స్కూల్ ప్రిన్సిపాల్ దగ్గరకి వెళ్లి సెలవు ఇవ్వమని అడిగా. నెల్సన్ మండేలాని కలవాలి అని చెప్పినా పరీక్షలున్నాయి కుదరదన్నారు. నేను చాలా ప్రాధేయపడ్డ తర్వాత  ఒక షరతు మీద సరే అన్నారు. అదేమిటంటే, మీ అమ్మాయి నెల్సన్ మండేలా తో తీసుకున్న ఫోటో తెచ్చి  మా స్కూల్ కి ఇవ్వాలి.  మేము నోటిస్ బోర్డు లో పెట్టుకుంటాం. అలా అయితేనే సెలవు ఇస్తాము అన్నారు.” అని కపిల్ అనడం తో ఒక్క సారిగా రూమ్ మొత్తం నవ్వులతో నిండి పోయింది. “ తప్పని సరిగా సరే అన్నాను.” అన్నాడు కపిల్.

“నేనూ మా అమ్మాయి మండేలాను కలిశాము. ఆరడుగుల ఎత్తు నల్లటి మనిషి. తెల్లటి జుట్టు. కొద్ది సేపు మాటలయ్యాక, ఫోటో తీసుకోక పోతే ప్రిన్సిపాల్ ఏమంటుందోనని నాకు ఆరాటం గా ఉంది. మొహమాటం వదిలి మండేలాను అడిగా. ఫోటో కావాలి అని. ఆయన చిరునవ్వుతో రమ్మన్నాడు. నాకు కాదు మా అమ్మాయికి అన్నా. మరింత సంతోషంగా సరే అన్నాడు ఆయన. ఏదీ, ఇటు చూసే సరికి మా అమ్మాయి నక్కి నక్కి నా వెనకాల దాక్కుంది. ‘డాడీ నాకు ఫోటో వద్దంటే వద్ద’ని గొణగడం మొదలు పెట్టింది. నేను నెమ్మదిగా చెప్పి చూశా. తను ఒప్పుకోవడం లేదు. నాకేమో మండేలా ముందు ఈ పరిస్థితి ఇబ్బందికరం గా ఉంది. ఆయన్ను అవమాన పరిచినట్లు అనిపించింది. ఇదంతా మండేలా గమనిస్తూనే ఉన్నాడు. నెమ్మదిగా అడుగు ముందుకు వేసి మా అమ్మాయిని ఉద్దేశిస్తూ మండేలా అన్నాడు “లిటిల్ ఏంజెల్, రా ఫోటో తీసుకుందాం. నల్లగా ఉన్న వాళ్ళంతా చెడ్డవాళ్లు కాదులే.”  కపిల్ కొనసాగించాడు… “వర్ణవ్యవస్థ కి వ్యతిరేకంగా పోరాటమే జీవితం అయిన  వ్యక్తి,  27 ఏళ్ళు జైలులో ఉంచినా, విడుదలయ్యాక అందరినీ క్షమించిన వ్యక్తి ఆమాట అనడంతో నా జీవితంలో అతి గొప్ప హీరో అయ్యాడు. మంచి చెడులకు రంగు లేదని ఆయన సూచించాడు”. ఈ సంఘటన చెప్తుంటే,  కపిల్ కళ్ళ ల్లో ప్రస్ఫుటంగా నీళ్లు తిరిగాయి.

పులి కళ్ళల్లో నీళ్లు చూశా… మనసున్న పులి.

నా హీరో ఆలోచన తెలిసింది.ఆచరణా తెలిసింది. ఇక ఫోటోతో నాకు పనిలేదు. అందుకే ఈ కథనం తో పాటు ప్రచురించడం లేదు.

-విప్పగుంట రామ మనోహర

RELATED ARTICLES

Most Popular

న్యూస్